
జల్సాల కోసం.. ఎంతకైనా తెగిస్తారు
కాకినాడ క్రైం :దేశాభ్యున్నతికి పాటుబడాల్సిన ఆ విద్యార్థులు నేరాల బాట పట్టారు. కష్టపడి చది వించిన తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేశారు. జల్సాలకు అలవాటు పడి పథకం ప్రకారం చోరీలు సాగించారు. ఓ రిటైర్డ్ ఉద్యోగిని కూడా హతమార్చారు. ఈ నేరాల్లో కొంద రు విద్యార్థులతో పాటు చదువు మానేసి వివిధ పనులు చేసుకుంటున్న మరికొందరు కూడా కలిశారు. మొత్తం ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసి, రూ.11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాజమండ్రి త్రీ టౌన్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామిరెడ్డి విజయ భాస్కర రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కాకినాడ ప్రతాప్‌నగర్‌కు చెందిన కొండపల్లి అరుణ్‌కుమార్ అలియాస్ అరుణ్ బీఎస్సీ ఫైనలియర్ చదువుతూ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కాకినాడ ప్రతాప్‌నగర్ ట్రెజరీకాలనీకి చెందిన అరుణ్ స్నేహితుడు కాకరపర్తి సాయిరవికాంత్ అలియాస్ రవి రాజమండ్రి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కరప మండలం పెద్దాపురప్పాడుకు చెందిన మేకా గోపి బీకాం చదివాడు. ప్రస్తుతం విశాఖ జిల్లా ఆదర్శనగర్ రైల్వే గేటు వద్ద నివసిస్తున్నారు. పెద్దాపురం మండలం జె.తిమ్మాపురానికి చెందిన పిన్నమరాజు ప్రశాంత్‌వర్మ అలియాస్ ప్రశాంత్ కాకినాడలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. స్థా నిక కొండయ్యపాలేనికి చెందిన మజ్జి విజయ్‌కుమార్ అలియాస్ ఈక ఏడో తరగతి చదివి, కూ లీ పని చేసేవాడు.
2008లో చోరీ కేసులో పోలీ సులకు పట్టుబడి, మూడు నెలల జైలు శిక్ష అనుభవించాడు. కాకినాడ త్రీటౌన్ క్రైం స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. మరో 4 కేసులు పెండింగ్ లో ఉండడంతో బెయిల్‌పై వచ్చి, మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. కరప మండలం పెద్దాపురప్పాడు కు చెందిన బిరుదా మాచారావు అలియాస్ మ హేష్ ఇంటర్ చదువుకున్నాడు. జల్సాలకు అల వాటు పడ్డ మాచారావు తన అమ్మమ్మ, తాతయ్యలను బెదిరించి రూ.80 వేల విలువైన బం గారు ఆభరణాలను అపహరించాడు. స్థానిక కొండయ్యపాలేనికి చెందిన కొశిరెడ్డి సాయికుమార్ అలియాస్ సాయి నాలుగో తరగతి చది వాడు. సైకిల్, స్కూటర్ మెకానిక్, కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. స్థానిక జగన్నాథపురం రెవె న్యూ కాలనీకి చెందిన చార్లెస్ రిక్‌సన్ జోసెఫ్ బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి, విశాఖ పట్నం సీతమ్మధారలో ఉంటున్నాడు.
ఇలాఉండగా అరుణ్‌కుమార్, రవి, గోపి, ప్రశాంత్, మాచారావు, చార్లెస్.. హైస్కూల్, కాలేజీల్లో స్నేహితులు. గోపి కారు డ్రైవర్ కావడంతో, అతడికి సాయితో పరిచయం ఏర్పడింది. గోపికి మాచారావు బాల్య స్నేహితుడు. చిన్న చిన్న నేరాలకు పాల్పడే వీరంతా ఏడాది క్రితం ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవారు. ఈ నెల ఒకటిన స్థానిక జీపీటీ సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న కాకరమూడి అనురాగం అలియాస్ అనురాధ (61)ను హతమార్చి, బంగారం దొంగిలించారు. ఆమె వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన సాయికుమార్ తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ ప్రాంతంలో సాయి, విజయ్‌కుమార్, మాచారావు, చార్లెస్ బయట కాపు కాయగా, అరుణ్‌కుమార్, రవికాంత్, గోపి, ప్రశాంత్ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ప్రతిఘటించడంతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం బంగారు ఆభరణాలతో వెనుక గేటు నుంచి పరారయ్యారు.
మరిన్ని నేరాలు
గతేడాది సెప్టెంబర్ 11న స్థానిక ప్రతాప్‌నగర్‌లో రూ.3.25 లక్షల విలువైన బంగారం, ఈ ఏడాది జూన్ 10న కరప మండలం పెద్దాపురప్పాడులో రూ.80 వేల విలువైన బంగారం, 23న విశాఖపట్నం కంచరపాలెంలో రూ.80 వేల విలువైన బంగారం, ఇతర వస్తువులు దొంగిలించారు. కాకినాడలో ఏడాది కాలంలో 13 బైక్‌లు అపహరించారు. ఒంటరి మహిళల మెడలో ఆభరణాలు తస్కరించారు.
నిందితులు దొరికిందిలా..
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్థానిక శాంతినగర్‌లోని పాత ఆర్టీఓ ఆఫీసు జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రెండు వాహనాలపై నలుగురు యువకులు వారికి అనుమానాస్పదంగా తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య, దోపిడీలు, చోరీలు, చైన్‌స్నాచింగ్‌ల విషయం వెలుగు చూసింది. ఎనిమిదిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.11 లక్షల విలువైన 280 గ్రాముల బంగారం, రెండు సెల్‌ఫోన్లు, 13 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకుని, ఆయా కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ జి.విజయ్ కుమార్, డీఎస్పీ విజయభాస్కర రెడ్డి ప్రశంసించారు. క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, త్రీటౌన్ క్రైం ఎస్సై సీహెచ్ మహేశ్వర రావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.