యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వాణిజ్యవేత్తలుగా మారడం, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం భారతదేశంలో అంత సులభతరం కాదని, దేశంలో త్వరగా ఎదిగే వాణిజ్యవేత్తలను అనుమానంగా చూసే సంస్కృతి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం ఇంకా చాలా ఎదగాల్సి ఉందని, 1987లో జీడీపీ పరంగా చైనా, భారత్ ఒకే విధంగా ఉన్నా ప్రస్తుతం అమెరికా కంటే చైనా కేవలం ఒక అడుగు మాత్రమే వెనుకంజలో ఉందని పేర్కొన్నారు.
ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ‘ప్లాస్ట్ ఇండియా 2023’సందర్శకుల రిజిస్ట్రేషన్ యాప్‌ను కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాతీలు వారసత్వంగా వచ్చే వ్యాపారాల్లో ఉంటూనే కొత్త రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారని కొనియాడారు. గుజరాతీ ఎంట్రప్రెన్యూర్స్‌ను ఆదర్శంగా తీసుకుని దేశంలో ఎంట్రప్రెన్యూర్ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడిదారులు తెలంగాణ లాంటి అనువైన రాష్ట్రాన్ని ఎంచుకుని కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్లాస్టిక్ రంగానికి ప్రోత్సాహకాలు..
ప్లాస్టిక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2014కు ముందు రాష్ట్రంలో 10 వేలకు పైగా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 15 వేలకు చేరిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 144 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పార్కులో 149 కంపెనీలకు స్థలం కేటాయించగా రూ.847 కోట్ల పెట్టుబడి వచ్చిందన్నారు.
102 యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించగా, మరో 25 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నాయని, ఈ పార్కు ద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. తిరిగి ఉపయోగించే వీలున్న ప్లాస్టిక్ పైనే యూనిట్లు దృష్టి సారించాలని, ప్లాస్టిక్‌కు సరైన ప్రత్యామ్నాయం చూపడం ద్వారానే పూర్తి స్థాయిలో నిషేధం సాధ్యమవుతుందని అన్నారు.
పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే ప్లాస్ట్ ఇండియా 2023 గురించి మాట్లాడుతూ.. ఢిల్లీతో తమకు ఇటీవలి కాలంలో సత్సంబంధాలు లేవని చమత్కరించారు. కాగా, ప్లాస్ట్ ఇండియా ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. 2025 నాటికి తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న విశాఖ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ జిగేశ్ దోషి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అజయ్‌షా, కో చైర్‌పర్సన్ పద్మజారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment