
బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ సాయిరమణ
సాక్షి, ఖమ్మం : ఖమ్మం నగరంలో పట్టపగలు చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఓ రిటైర్డ్ ఉద్యో గి బ్యాంక్ నుంచి రూ.50 వేలు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ అగంతకుడు ఆయన్ను అనుసరించి..అడ్రస్సు అడిగి ఏమార్చి.. చేతిలో ఉన్న రూ.50 వేలు ఉన్న బ్యాగును లాక్కొని ఉడాయించాడు. బాధితుడి కథనం ప్రకారం.. నగరంలోని 10వ డివిజన్ రాధాక్రిష్ణనగర్‌లో నివాసం ఉండే పంచాయతీ రాజ్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి లగడపాటి కృష్ణమూర్తి సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచి నుంచి నగదు డ్రా చేసుకోని అక్కడే ఆటో ఎక్కాడు.
పాలడెయిరీ ఎదురుగా ఆటో దిగి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంప్ కార్యాలయం పక్కనే ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే క్రమంలో వెనక నుంచి ఒక ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక యువకుడు కృష్ణమూర్తిని ఆపి అడ్రసు అడిగి.. ముందుకు వెళ్లిపోయాడు. అనంతరం కృష్ణమూర్తి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు గేటు తీస్తుండగా.. చేతిలో నగదుతో ఉన్న బ్యాగును లాక్కొని బైక్‌పై ఉడాయించాడు. రెప్పపాటులో జరిగిన సంఘటనతో ఆందోళన చెందిన రిటైర్డ్ ఉద్యోగి కేకలు వేశారు.
ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో అగంతకుడు క్షణాల్లో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సాయిరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డెయిరీకి ఎదురుగా ఉన్న దుకాణంలో సీసీ ఫుటేజిని కూడా పరిశీలించి ద్విచక్రవాహనంపై వచ్చిన అగంతకుడి కోసం ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment