
వాహనాలకు ఆకతాయిల నిప్పు
తిరుపతిక్రైం, న్యూస్‌లైన్: తిరుపతిలో వాహనాలకు భద్రత కరు వైంది. ఇంటిముందు పార్క్ చేసిన వాహనాలను ఇంతకాలం దొంగలెత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఏకంగా ఆకతాయిలు నిప్పే పెడు తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆకతాయిల చేష్టల వల్ల నాలుగు బైక్‌లు, కారు కాలిపోయాయి. కొర్లగుంట వివేకానంద వీధిలో వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డు ఉద్యోగి సుబ్రమణ్యంరెడ్డి నివాసం ఉంటున్నారు.
ఆయన ఆదివారం రాత్రి తన కారు, స్ల్పెండర్‌ప్లస్ బైక్‌ను ఇంటిముందు రోడ్డుమీద పార్కు చేశారు. అదే వీధిలో వాసుదేవరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన స్కూటీ పెప్(ఎపి03 ఎసి3740)ను, అదే ఇంటిలో అద్దెకు ఉంటున్న ఇద్దరు ఎస్వీ మెడికల్ కళాశాల విద్యార్థులు కారుణ్య, సురేష్‌కు చెందిన రెండు బైక్‌లను ఇంటిముందు పార్క్ చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సుబ్రమణ్యంకు చెందిన కారుతోపాటు పక్కన పార్క్ చేసిన బైక్ మంటల్లో కాలుతుండడాన్ని పొరుగింటివారు గుర్తించి కేకలు వేశారు.
అప్పటికే కారు వెనుకభాగం, బైక్ పూర్తిగా కాలిపోయాయి. వారు సుబ్రమణ్యంరెడ్డిని నిద్రలేపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేసి వెళ్లిపోయారు. తర్వాత మరో 25 నిమిషాలకు వాసుదేవరెడ్డికి చెందిన స్కూటీ పెప్‌తోపాటు అద్దెకు ఉంటున్న వైద్యవిద్యార్థుల బైక్‌లు సైతం కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సంఘటన జరిగిన రెండు ప్రాంతాలను ఈస్ట్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆకతాయిల పనే..
రాత్రిళ్లు మందుబాబులు, ఆకతాయిలు కొర్లగుంట, తుడా సర్కిల్ ప్రాంతాల్లో నిత్యం తిరుగుతుంటారు. తుడారోడ్డులో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటితోపాటు పెద్దకాపు లే అవుట్‌లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో రాత్రి పొద్దుపోయేంతవరకు మద్యం విక్రయాలు జరుపుతుంటారు. అక్కడ మద్యం సేవించిన అకతాయిలు పక్కనే ఉన్న వివేకానంద వీధిలో రోడ్డుమీద పార్క్ చేసిన బైక్‌లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. తుడా సర్కిల్‌లో రాత్రిళ్లు రెండు గంటల వరకు ఫుట్ పాత్‌మీద టిఫిన్లు విక్రయిస్తుండడంతో మందుబాబులు అరుపులు, కేకలతో ఆప్రాంతమంతా అర్ధరాత్రి దద్దరిల్లుతూంటుంది.
గస్తీ పోలీసులు ఉన్నట్టా లేనట్టా..
ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లగుంట వివేకానందవీధిలో నైట్ బీట్‌లో ఉన్న కానిస్టేబుళ్లు రాత్రి ఆ ప్రాంతానికి గస్తీకి వెళ్లారా?లేదా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ తిరుగుతుంటే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నైట్ బీట్‌లను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమంది నైట్ బీట్‌లో ఉన్న పోలీస్ సిబ్బంది మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నారనే అరోపణలు కూడా వినిపిస్తున్నాయి.