commercial sectors
-
‘వ్యాపార రంగాల్లో మహిళల జైత్రయాత్ర’
సాక్షి, హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీను టెక్నాలజీ కంపెనీకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఎక్స్‌లెన్స్ అవార్డ్ దక్కింది. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా శ్రీను టెక్నాలజీ ఎండీ చిల్కా కావ్యశ్రీ అందుకున్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో ఉన్న వనరులను వినియోగించుకొని వ్యాపార రంగాల్లో మహిళలు జైత్రయాత్ర సాగించడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా యువ దళిత మహిళ కావ్యశ్రీని అభినందించారు. భవిష్యత్‌లో మరింత ఎదగాలని ఆకాక్షించారు. సదస్సులో కేంద్ర మాజీ మంత్రి కె.జె ఆల్ఫాన్స్, సిక్కిం మాజీ గవర్నర్ బి.సి.సింగ్, మాజీ ఎంపి జె.కె.జెయిన్, సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది జి.వి.రావు తదితరులు హాజరయ్యారు. -
దేశంలో ఎంట్రప్రెన్యూర్ సంస్కృతి పెరగాలి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్యవేత్తలుగా మారడం, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం భారతదేశంలో అంత సులభతరం కాదని, దేశంలో త్వరగా ఎదిగే వాణిజ్యవేత్తలను అనుమానంగా చూసే సంస్కృతి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం ఇంకా చాలా ఎదగాల్సి ఉందని, 1987లో జీడీపీ పరంగా చైనా, భారత్ ఒకే విధంగా ఉన్నా ప్రస్తుతం అమెరికా కంటే చైనా కేవలం ఒక అడుగు మాత్రమే వెనుకంజలో ఉందని పేర్కొన్నారు. ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ‘ప్లాస్ట్ ఇండియా 2023’సందర్శకుల రిజిస్ట్రేషన్ యాప్‌ను కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాతీలు వారసత్వంగా వచ్చే వ్యాపారాల్లో ఉంటూనే కొత్త రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారని కొనియాడారు. గుజరాతీ ఎంట్రప్రెన్యూర్స్‌ను ఆదర్శంగా తీసుకుని దేశంలో ఎంట్రప్రెన్యూర్ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడిదారులు తెలంగాణ లాంటి అనువైన రాష్ట్రాన్ని ఎంచుకుని కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రంగానికి ప్రోత్సాహకాలు.. ప్లాస్టిక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2014కు ముందు రాష్ట్రంలో 10 వేలకు పైగా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 15 వేలకు చేరిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 144 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పార్కులో 149 కంపెనీలకు స్థలం కేటాయించగా రూ.847 కోట్ల పెట్టుబడి వచ్చిందన్నారు. 102 యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించగా, మరో 25 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నాయని, ఈ పార్కు ద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. తిరిగి ఉపయోగించే వీలున్న ప్లాస్టిక్ పైనే యూనిట్లు దృష్టి సారించాలని, ప్లాస్టిక్‌కు సరైన ప్రత్యామ్నాయం చూపడం ద్వారానే పూర్తి స్థాయిలో నిషేధం సాధ్యమవుతుందని అన్నారు. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే ప్లాస్ట్ ఇండియా 2023 గురించి మాట్లాడుతూ.. ఢిల్లీతో తమకు ఇటీవలి కాలంలో సత్సంబంధాలు లేవని చమత్కరించారు. కాగా, ప్లాస్ట్ ఇండియా ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. 2025 నాటికి తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న విశాఖ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ జిగేశ్ దోషి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అజయ్‌షా, కో చైర్పర్సన్ పద్మజారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పడకేసిన పర్యాటకం..కుదేలైన వాణిజ్యం
కరోనా.. ఒక ఊరిని కాదు.. ఒక రాష్ట్రాన్ని కాదు.. ఒక దేశాన్ని కాదు.. ఏకంగా ప్రపంచాన్నే వణికిస్తోంది. కంటికి కనిపించని వైరస్.. కల్లోలం సృష్టిస్తోంది. ఎంతలా అంటే.. ఆత్మీయంగా పలకరించాలన్నా ఆందోళన చెందేంతగా.. ఊరు దాటి ఊరు వెళ్లాలన్నా.. ఆలోచించాల్సినంతగా.. సినిమాకి వెళ్లాలంటే సంకోచపడాల్సినంతగా.. కడుపునిండా తినాలన్నా.. కబుర్లు చెప్పుకోవాలన్నా.. ఏం చెయ్యాలన్నా.. ఏం తాకాలన్నా.. నిలువెల్లా భయం.. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ప్రజల ప్రాణాల్ని హరిస్తున్న ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు నగరంలో నమోదు కాకున్నా వాణిజ్యంపైన పంజా విసురుతోంది. టూరిజం, విదేశీయానం, పౌల్ట్రీ, మార్కెట్.. ఇలా.. ప్రతి వ్యాపారంపైనా కరోనా ప్రభావం చూపుతోంది. సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ ముప్పు నానాటికీ పెరుగుతోంది. ప్రాణాంతక వైరస్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్య, వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకం.. ఇలా ప్రతి రంగాన్నీ కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా అన్ని వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్న వైరస్.. విశాఖపైనా ఉరుముతోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాలున్నప్పటికీ.. దానికంటే ముందుగానే కోలుకోలేని దెబ్బతీస్తోంది. దీని దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరవడంతో మార్కెట్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి. నో చైనీస్ ఫుడ్ కరోనా వైరస్ నేపథ్యంలో నగరంలో చైనా ఆహార పదార్థాలు అందించే హోటళ్లు నాలుగైదు రోజులుగా వెలవెలబోతున్నాయి. చైనాకు చెందిన పలు ఫ్రాంచైజీలు వీఐపీ రోడ్డు, సిరిపురం, అశీల్‌మెట్ట మొదలైన ప్రాంతాల్లో నడుస్తున్నాయి. పూర్తిస్థాయి చైనీస్ వంటకాలు అందించేందుకు కచ్చితంగా మసాలా దినుసులతో పాటు, వివిధ సామాగ్రిని చైనా నుంచే తెప్పిస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ హోటళ్లకు గిరాకీ తగ్గుముఖం పట్టింది. నగరంలోని పలు రెస్టారెంట్లలో చైనా, మణిపాల్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువతీ, యువకులు పనిచేస్తున్నారు. కరోనా ప్రభావంతో వీరంతా భయాందోళనలకు గురవుతున్నారు. వామ్మో.. విదేశీ ప్రయాణమా పర్యాటక రంగం.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులపైనే ఆధారపడి ఉంటుంది. వారి నుంచే సింహభాగం ఆదాయం వస్తుంటుంది. అయితే.. కరోనా వైరస్ కారణంగా.. ఈ ఆదాయం గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. విదేశీ రాకపోకలన్నీ దాదాపుగా స్తంభించిపోయాయి. విదేశీ ప్రయాణమంటే నగర వాసులు భయపడుతున్నారు. సాధారణంగా విశాఖ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించేవారు పూర్తిగా తగ్గిపోయారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వివిధ దేశాలకు పర్యాటకులు వెళ్తుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మూడు అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఈ విమానాలన్నీ.. ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా వివిధ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. పారిశ్రామిక రంగంపైనా ప్రభావం... కరోనా వైరస్ పారిశ్రామిక రంగంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వివిధ విదేశీ పరిశ్రమలతో పాటు ఎంఎన్సీ కంపెనీలు విశాఖలో ఉన్నాయి. వాటికి సంబంధించిన వాణిజ్యపరమైన ఒప్పందాలు, సమావేశాలకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వ్యాపార సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. అయితే.. కరోనా వైరస్ కారణంగా.. వారు కూడా రావడం లేదు. అదేవిధంగా విశాఖ పోర్టు నుంచి వివి«ధ దేశాలకు ఎగుమతి దిగుమతులు సాగిస్తున్నాయి. అయితే.. ఇటీవల చైనా నుంచి నౌక వచ్చిన నేపథ్యంలో పోర్టు ట్రస్టు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. వివిధ దేశాల నుంచి కూడా ఎగుమతి దిగుమతులు కూడా తగ్గించడంతో సుమారు 30 నుంచి 40 శాతం రవాణా తగ్గుముఖం పట్టినట్లు అధికారికవర్గాలు చెబుతున్నాయి. వీసాలు కూడా బంద్.. దక్షిణ భారతదేశం(తెలంగాణ, ఏపీ, ఒడివా, చెన్నై) నుంచి సింగపూర్ ఎంబసీకి వారానికి 40 వేల వీసాలకు అప్లై చేస్తుంటారు. ఇప్పుడు మాత్రం కేవలం 5 వేలæ మంది మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా మలేíÙయా ఎంబసీకి 80 వేలు వరకూ దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు వాటిసంఖ్య 6 వేలకు పడిపోయింది. ఇలా వివిధ దేశాలకు వెళ్లేందుకు చేసుకుంటున్న వీసా దరఖాస్తులు సైతం 80 శాతానికి పైగా పడిపోయాయి. పర్యాటకం విలవిల.... విశాఖ నగరం అంటేనే పర్యాటకానికి పుట్టిల్లు. అందుకే అందాల విశాఖని సందర్శించేందుకు విదేశీయులు ఎక్కువగా వస్తుంటారు. వివిధ దేశాల నుంచి ప్రతి వారం 150 నుంచి 200 మంది వరకూ విదేశీ పర్యాటకులు వస్తుంటారు. అయితే.. కరోనా ప్రభావం మన దేశంపై పడకుండా ఉండేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చేందుకు అవసరమయ్యే వీసాల జారీ ప్రక్రియని నిలిపివేసింది. ఫలితంగా పర్యాటక రంగం కుదేలైంది. వారానికి కనీసం 30 మంది కూడా రావడం లేదని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్రా యాత్రకు బ్రేకులు... ముస్లింల ఉమ్రా యాత్రకు బ్రేక్ పడింది. సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. కరోనా నేపథ్యంలో మక్కా, మదీనా సందర్శన గత వారం రోజులుగా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉమ్రా యాత్రికులను ఏకంగా విమానాశ్రయాల నుంచే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. యాత్రకు వెళ్లాల్సిన వారంతా.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి... అక్కడి నుంచి ఏటా ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా వెళ్లివస్తుంటారు. ఉమ్రా వీసాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో యాత్రలు సైతం వాయిదా పడి ట్రావెల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు సౌదీ ఆరేబియాకు విజిట్ వీసాల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఈ ఏడాది జూలై చివర్లో ప్రారంభం కానున్న హజ్ యాత్రపై కూడా కరోనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కోడికి కరోనా... చికెన్ తింటే కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారంతో పౌల్ట్రీ రంగం కుదేలైపోతోంది. చికెన్ దుకాణాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. అమ్మకాలు లేకపోవడంతో ధరలు పాతాళానికి పడిపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా.. చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్ ధర తగ్గినా.. కొనుగోలు చేసేందుకు ప్రజలెవ్వరూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.200 వరకూ అమ్ముడు పోగా.. ఇప్పుడు రూ.100కి పడిపోయింది. రూ.50 కోట్లు ఆవిరి.. కరోనా ప్రభావం మార్కెట్లని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దేశంలోనూ, హైదరాబాద్‌లో కూడా కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మదుపరుల ఆశల్ని గంగలో కలిపేశాయి. ఫార్మా, క్రూడాయిల్, సిమెంట్, ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, ఐరన్ మొదలైన రంగాల షేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. చైనాతో పాటు అనేక దేశాలకు వైరస్ విస్తరిస్తుండటంతో మార్కెట్లు తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నాయి. విశాఖ నుంచి మదుపరులు రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే.. కరోనా ఎఫెక్ట్ మార్కెట్‌పై పడటంతో.. చాలా వరకూ షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. వారం రోజుల్లో నగరానికి చెందిన మదుపరులు సుమారు రూ.50 కోట్ల వరకూ నష్టపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఏఏ రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడుతుందో.. ఆ షేర్లని తక్కువ నష్టానికైనా అమ్మకానికి పెట్టేలా మదుపరులు నిర్ణయం తీసుకుంటున్నారు. సీజన్‌తో సంబంధం ఉందా.. ప్రస్తుతం వేసవి సీజన్ ప్రారంభమైంది. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదువుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో కోవిడ్–19(కరోనా) వైరస్ మనుగడ సాగించలేదని పలువురు భావిస్తున్నారు. అయితే వాతావరణంలోని ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అనుమానంతో ఆస్పత్రికి వస్తే తప్ప..స్వయంగా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కరోనా బాధితుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి ముక్కు, నోటి నుంచి బయటికి వచ్చిన స్రవాలు, తుంపర్లు గాలి ద్వారా సమీపంలో ఉన్న వారికి(అర మీటరు నుంచి 2 మీటర్ల దూరంలో)విస్తరించే అవకాశం ఉంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయట పడేందుకు 2 నుంచి 14 రోజుల సమయం పడుతుండటం, ఆ లోపు మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు నెలలు.. పర్యాటకులంతా.. విదేశీ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడి నుంచి హాంకాంగ్, చైనా, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, ప్యారిస్.. ఇలా ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ డబ్బులతో అయిపోయే టూరిస్ట్ డెస్టినేషన్స్.. మలేíÙయా, సింగపూర్, బ్యాంకాక్ మొదలైనవి రూ.35వేల నుంచి రూ.40 వేలకు ఒక మనిషి వెళ్లి రావచ్చు. 2 మూడు రోజులు విడిది చేసేలా ప్లాన్ చేసుకుంటారు. వారంతా.. ఇప్పుడు తమ ప్లాన్లు రద్దు చేసుకుంటున్నారు. కరోనా భయంతో విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో.. ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకొని 60 నుంచి 70 శాతం పేమెంట్స్ చేసిన టూరిస్టులు కూడా తమ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటూ.. డబ్బులు వాపస్ తీసుకుంటున్నారు. దీనివల్ల.. ఎయిర్ ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఒక్క బుకింగ్ కూడా రాకపోవడంతో సమ్మర్ సీజన్‌కు సంబంధించిన పర్యాటకం పూర్తిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. – మురళీ, ట్రావెల్ ఐక్యూ సంస్థ ఎండీ ఎవరూ కొనడం లేదు నెల రోజుల నుంచి చికెన్ అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. గతంలో ఆదివారం వస్తే చాలు క్షణం తీరిక లేకుండా మధ్యాహ్నం 12 వరకూ అమ్మకాలు సాగించేవాళ్లం. కరోనా వైరస్ వల్ల.. ఆదివారం రోజున 100 కేజీలు కూడా అమ్మడం గగనమైపోయింది. ఎప్పటి వరకూ ఈ పరిస్థితి ఉంటుందోనని భయమేస్తోంది. మరో నెల రోజులు ఇలాగే గడిస్తే.. మా జీవితాలు ఏమవుతాయోనని ఆందోళనగా ఉంది. – రాజు, చికెన్ వ్యాపారి పోర్టులో భద్రత కట్టుదిట్టం... కరోనాపై విశాఖ పోర్టు ట్రస్టులో పూర్తిస్థాయిలో ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. సిబ్బందికి ఎన్ 95 మాసు్కలు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజుల సెట్లు, థర్మో ఫ్లాష్ హ్యాండ్ గన్స్ అందించాం. అన్ని రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాం. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న నౌకలపైనా పటిష్ట జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యంతో కనిపిస్తే.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. – పీఎల్ హరనాథ్, విశాఖపోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ భయం లేదు.. ►కరోనా చలి ప్రదేశంలో విస్తరిస్తుంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్లో పుట్టింది. ఈ సమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీలు ఉండగా, రాత్రి వేళ ఒకటి నుంచి మూడు డిగ్రీలు మాత్రమే. ఆ తర్వాత క్లోజ్ కాంటాక్ట్‌ల ద్వారా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇలా ఇప్పటి వరకు 54 దేశాలకు పాకింది. ►పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే మన రాష్ట్రంలో ఈ వైరస్ పుట్టే అవకాశం లేదు. ►ఇప్పటికే విదేశాలకు వెళ్లి.. అక్కడి బాధితులతో కలిసి పనిచేయడం, కలిసి ప్రయాణించడం, కలిసి ఉన్నవారి ద్వారా ఈ వైరస్ మన దగ్గర కూడా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. ►వాస్తవానికి బాధితుడు ఇంటి నుంచి బయటికి వచ్చిన వైరస్ బయటి వాతావరణంలో 12 గంటలకు మించి జీవించలేదు. ►బాధితుడి నుంచి ఒక సారి బయటికి వచ్చిన కరోనా వైరస్ రెండు మీటర్ల దూరానికి మించి ప్రయాణించలేదు. ►గాలి ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా తక్కువ. ►క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ వైరస్ సోకాలని లేదు. ►రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలతో పాటు దీర్ఘకాలిక జబ్బులు (మధుమేహం, బీపీ, కిడ్నీ, కాలేయ, క్యాన్సర్ సంబంధ వ్యాధులు)లతో బాధపడుతున్న రోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ►పాజిటివ్ బాధితుడితో వంద మంది క్లోజ్‌కాంటాక్ట్ ఉంటే.. 81 శాతం మందికి వైరస్ సోకే అవకాశం లేదు. 14 శాతం మందికి మాత్రమే వైద్య పరీక్షలు, హోమ్ ఐసోలేషన్ అవసరం. 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ సపోర్టు చికిత్సలు అవసరం. ►స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనాలో మరణాల శాతం తక్కువే. స్వైన్‌ప్లూ బాధితుల్లో మరణాల శాతం 6 నుంచి 7 శాతం ఉంటే...కరోనాలో 3 శాతమే. ►ఈ వైరస్‌పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ అనుమానిత కేసులేనని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతున్నా విశాఖ వాసుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగడం లేదు. -
ట్రేడ్ వార్ ఎటు పోతోంది?
యుద్ధం మొదలైంది... తుపాకీ మోతల్లేవు.. క్షిపణులు అంతకంటే లేవు.. కానీ పోరు జరుగుతున్నది మాత్రం నిజం. ఎందుకంటే ఇది వాణిజ్య యుద్ధం! అగ్రరాజ్యాధిపతి కవ్విస్తున్నాడు.. ఇతర దేశాలు ఆ ఉచ్చులో పడిపోతున్నాయి! పన్నుకు పన్ను పడుతోంది. మార్కెట్లు వేడెక్కుతున్నాయి! ఈ పోటీ ఇంకొంచెం ముదిరిందా? ఏ దేశాన్నీ వదలదు.. ప్రపంచాన్ని కబళిస్తుంది... ‘పోరు నష్టం... పొందు లాభం..’ అని మనం చిన్నప్పుడెప్పుడో ఓ సామెత చదువుకున్నాం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ సామెత అర్థం పెద్దగా తెలిసినట్టుగా లేదు. అమెరికా ఫస్ట్ అంటున్నాడు.. అందుకోసం ఎంతకైనా తెగిస్తానని బీరాలు పోతున్నాడు కూడా. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడటంపై ఎవరికీ అభ్యంతరాల్లేవు గానీ.. ఈ క్రమంలో ప్రపంచాన్ని ముంచేసే ఎత్తులకు సిద్ధమవుతూండటం మాత్రం ఆందోళన కలిగించేదే! నియంత పోకడలతో చాలా దేశాల దిగుమతులపై ఎడాపెడా సుంకాలు వేసేస్తూండటంతో ప్రపంచ వాణిజ్య రంగం అతలాకుతలమయ్యే స్థితికి చేరుకుంది. వ్యాపారం లేకపోతే ఉత్పత్తి మందగిస్తుంది.. దీనివల్ల ఉద్యోగాలు పోతాయి.. అది కాస్తా సమాజంలో అసంతృప్తికి దారితీస్తుంది. మొదటి శత్రువు చైనా.. ఎన్నికైన నాటి నుంచి చైనాకు ముకుతాడు వేస్తామనే ధోరణితోనే ట్రంప్ వ్యవహారాలు నడిచాయి. వాణి జ్య యుద్ధంలోనూ తొలి వేటు పడింది ఈ దేశంపైనే. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ట్రంప్ ముందుగా 3,400 కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు వేసేశారు. ఇది చాలదన్నట్లు ఇంకో 20,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై 10% పన్ను అధికంగా విధించాలని నిర్ణయించారు. మూడో విడతగా ఇంకో 1,600 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై సుంకాలకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా పన్నుల కారణంగా చైనాలో ఉత్పత్తి అవుతున్న ఫ్లాట్స్క్రీన్ టీవీలు, విమానాల విడిభాగాలు, వైద్య పరికరాల ధరలు పాతికశాతం పెరిగిపోయాయి. పండ్లు, కూరగాయలు, చేతిసంచులు, రిఫ్రిజిరేటర్లు, రెయిన్కోట్ల వంటి నిత్యావసర వస్తువులపై కూడా పన్నుపోటు పడింది. దీటుగా స్పందించిన చైనా ఈ పన్నుల దాడిపై చైనా కూడా దీటుగానే స్పందించింది. తొలిదఫా అమెరికా విధించిన స్థాయిలోనే 3,400 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై పన్నులు పెంచేసింది. ఫలితంగా అమెరికా నుంచి చైనాకు చేరే సోయాబీన్, ఆటోమొబైల్స్, సముద్ర ఉత్పత్తుల ధరలు కొండెక్కాయి. చైనా ఇంకో అడుగు ముందుకేసి అమెరికా తీరేం బాగా లేదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు కూడా చేసేసింది. ఇరుగు పొరుగులపై కూడా... పన్నుల కొరడా ఝళిపించే విషయంలో ట్రంప్ ఇరుగు పొరుగును కూడా వదల్లేదు. ఉత్తరాన ఉండే కెనడా, దక్షిణాన ఉండే మెక్సికోతోనూ కాలు దువ్వాడు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పుత్తులపై సుంకాలు వి«ధించాడు. జపాన్‌పై కూడా ఇదే తీరుతో వ్యవహరించడంతో ఆ దేశం కూడా అమెరికాపై పన్నుల దాడికి సిద్ధమవుతోంది. అమెరికాలో తయారయ్యే కార్ల కంటే జపాన్ నుంచి దిగుమతి అయ్యే కార్ల సంఖ్య, వాటి విలువ చాలా ఎక్కువ అన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఫలితంగా అమెరికన్లు ఇకపై కొనే కార్ల ఖర్చు బోలెడంత ఎక్కువ కానుంది. దీంతో వారు జపాన్ కార్లపై ఆశలు వదిలేసుకోవాలి. లేదంటే.. రాజీపడి తమ దేశంలోనే తయారైన కార్లను కొనుక్కోవాల్సి వస్తుంది. ‘యూరోపియన్’ దేశాలపై.. స్టీలు, అల్యూమినియం విషయంలో కెనెడా, మెక్సికో, జపాన్లపై పన్నులు విధించిన అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలకూ దీన్ని వర్తింపజేసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్.. అమెరికన్లు అతిగా ఇష్టపడే బ్లూజీన్స్తోపాటు మోటార్ బైకులు, మద్యం ఉత్పత్తులపై పన్నులు పడ్డాయి. నాణ్యమైన ఇంజనీరింగ్ ఉత్పత్తులకు, కార్లకు పెట్టింది పేరైన జర్మనీ యూరోపియన్ యూనియన్‌లో భాగమన్నది తెలిసిందే! మన పరిస్థితి ఏమిటి? ట్రంప్ పన్నుల యుద్ధం భారత్‌నూ వదల్లేదు. దాదాపు 29 వస్తువులపై పన్నులు విధిస్తూ గత నెలలో ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా అంతేస్థాయిలో భారత్ కూడా పన్నుల కొరడా ఝళిపించింది. ఉక్కు, అల్యూమినియంలపై విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ 23.5 కోట్ల డాలర్ల విలువైన 30 ఉత్పత్తులపై పన్నులు వేసింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. కాలిఫోర్నియా నుంచి దిగుమతయ్యే బాదంపప్పు మొదలుకొని వాషింగ్టన్ ఆపిల్స్, కొన్ని ఇతర వస్తువులపై సుంకం విధించిన కారణంగా ఇకపై వాటి ధరలు మరింత ఎక్కువ కానున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యమే కాకుండా బ్యాంకులు, వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణంపైనా ఆ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది మార్చిలో అమెరికా, దక్షిణ కొరియాల మధ్య వాణిజ్య సంబంధాలను సులభతరం చేసుకునేందుకు ఒక ఒప్పందం కుదిరింది. అమెరికన్ కార్లకు దక్షిణ కొరియాలో భారీ మార్కెట్ కల్పించేందుకే ఈ ఒప్పందం. అయితే ట్రంప్ తీరు కారణంగా ఇప్పుడు ఈ ఒప్పందం ప్రశ్నార్థకమవుతోంది. ఉత్తర కొరియాను మంచి చేసుకునే క్రమంలో చాలాకాలంగా వ్యాపారం చేస్తున్న దక్షిణ కొరియాతో ట్రంప్ పన్నుల తగువుకు సిద్ధమవుతున్నాడు. ఫలితాలేమిటి..? ట్రంప్ మొదలుపెట్టిన పన్నుల యుద్ధం ప్రపంచానికి మంచిది కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్ కార్నే ఈ యుద్ధం అమెరికాకే చేటు చేస్తుందని, ఆర్థిక వ్యవస్థ 5 శాతం వరకూ నష్టపోవచ్చని హెచ్చరించారు. మూడేళ్లలో జీడీపీ వృద్ధి కూడా 2.5 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. అమెరికా తాను వ్యాపారం చేసే అన్ని దేశాలపై కనీసం పది శాతం పన్నులు వేసినా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థూల ఉత్పత్తి ఒకశాతం వర కూ తగ్గుతుందని అంచనా. యూరోపియన్ యూని యన్, యూకేల నష్టం కూడా ఇదే స్థాయిలో ఉండవచ్చని అంచనా. ట్రంప్ పన్నులు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. యూరప్‌లో తయారైన ఒక కారు ధర అమెరికాలో సగటున రూ.8 లక్షల వరకూ ఎక్కువవుతుంది. పన్నుల కారణంగా వాహనాల అమ్మకాలు తగ్గిపోతే అమెరికాలోని కార్ల ఫ్యాక్టరీల్లో తగ్గి పోయే ఉద్యోగాలు 2 లక్షలుంటాయి. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై పన్నులు పెంచేస్తే ఈ సంఖ్య 6.25 లక్షలు అవుతుందని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ చెబుతోంది. టెక్ కంపెనీలపై దుష్ప్రభావం చైనా నుంచి దిగుమతయ్యే నెట్వర్క్ పరికరాలపై భారీగా సుంకాలు విధించాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఇదే జరిగితే సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీలపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరు నుంచి మోడెమ్స్, రౌటర్స్ వంటి 20 వేల కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం సుంకం అమలు కానున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయంపై ఐటీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, అమెజాన్లు విశ్లేషిస్తున్నాయి. ఇక కంప్యూటర్ చిప్స్ తయారు చేసే ఇంటెల్ వంటి సంస్థలపైనా సుంకాల ప్రభావం పడబోతోంది. 300 కోట్ల డాలర్ల విలువైన సెమీ కండక్టర్లపై 25 శాతం సుంకాలు విధించడం చిప్‌ల తయారీ కంపెనీలైన ఇంటెల్, క్వాల్కామ్ (క్యూసీవోఎం)ల గుండెల్లో గుబులు పెంచుతోంది. కొన్ని అమెరికా కంపెనీలు తాము తయారు చేసిన కంప్యూటర్ చిప్స్‌ను అసెంబుల్, టెస్టింగ్, ప్యాకేజింగ్ కోసం చైనాకి పంపిస్తూ ఉంటాయి. తిరిగి అవి చైనా నుంచి అమెరికాకి వచ్చినప్పుడు భారీగా సుంకాలు చెల్లించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడబోతోంది. ఇప్పటికే వలస విధానాలు, పర్యావరణ సమస్యలతో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న సిలికాన్ వ్యాలీ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత కుదేలైపోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లకూ దెబ్బే..! ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రభావం అమెరికన్లకూ తప్పదు. చైనా నుంచి చేసుకునే 20 వేల కోట్ల డాలర్ల దిగుమతులపై వేయనున్న పదిశాతం సుంకం వంటింటి దినుసులు మొదలుకొని చిన్నాచితకా యంత్రాలు, సైకిళ్లు ఇతర గాడ్జెట్ల ధరలను పెంచేయనున్నాయి. కత్తులు, ఫోర్కులు, ‘తిలాపియా’ చేపలు, ఆపిల్ జ్యూస్, వైన్ ధరలు పదిశాతం పెరగనుండగా, రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లు, ఇతర గాడ్జెట్లూ ఖరీదు కానున్నాయి! వెల్లుల్లి మొదలుకుని వెదురు ఉత్పత్తులు, పుట్టగొడుగుల ధరలకూ రెక్కలు వస్తాయి. వాహనాల విడిభాగాలు స్పార్క్ ప్లగ్‌లు, పిస్టన్ ఇంజన్లు, వాహనాల మిర్రర్లు, సైకిళ్లు, గోల్ఫ్ బ్యాటింగ్ గ్లవ్స్ తదితర వస్తువులపై పన్ను పెరుగుతుంది. బాత్రూంలో తలస్నానం చేశాక తుడుచుకునే ఫ్లఫీ టవల్స్, తదితరాల ధరలు, హెయిర్ క్లిప్పర్స్, ఎలక్ట్రిక్ షేవర్స్, షేవింగ్ బ్రష్షులు, చైనాలో తయారైన లిప్‌స్టిక్, మేకప్ సామగ్రి కూడా పెరిగే జాబితాలోనే ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా ఇళ్లలో ఏర్పాటు చేసే క్రిస్మస్ చెట్లతో పాటు ఇళ్లలో అలంకారానికి ఉపయోగించే లైటింగ్ సెట్లపైనా పన్నులు పెరుగుతాయి. చివరకు రోజంతా ఒళ్లు హూనమయ్యేలా పనిచేశాక సుఖంగా పడుకునేందుకు ఉపయోగించే చైనా మేడ్ పరుపుల ధరలూ వేడెక్కనున్నాయి. చమురు ధరలు పెరుగుతాయా? ట్రేడ్ వార్తో చమురు ధరలు బ్యారెల్‌కు 250 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదని వాణిజ్య నిపుణుడు ఆర్టెమ్ అవినోవ్ అంచనా వేస్తున్నారు. అయితే చాలా వరకు ఇది సత్యదూరమని ఇతర నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు సరఫరాదారుల్లో ముఖ్యమైన ఇరాన్‌పై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం ప్రతీకార చర్యలకు దిగితే చమురు ధరలు కొండెక్కడం ఖాయమన్నది ఇందుకు కారణం. తమను ఒంటరిని చేసి ఆంక్షలు పెట్టడమే కాకుండా ఇతర దేశాల నుంచి అందుతున్న మద్దతునూ అడ్డుకుంటున్న అమెరికాపై ఇరాన్‌కు పీకల్దాకా కోపం ఉందన్నది సుస్పష్టం. దీంతో దేశం గుండా ఇతర దేశాలకు తరలిపోతున్న చమురు పైపులపై దాడి చేయవచ్చు లేదా అనేక చమురు దేశాల సరఫరాకు మార్గమైన హర్ముజ్ జలసంధి గుండా రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పరచవచ్చు. అలాంటిది జరిగితే 80 –90 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్న చమురు ధర ఎకాఎకి కొంతకాలం పాటు 160 డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇప్పటికే ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని బాగా పెంచిన నేపథ్యంలో ఇరాన్ కలిగించే నష్టాన్ని భర్తీ చేసేందుకు అవి ముందుకు రావచ్చు. భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. అయితే ఈ దేశం నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా హుకుం విధించడం అందుకు తగ్గట్టుగానే భారత్ దిగుమతులను కొంతవరకూ తగ్గించుకోవడం మనకు తెలిసిన విషయమే. -
నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఒకరోజు ముంబై పర్యటనలో భాగంగా మంత్రి పలువురు వ్యాపార దిగ్గజాలను కలిశారు. ఫోర్త్ ఇంజక్షన్, బ్లో మౌల్డింగ్ అండ్ పీఈటీ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 600 మంది ప్లాస్టిక్, పెట్రో కెమికల్, ప్యాకేజింగ్ రంగాల పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఆయా పరిశ్రమలకున్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పెస్, రక్షణ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. టీ హబ్, నూతన పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి అంశాలు ఈ రంగాల్లో ముందుకు వెళ్లేం దుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరా, టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహపూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న ల్యాండ్‌బ్యాంకు పెట్టుబడులకు మరో అదనపు ప్రయోజనమని మంత్రి తెలిపారు. వంద ఎకరాల్లో సుల్తాన్‌పూర్‌లో మొదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండో దశలో మూడు వందల నుంచి 500 ఎకరాల్లో ప్లాస్టిక్ సిటీని మెదక్ నిమ్జ్ పార్కులో ఏర్పాటు చేస్తామని అన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి వివరించారు. మంత్రి ప్రజెంటేషన్‌పై పారిశ్రామికవేత్తలు అభినందనలు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌ను కలిసిన మంత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను మంత్రి కేటీఆర్ ముంబైలో గురువారం కలిశారు. ఎంఎస్ఎం ఈ సెక్టార్‌లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్‌కు వివరించారు. పలు ఎంఎస్ఎంఈ రంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఈ పరిశ్రమలను ఆదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలను వివరించి పలు సూచనలను తీసుకున్నారు. -
ఎంబీఏలో వినూత్న స్పెషలైజేషన్లు ఎన్నో..
ప్రపంచంలోనే తొలిసారిగా 1908లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలు.. కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగ్గట్లు మేనేజ్మెంట్ విద్య ఎన్నో మార్పుచేర్పులకు లోనైంది. గతంలో ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లకే పెద్దపీట ఉండేది. ఇప్పుడు ప్రపంచీకరణతోపాటే దేశ పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో కార్పొరేట్ ప్రపంచానికి విభిన్నమైన నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జాబ్‌మార్కెట్‌కు అనుగుణంగా ఎంబీఏలో సరికొత్త స్పెషలైజేషన్లు తెరపైకి వచ్చాయి. ఆయా విశ్వవిద్యాలయాలు, బీస్కూల్స్‌లో ఎంబీఏలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న అప్‌కమింగ్ స్పెషలైజేషన్లపై ప్రత్యేక ఫోకస్.. 1-రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ 2-పెట్రోలియం మేనేజ్మెంట్ 3-పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ 4-ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ 5- టెలికం మేనేజ్మెంట్ 6-హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ 7-ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ గ్రామీణాభివృద్ధి.. దేశ ప్రగతికి ప్రథమ సోపానం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉన్న మన దేశంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతి ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. అందుకే ఈ రంగాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల పరంగా ప్రతి ఏటా సుమారు రూ. లక్ష కోట్ల కేటాయింపులు చేస్తూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎన్‌ఎల్‌ఆర్‌ఎం, ఎన్హెచ్ఆర్ఎం వంటి పలు పథకాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే.. అందుకు అవసరమైన ఆర్థిక నిర్వహణ నైపుణ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సు.. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్! ఈ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు రూరల్ డెవలప్మెంట్ మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, మేనేజీరియల్ అకౌంటింగ్, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనువర్తనాలు తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఇక.. అవకాశాల పరంగా చూస్తే.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు, పథకాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. దాంతో గ్రామీణాభివృద్ధి రంగంలో సుశిక్షితులైన వందల మంది మానవ వనరుల డిమాండ్ నెలకొనడం ఖాయం. మన దేశంలో ఈ కోర్సును అందిస్తున్న కళాశాలల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కోర్సుల గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన, సమాచారం కూడా అందుబాటులో లేదు. అయితే విద్యార్థులు ఈ కోర్సును చక్కటి ఉపాధికి వేదికగా భావించి ఎంచుకోవాలి. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ విద్యార్థులు.. ప్రభుత్వ రంగంలో ప్రణాళిక సంఘం, ఆయా పథకాల నిర్వహణ విభాగాలు, వ్యవసాయం తదితర విభాగాలు.. ప్రైవేటు రంగంలో స్వచ్ఛంద సంస్థలు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. అంతేకాకుండా ఇటీవల కాలంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పేరిట కార్పొరేట్ సంస్థలు కూడా పలు సామాజిక అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో ఎంఎన్సీ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు వివిధ సంస్కృతుల ప్రజలతో కలిసిపోయే తత్వం.. గ్రామీణ ప్రాంతాలపై సహజమైన ఆసక్తి, అంకిత భావం.. కెరీర్ ప్రారంభంలోనే భారీ మొత్తాలతో వేతనాలు ఆశించకుండా పనిచేయగల సంసిద్ధత వంటి ప్రత్యేక లక్షణాలు ఉండాలి. డా॥ఎస్.ఎం. ఇలియాస్ డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఎన్ఐఆర్డీ, హైదరాబాద్ పెట్రోలియం మేనేజ్మెంట్ పెట్రోల్.. పెట్రోలియం అంటే.. పెట్రోల్ నిక్షేపాల వెలికితీత, పెట్రోల్ వినియోగం.. ఇవే సాధారణంగా మనందరికీ తెలిసిన విషయాలు! కానీ, క్షేత్రస్థాయిలో పెట్రోలియం నిక్షేపాలను కనుగొనడానికి, వెలికితీయడానికి ఎంతటి సాంకేతిక సామర్థ్యం అవసరమో.. అంతే స్థాయిలో నిర్వహణ నైపుణ్యాలూ ఉండాలి. ఎక్స్‌ప్లొరేషన్, ఉత్పత్తి, రిఫైనింగ్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా క్షేత్ర స్థాయి నుంచి వినియోగదారులకు చేరే వరకూ ప్రతి దశలోనూ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సే.. పెట్రోలియం మేనేజ్మెంట్. ఇప్పటికే అన్ని దేశాలు సహజ, పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. పెట్రోలియం వనరుల అన్వేషణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ముఖ్యంగా షెల్ గ్యాస్, ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్, క్రూడ్ నాణ్యత నిర్ధారణ వంటి అంశాల్లో సాంకేతికపరమైన అవసరాలతోపాటు నిర్వహణ నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల డిమాండ్ పెరగనుంది. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారికి మరింత కలిసొచ్చే కోర్సుగా పెట్రోలియం మేనేజ్మెంట్ను పేర్కొనొచ్చు. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కీలక ఇంధనాలు.. చమురు, సహజ వాయువు. ఎంబీఏ పెట్రోలియం పూర్తయ్యాక.. చమురు, గ్యాస్ కంపెనీల్లో ఫైనాన్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, పెట్రోలియం ఎకనామిక్స్ తదితర రంగాల్లో స్థిరపడొచ్చు. కన్సల్టింగ్ ఏజెన్సీల్లోనూ పనిచేయొచ్చు. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు సాంకేతిక దృక్పథం, న్యూమరికల్ స్కిల్స్, ‘థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అప్రోచ్’ ఎంతో అవసరం. అంతేకాకుండా ‘డూ ఇట్’ అనే వైఖరి ఉంటే తక్కువ సమయంలోనే కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయిదారు ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నప్పటికీ.. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా వీటి సంఖ్య కూడా సమీప భవిష్యత్తులోనే పెరగడం ఖాయం. ఈ కోర్సులో చేరాలనుకునేవారికి విస్తృత ఆలోచన పరిధి.. కష్టపడి పనిచేసే స్వభావం.. ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం.. నిరంతరం నేర్చుకునే తత్వం.. అంతర్జాతీయ విపణిపై నిరంతర అవగాహన ఎంతో అవసరం. ప్రొ॥హేమంత్ సి. త్రివేది డెరైక్టర్, స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్, పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ ఆవశ్యకత ఎంతో ఉంది. దేశంలో ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. కానీ వాటి అమలులో మరెన్నో లోపాలు. వీటిని సరిదిద్దుతూ అసలైన లబ్ధిదారులకు వాటిని చేర్చే విధంగా నైపుణ్యాలను అందించే కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కొన్ని దశాబ్దాల పాటు పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ కేవలం సివిల్ సర్వెంట్లకు, ఇతర ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమైంది. తర్వాత మారుతున్న కాలంతోపాటు ప్రభు త్వ ఆలోచనా దృక్పథంలోనూ మార్పు వచ్చింది. దీనికి అనుగుణంగా.. ప్రభుత్వం తాను చేపడుతున్న పథకాలపై విశ్లేషణ, సలహాలు, సూచనల కోసం కేవలం సివిల్ సర్వెంట్లే కాకుండా.. సమాజంలో నిపుణులు, మేధావుల సహకారం తీసుకుంటోంది. ఈ క్రమంలో.. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలు, వాటికి సంబంధించి పర్యవసానాలు, లాభనష్టాలు, పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరేందుకు గల మార్గాలు వంటి వాటిపై శిక్షణనిచ్చేందుకు తెరపైకి వచ్చిన కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్. పబ్లిక్ పాలసీ అనేది నిర్దేశిత లక్ష్యాల సాధనకు సంబంధించి సంస్థాగత నిర్ణయాలు, నిర్వహణ, ఆర్థిక, పరిపాలన విధానాల రూపకల్పన వంటి విషయాల్లో నైపుణ్యం అందిస్తుంది. ముఖ్యంగా విధాన సమస్యల సమీక్ష, డేటా అనాలిసిస్, సాధారణ ప్రజానీకానికి ఎదురవుతున్న సమస్యల పరిష్కార మార్గాలపై నిర్వహణ పరమైన నైపుణ్యాలను పూర్తి స్థాయిలో అందించేలా ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన వారు అవకాశాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. ప్రస్తుతం పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న ఈ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరిశోధనా సంస్థల్లో అనలిస్ట్‌లు, ప్రభుత్వ శాఖల్లో.. అదే విధంగా స్వచ్ఛంద సంస్థల్లో సలహాదారులు లేదా మేనేజర్లుగా అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కాన్సెప్ట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేట్ సంస్థల్లో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సును ఎంచుకోవాలనుకునేవారికి ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి, అవగాహన ఉండాలి. ఇక.. అకడమిక్ పరంగా డేటా అనాలిసిస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అవసరం. ప్రొ॥ఆర్. సుదర్శన్ డీన్, జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ, ఒ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ- హర్యానా ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ దేశంలో ఇన్సూరెన్స్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతున్న తరుణమిది. భారత్‌లో బీమా రంగంలో ప్రభుత్వంతోపాటు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు సైతం ప్రవేశించాయి. మరోవైపు బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఇన్సూరెన్స్ డొమైన్ ఏరియాలో.. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోలు, వినియోగదారుల సేవాపరమైన అంశాలు, నిర్వహణ విభాగాల్లో సమర్థవంతమైన నిర్వహణ అత్యవసరంగా మారింది. అందుకు అనుగుణంగా బీమా రంగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్! ఈ కోర్సులో భాగంగా.. జీవితబీమా సంబంధ వ్యవహారాల నిర్వహణతోపాటు జనరల్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు (ఉదా: మెరైన్ కార్గో ఇన్సూరెన్స్, హెల్త్ అండ్ పర్సనల్ ఇన్సూరెన్స్, మిస్లేనియస్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్) బోధిస్తారు. అంతేకాకుండా రిస్క్ మేనేజ్మెంట్, యాక్చుయేరిల్ సైన్స్ వంటి సాంకేతిక అంశాలపైనా శిక్షణ ఉంటుంది. ఫలితంగా.. కోర్సు పూర్తయ్యే సమయానికి ఒక విద్యార్థి బీమా రంగ కార్యకలాపాలకు సంబంధించి అన్ని విభాగాల్లో పరిపూర్ణత సాధిస్తాడు. ఎంబీఏ ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌ను అభ్యసిస్తే బీమా సంస్థల్లో ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఆసక్తిని బట్టి బీమా సలహాదారుగా పనిచేయొచ్చు. భవిష్యత్తులో మరిన్ని బీమా సంస్థలు ప్రవేశించే అవకాశముంది. కాబట్టి సమర్థులైన మానవ వనరుల అవసరం మరింత పెరగనుంది. అయితే, ఔత్సాహిక అభ్యర్థులకు ఇన్సూరెన్స్ రంగంతోపాటు.. ఈ రంగాన్ని ప్రభావితం చేసే దేశ ఆర్థిక పరిస్థితులపై నిరంతర అవగాహన ఉండాలి. దీంతోపాటు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, బృందంలో పనిచేసే లక్షణాలు ఉంటే మరింతగా రాణించగలరు. ప్రొ॥డి. విజయ లక్ష్మి చైర్ ప్రొఫెసర్, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ- పుణె టెలికం మేనేజ్మెంట్ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం టెలికం. ప్రపంచంలోని అతిపెద్ద రంగాల్లో భారత టెలికం రంగం కూడా ఒకటి. ఆర్థిక సంస్కరణల తర్వాత టెలికం రంగంలో ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చారు. అదేసమయంలో టెలికం సేవల వినియోగం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు ప్రైవేట్ రంగం విస్తరణ.. మరోవైపు సేవలకు డిమాండ్ వెరసి.. ఈ రంగంలో భారీగా నిపుణుల అవసరం ఏర్పడింది. టెలికం రంగం నిర్వహణకు సుశిక్షితులైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. టెలికం మేనేజ్మెంట్! అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఈ కోర్సు ఆవశ్యకత ఎంతో ఉంది. కోర్సులో భాగంగా.. మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ వంటి రెగ్యులర్ ఎంబీఏ సబ్జెక్టులతోపాటు టెలికం విభాగానికి సంబంధించి.. టెలికం సర్వీసెస్ టెక్నాలజీస్, వైర్లెస్ కమ్యూనికేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, టెలికం సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఐటీ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, కన్వర్జెన్స్ ఆఫ్ టెలికం నెట్వర్క్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ టెలికం, కేస్ స్టడీస్ ఇన్ టెలికం మేనేజ్మెంట్ వంటి కోర్ సబ్జెక్ట్‌లలో శిక్షణ ఉంటుంది. ఇక.. ఈ రంగం భవిష్యత్ కోణంలో విశ్లేషిస్తే.. రోజుకో సరికొత్త టెక్నాలజీ.. కొత్త సంస్థల ప్రవేశంతో సేవల రంగంలో ఒకటైన కమ్యూనికేషన్‌కు సంబంధించి టెలికం విభాగం వేగంగా పురోగమిస్తోంది. ఈ నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బ్యాచిలర్ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు కెరీర్ ఉన్నతి పరంగా టెలికం మేనేజ్మెంట్ మరింత కలిసొచ్చే కోర్సు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు కష్టించేతత్వం, నిరంతరం ఆవిష్కృతమవుతున్న కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకునే దృక్పథం అవసరం. ప్రొ॥సునీల్ పాటిల్ డెరైక్టర్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్మెంట్- పుణే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దేశంలో హెల్త్‌కేర్ రంగం సగటున 15.5 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసుకుంటూ శరవేగంగా పయనిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆధునిక హంగులతో హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్స్ భారీగా ఏర్పాటవుతున్నాయి. అంతేకాకుండా హెల్త్‌కేర్ సంబంధిత హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ తదితర విభాగాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ఫలితంగా క్లినికల్ నిపుణులతోపాటు ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు సేవలందించే విషయంలో నిర్వహణా నిపుణుల ఆవశ్యకత ఏర్పడుతోంది. వైద్యులు.. రోగులకు చికిత్సపరంగా సేవలందిస్తే.. సదరు ఆస్పత్రి పరిపాలన వ్యవహారాలు, రోగులకు సేవలందించేందుకు పలు విభాగాలను సమన్వయం చేయడం వంటి విధులను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో ఆదాయ-వ్యయాల విషయంలో అటు సంస్థకు, ఇటు రోగులకు అనుకూలమైన విధానాలు రూపొందించడం.. నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలు ఎంతో అవసరం. అటువంటి స్కిల్స్‌ను అందించే కోర్సు.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్! ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, అదే విధంగా ప్రభుత్వం మెడికల్ టూరిజం కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఈ రంగంలో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించొచ్చు! కేవలం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్గానే కాకుండా.. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, హెల్త్ ఎన్జీఓలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు అకడమిక్ నేపథ్యంతోపాటు వైద్యులతో సమానంగా ప్రజలకు సేవలందిస్తున్నామనే ఆత్మ సంతృప్తి, సేవా దృక్పథం, పలు సంస్కృతుల ప్రజలతో మమేకం కావడం, కష్టపడి పనిచేసే తత్వం వంటి లక్షణాలు ఉంటే కెరీర్ మరింత ఉజ్వలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగం అనేది ఆర్థిక మాంద్యం సెగ తగలని విభాగం కాబట్టి.. కెరీర్ పరంగా దీన్ని ఎవర్‌గ్రీన్‌గా పేర్కొనొచ్చు. డా॥ధీరేంద్ర కుమార్ డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, బెంగళూరు. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ భారత ఆర్థిక వ్యవస్థకు కుటుంబ వ్యాపారాలే వెన్నెముకలు. దేశంలోని మొత్తం వ్యాపారాల్లో 90 శాతం సంస్థలు, పరిశ్రమలు కుటుంబాల నిర్వహణ పరిధిలోనివే. ఈ సంస్థలపైన మరెన్నో అనుబంధ వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయి (ఉదా: వెండర్స్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్ట్ సంస్థలు తదితర). ఎన్ని బహుళ జాతి సంస్థలు దేశంలో అడుగుపెట్టినా భవిష్యత్తులోనూ దేశ ప్రగతి విషయంలో ఫ్యామిలీ బిజినెస్ కీలక పాత్ర పోషించనుంది. ఇంతలా ప్రాధాన్యం సంతరించుకున్న ఫ్యామిలీ బిజినెస్‌కు సంబంధించి.. సదరు యజమాని లేదా వారసుల్లో వ్యాపార వృత్తి నిర్వహణ నైపుణ్యాలు లేకపోవడం.. నిర్వహణ లోపం వంటివి సమస్యగా మారుతోంది. ఇలాంటి నైపుణ్యాలను అందించే కోర్సే.. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్. గతంలో సాధారణంగా ఈ తరహా కోర్సులను ఆయా సంస్థల యాజమాన్యాల వారసులే అభ్యసించేవారు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో.. ఒక కుటుంబ అధీనంలోని వ్యాపార సంస్థల నిర్వహణ దిశగా ఆయా యాజమాన్యాలు తమకు సహకరించేందుకు ఫ్యామిలీ బిజినెస్‌లో నిష్ణాతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కోర్సులో భాగంగా సాధారణ ఎంబీఏ సబ్జెక్ట్‌లతోపాటు ఫ్యామిలీ బిజినెస్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలలో(స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ బిజినెస్, ఎంటర్ప్రెన్యూరియల్ బయోగ్రాఫిక్స్, ఎంటర్ప్రెన్యూర్ మేనేజ్మెంట్) శిక్షణ ఉంటుంది. కోర్సు ఔత్సాహికులకు అకడమిక్ లక్షణాలకంటే ప్రధానంగా మూడు సహజ లక్షణాలు అవసరం. అవి.. వ్యాపార నిర్వహణపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, వ్యాపారంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలనే ఉత్సాహం. ఇవి ఉంటే ఫ్యామిలీ బిజినెస్ విభాగంలో రాణించడం ఎంతో తేలిక. ప్రొ॥పరిమళ్ మర్చెంట్ డెరైక్టర్- పీజీపీఎఫ్ఎంబీ, ఎస్.పి.జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై