పెన్షన్‌తో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి | Pension Retirement Benefits | Sakshi
Sakshi News home page

పెన్షన్‌తో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి

Published Tue, Jun 23 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

Pension Retirement Benefits

 కాకినాడ సిటీ :పెన్షన్‌తో కూడిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు కాకినాడలోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సుమారు నాలుగు గంటలపాటు ఆందోళన చేశారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష గ్రాట్యుటీ చెల్లించాలని, చివరి నెల వేతనంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని, యూనియన్ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.15 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు జి.బేబీరాణి మాట్లాడుతూ, సుమారు 40 ఏళ్ల నుంచి అతి తక్కువ వేతనాలతో పని చేస్తూ ప్రజలకు సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలకు పెన్షన్ ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. అరవయ్యేళ్లు నిండినవారందరికీ రిటైర్‌మెంట్ కల్పిస్తూ జీఓ నంబర్ 20 విడుదల చేసిన ప్రభుత్వం.. వర్కర్‌కు రూ.50 వేలు, హెల్పర్‌కు రూ.20 వేలు గ్రాట్యుటీ చెల్లిస్తామని ప్రకటించిందన్నారు. అంగన్‌వాడీ ప్రతినిధులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
 సీడీపీఓపై చర్యలు తీసుకోవాలి
 అంగన్‌వాడీలతో ఇంటి పనులు చేయించుకుంటున్న తుని అర్బన్ సీడీపీఓపై చర్యలు తీసుకోవాలని బేబీరాణి డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పనివేళల్లో కూడా ఇంట్లో పని చేయాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంటిపనికి రాని వారిని తప్పుడు కారణాలు చూపి మెమోలు ఇవ్వడం, కేంద్రాలకు వెళ్లి అసభ్యకరంగా తిట్టడం వంటి కక్ష సాధింపు చర్యలకు సీడీపీఓ పాల్పడుతున్నారన్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టీపట్టనట్టు వ్యవహరించడం తగదని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు టి.సావిత్రి, సీపీఎం నాయకులు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement