ఈ-పాస్‌తో తప్పని అవస్థలు
జాబితాలో పేరు లేదంటున్న డీలర్లు
ఊరూరా తిరుగుతున్న అంగన్‌వాడీలు
నేరుగా సరఫరా చేయాలని డిమాండ్
కాకినాడ రూరల్ :రేషన్ షాపుల ద్వారా సరకులు పంపిణీ చేసే విధానం అంగన్‌వాడీ కార్యకర్తలకు శిరోభారంగా మారింది. ఈ-పాస్ సక్రమంగా పనిచేయకపోవడంతో రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.జిల్లాలో 24 ప్రాజెక్టుల పరిధిలో 5,446 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 40,572 మంది గర్భిణులు, 41,956 మంది బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సు పిల్లలు 2,09,862 మంది ఉన్నారు.
నెల తొలివారంలోనే అంగన్‌వాడీ సిబ్బంది తహశీల్దార్ కార్యాలయాల్లో సెంటర్ల వివరాలు అంజేశారు. దీనికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న రేషన్ షాపులకు బియ్యం, నూనె, కందిపప్పు సరఫరా చేశారు. ఇలాఉండగా అంగన్‌వాడీలు జీతాలు పెంపు కోసం నెలాఖరు వరకు సరకులు తీసుకెళ్లలేదు. దీంతో ఈ నెల 22లోగా సరకులు తీసుకెళ్లాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అప్పటికప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తలంతా ఉరుకులు, పరుగులపై సరకులు తీసుకెళ్లేందుకు రేషన్ డీలర్ల వద్దకు పరుగులు తీశారు. వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం, ఆధార్ వివరాలు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలతో పాటు ఈ-పాస్ యంత్రం పనిచేయకపోడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు కంగుతిన్నారు. ఆధార్ నంబర్ సక్రమంగా నమోదు కాలేదని, అధికారులను అడగాలంటూ డీలర్లు చెబుతుండడంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏమీ పాలుపోవడం లేదు.
లిస్టులో పేరు లేక ఇబ్బందులు
నగరపాలక సంస్థ, గ్రామీణ ప్రాంతాల అంగన్‌వాడీ కేంద్రాల్లోని రేషన్ షాపులకు అంగన్‌వాడీలు వెళితే, తమ షాపు వద్ద అంగన్‌వాడీ కేంద్రం లిస్టు లేదని, వేరే ఊరిలో ఉన్న రేషన్ షాపులో సరకులు తీసుకోవాలని డీలర్లు చెబుతున్నారు. దీంతో అంగన్‌వాడీలు వారి షాపు కోసం ఊరూరా తిరుగుతున్నారు. సరకుల కోసం రోజంతా రేషన్ షాపు వద్దే పడిగాపులు కాాయాల్సిన పరిస్థితి నెలకొందంటూ వారు మండిపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి సరకులు తరలించడానికి సొంత సొమ్ము ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల సరకులు ఇవ్వలేదు
ఈ-పాస్‌లో వేలిముద్ర పడడం లేదని ఈ నెల సరకులు ఇవ్వలేదు. మళ్లీ మీ-సేవకు వెళ్లి ఈ-పాస్ చేయించుకున్నాను. త్వరగా తప్పులు సవరించి, అంగన్‌వాడీ కేంద్రాలకు సరకులు అందించాలి.
- టి.నీరజ, అంగన్‌వాడీ కార్యకర్త
రవాణా ఖర్చులు భరించలేం
అంగన్‌వాడీ కేంద్రానికి సరకులు తరలించడానికి ఇబ్బందులు పడుతున్నాం. నేరుగా కేంద్రానికి సరకులు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తక్కువ జీతం వచ్చే మేము రవాణా ఖర్చులు భరించలేం.ఇబ్బందిగా మారింది.
- సీహెచ్ శారద, అంగన్‌వాడీ కార్యకర్త
సరకులు ఎక్కడ
Published Sun, Dec 27 2015 12:48 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement