కేంద్రమే అప్పుల ఊబిలో.. రాష్ట్రానికి ఏమిస్తది? | CM KCR Fires On Central Government Over Funds In Assembly Session In Hyderabad | Sakshi
Sakshi News home page

కేంద్రమే అప్పుల ఊబిలో.. రాష్ట్రానికి ఏమిస్తది?

Published Sat, Oct 9 2021 1:41 AM | Last Updated on Sat, Oct 9 2021 9:41 AM

CM KCR Fires On Central Government Over Funds In Assembly Session In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కేంద్రమే అప్పుల ఊబిలో ఉంది.. ఇంక తెలంగాణకు ఏమిస్తది? కేంద్రానికి మనకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ అప్పులున్నాయి. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వట్లేదు.. కేంద్రానికే తెలంగాణ ఇస్తోంది. ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది రూ.42 వేలకోట్లు.. కానీ తెలంగాణ నుంచి వెళ్లిన మొత్తం రూ.2.74 లక్షల కోట్లు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆర్‌బీఐ నివేదికే చెప్తోంది..’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌), అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం), రాజాసింగ్‌ (బీజేపీ), జీవన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) ప్రస్తావించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత చేశాయని, కానీ బాగా, గొప్పగా చేశామనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

సంక్షేమానికి ఏడేళ్లలో రూ.74,165 కోట్లు ఖర్చు 
‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరూ చేయనన్ని సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్త్రీశిశు సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.21,663 కోట్లు అయితే.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడేళ్లలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.74,165 కోట్లు వెచ్చించింది. అదీ మా నిబద్ధత. ఎస్సీ సంక్షేమం కోసం 2004 నుంచి 2014 వరకు రూ.6,198 కోట్లు ఖర్చు పెట్టారు. మేం ఏడేళ్లలో రూ.23,296 కోట్లు ఖర్చు చేశాం. ఎస్టీ సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3,430 కోట్లు ఖర్చుచేస్తే.. మేం రూ.14,447 కోట్లు ఖర్చుపెట్టాం. బీసీ వెల్ఫేర్‌ కోసం కాంగ్రెస్‌ రూ.6,593 కోట్లు ఖర్చుపెడితే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.19,535 కోట్లు ఖర్చు చేసింది. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్‌ రూ.925 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.6,971 కోట్లు ఖర్చు పెట్టింది. స్త్రీశిశు సంక్షేమానికి కాంగ్రెస్‌ రూ.4,510 కోట్లు ఖర్చు చేస్తే.. మేం రూ. 9,916 కోట్లు ఖర్చు చేశాం. 

బీజేపీ నేతలవి ఉత్త మాటలు 
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు అయితే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలు. ఈ విషయంలో కేంద్రంతో పోలిస్తే రెట్టింపులో ఉన్నాం. అలాంటప్పుడు తెలంగాణకు ఏం ఇస్తారు? కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఇచ్చే నిధులు తప్ప.. ఒక్కపైసా కూడా కేంద్రం నుంచి రావడం లేదు. ఏడున్నర ఏళ్లలో కేంద్రం నుంచి రూ.42 వేల కోట్లు వస్తే.. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన మొత్తం రూ.2.74 లక్షల కోట్లు. తెలంగాణనే కేంద్రానికి ఇస్తోంది. అప్పుల ఊబిలో ఉన్న కేంద్రం తెలంగాణకు ఇచ్చేదేమీ లేదు. కేంద్రం నిధులిస్తోందని, రాష్ట్రం మళ్లిస్తోందని బీజేపీ నేతలు ఉత్త మాటలు చెప్పడం ఆపేయడం మంచిది. కేంద్రమే డయ్యింగ్‌ పొజిషన్‌లో ఉంది. ఇక మేం నిధులు డైవర్ట్‌ ఎక్కడ చేస్తాం?  

ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరుస్తున్నాయి 
అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎంతో చేశామని చెప్పుకొనే గత ప్రభుత్వాలు బోనాల పండుగను ఎనాడైనా పట్టించుకున్నాయా? ధర్మపురి నుంచి మొదలుకొని వేములవాడ, బాసర సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. యాదాద్రి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయబోతున్నాం. నవంబర్‌ ఆఖరులో గానీ డిసెంబర్‌ మొదటి వారంలోగానీ సుదర్శన యాగం చేసి ఆలయాన్ని ప్రారంభిస్తాం. ప్రధానిని, రాష్ట్రపతిని కూడా ఆహ్వానించాం.  

ఫీల్డ్‌ అసిస్టెంట్ల అంశాన్ని పరిశీలిస్తాం 
ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించాకే నిధుల వినియోగం పెరిగి, ఆస్తుల కల్పన జరిగింది. ఫీల్డ్‌ అసిస్టెంట్ల వ్యవస్థ పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా తయారైంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉద్యోగులు కాకపోయినా తామేదో ఉద్యోగులం అనుకుంటున్నారు. వారిని మేం తొలగించలేదు. వారే సమ్మెలోకి వెళ్లారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తాం. 

రోశయ్య సభకు ఉరితాడు తెచ్చుకున్నడు 
కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని మేం అనట్లేదు. మంచిగా చేయలేదని అంటున్నాం. కాంగ్రెస్‌ కరెంట్, నీళ్లు ఇవ్వలేదు. మేం ఇస్తున్నాం. గతంలో కరెంట్‌ ఇవ్వలేకపోతే అసెంబ్లీలోనే ఉరేసుకుంటానని రోశయ్య అన్నారు. ఆయన తన సూట్‌కేçసులో ఉరితాడు కూడా తెచ్చుకున్నాడు. మేమందరం వారించాం. ఓ ప్రపంచ మేధావి కూడా కరెంట్‌ ఇస్తానని చెప్పి.. ఇవ్వలేకపోయారు. కానీ మేం కరెంటు కోసం రూ.20వేల కోట్లు ఖర్చు పెట్టినం. 4 వేల మెగావాట్ల కరెంటును ఎన్టీపీసీ నుంచి కొట్లాడి తెచ్చుకుంటున్నం. 3,500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ తెచ్చినం. కాంగ్రెస్‌కు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ లేవు. టీఆర్‌ఎస్‌కు ఉన్నాయి. 

అన్ని వర్గాలకు మేలు.. 
రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు దక్కని ఏ వర్గం ఉండకూడదనేదే మా అభిమతం. దేశంలో ఎక్కడా లేనివిధంగా హోంగార్డులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం రిస్క్‌ అలవెన్స్‌ ఇస్తున్నం. బీసీల్లోని సామాజిక వర్గాలన్నింటికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. అగ్రవర్ణాల వారికి కూడా సామాజిక భవనాల కోసం స్థలాలు ఇచ్చాం. 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం మళ్లీ అర్జీలు స్వీకరిస్తాం. అనాథల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాం. సచివాలయంలో మసీదు, గుడి పెద్దగా నిర్మిస్తాం. 

కేజీ టు పీజీ బదులు గురుకులాలు 
‘కేజీ టు పీజీ’ విద్య అనేది నా కల. అయితే పిల్లల నిపుణులు, సైకాలజిస్టులు 5వ తరగతిలోపు పిల్లలకు నిర్భంద విద్య వద్దని సూచించారు. అందుకే 6వ తరగతి నుంచి విద్యార్థులకు గురుకులాల్లో విద్యను అందిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై గురుకులాల్లో రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. కేజీ నుంచి 5వ తరగతిలోపు పిల్లలకు మరింత మెరుగైన విద్య అందించే విషయాన్ని అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది.’’ 

అప్పిచ్చువాడు, వైద్యుడు.. అందుకే వలసలు 
తెలంగాణలో ఉపాధి పెరిగిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పనికి, ఉపాధికి మన కూలీలు సరిపోవడం లేదన్నారు. ఒకనాడు మనం వలసపోయామని.. కానీ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షలకుపైగా కార్మికులు ఇక్కడికి వలస వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని పద్యాన్ని గుర్తు చేశారు. 

‘‘అప్పిచ్చువాడు, వైద్యుడు, 
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్‌ 
జొప్పడిన యూర నుండుము, 
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ’’ 

.. అని పద్యం ఉంది. తెలంగాణలో అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు. అద్భుతమైన వైద్యం ఉన్నది. నీళ్లు, కరెంట్‌ ఉన్నాయి. ఉపాధి దొరుకుతోంది. అందుకే బెంగాల్, యూపీ నుంచి వచ్చి కార్మికులు వచ్చి నాట్లు వేస్తున్నారు. బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పత్తి ఏరడానికి వస్తున్నారు. కర్నూల్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు పత్తి ఏరేందుకు కూలీలు వస్తున్నారు. ఒకప్పుడు ముంబైకి వలసలు కట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి పనులు చేస్తుంటే సంతోషంగా ఉంది’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తాము తప్పులు చేస్తే విమర్శించవచ్చని, కానీ అనవసరంగా రాష్ట్ర పరువును బజారున పడేయొదని ప్రతిపక్షాలకు స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement