ఎంబీఏలో వినూత్న స్పెషలైజేషన్లు ఎన్నో.. | Upcoming MBA Specializations | Sakshi
Sakshi News home page

ఎంబీఏలో వినూత్న స్పెషలైజేషన్లు ఎన్నో..

Published Sun, Feb 23 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

Upcoming MBA Specializations

ప్రపంచంలోనే తొలిసారిగా 1908లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలు.. కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగ్గట్లు మేనేజ్‌మెంట్ విద్య ఎన్నో మార్పుచేర్పులకు లోనైంది. గతంలో ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లకే పెద్దపీట ఉండేది. ఇప్పుడు ప్రపంచీకరణతోపాటే దేశ పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో కార్పొరేట్ ప్రపంచానికి విభిన్నమైన నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జాబ్‌మార్కెట్‌కు అనుగుణంగా ఎంబీఏలో సరికొత్త స్పెషలైజేషన్లు తెరపైకి వచ్చాయి. ఆయా విశ్వవిద్యాలయాలు, బీస్కూల్స్‌లో ఎంబీఏలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న అప్‌కమింగ్ స్పెషలైజేషన్లపై ప్రత్యేక ఫోకస్..
 
 1-రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్
 2-పెట్రోలియం మేనేజ్‌మెంట్
 3-పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్
 4-ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్
 5- టెలికం మేనేజ్‌మెంట్
 6-హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్
 7-ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్

 
 రూరల్ అండ్ అగ్రికల్చరల్
 
 గ్రామీణాభివృద్ధి.. దేశ ప్రగతికి ప్రథమ సోపానం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉన్న మన దేశంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతి ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. అందుకే ఈ రంగాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల పరంగా ప్రతి ఏటా సుమారు రూ. లక్ష కోట్ల కేటాయింపులు చేస్తూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎన్‌ఎల్‌ఆర్‌ఎం, ఎన్‌హెచ్‌ఆర్‌ఎం వంటి పలు పథకాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే.. అందుకు అవసరమైన ఆర్థిక నిర్వహణ నైపుణ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సు.. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్! ఈ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు రూరల్ డెవలప్‌మెంట్ మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, మేనేజీరియల్ అకౌంటింగ్, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, గ్రామీణాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనువర్తనాలు తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఇక.. అవకాశాల పరంగా చూస్తే.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు, పథకాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. దాంతో గ్రామీణాభివృద్ధి రంగంలో సుశిక్షితులైన వందల మంది  మానవ వనరుల డిమాండ్ నెలకొనడం ఖాయం. మన దేశంలో ఈ కోర్సును అందిస్తున్న కళాశాలల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కోర్సుల గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన, సమాచారం కూడా అందుబాటులో లేదు. అయితే విద్యార్థులు ఈ కోర్సును చక్కటి ఉపాధికి వేదికగా భావించి ఎంచుకోవాలి. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు..  ప్రభుత్వ రంగంలో ప్రణాళిక సంఘం, ఆయా పథకాల నిర్వహణ విభాగాలు, వ్యవసాయం తదితర విభాగాలు.. ప్రైవేటు రంగంలో స్వచ్ఛంద సంస్థలు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. అంతేకాకుండా ఇటీవల కాలంలో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పేరిట కార్పొరేట్ సంస్థలు కూడా పలు సామాజిక అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో ఎంఎన్‌సీ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు వివిధ సంస్కృతుల ప్రజలతో కలిసిపోయే తత్వం.. గ్రామీణ ప్రాంతాలపై సహజమైన ఆసక్తి, అంకిత భావం.. కెరీర్ ప్రారంభంలోనే భారీ మొత్తాలతో వేతనాలు ఆశించకుండా పనిచేయగల సంసిద్ధత వంటి ప్రత్యేక లక్షణాలు ఉండాలి.
 
 డా॥ఎస్.ఎం. ఇలియాస్  
 డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్
 ఎన్‌ఐఆర్‌డీ, హైదరాబాద్

 
 పెట్రోలియం మేనేజ్‌మెంట్
 
 పెట్రోల్.. పెట్రోలియం అంటే.. పెట్రోల్ నిక్షేపాల వెలికితీత, పెట్రోల్ వినియోగం.. ఇవే సాధారణంగా మనందరికీ తెలిసిన విషయాలు! కానీ, క్షేత్రస్థాయిలో పెట్రోలియం నిక్షేపాలను కనుగొనడానికి, వెలికితీయడానికి ఎంతటి సాంకేతిక సామర్థ్యం అవసరమో.. అంతే స్థాయిలో నిర్వహణ నైపుణ్యాలూ ఉండాలి. ఎక్స్‌ప్లొరేషన్, ఉత్పత్తి, రిఫైనింగ్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా క్షేత్ర స్థాయి నుంచి వినియోగదారులకు చేరే వరకూ ప్రతి దశలోనూ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సే.. పెట్రోలియం మేనేజ్‌మెంట్. ఇప్పటికే అన్ని దేశాలు సహజ, పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. పెట్రోలియం వనరుల అన్వేషణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ముఖ్యంగా షెల్ గ్యాస్, ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్, క్రూడ్ నాణ్యత నిర్ధారణ వంటి అంశాల్లో సాంకేతికపరమైన అవసరాలతోపాటు నిర్వహణ నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల డిమాండ్ పెరగనుంది. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారికి మరింత కలిసొచ్చే కోర్సుగా పెట్రోలియం మేనేజ్‌మెంట్‌ను పేర్కొనొచ్చు. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కీలక ఇంధనాలు.. చమురు, సహజ వాయువు. ఎంబీఏ పెట్రోలియం పూర్తయ్యాక.. చమురు, గ్యాస్ కంపెనీల్లో ఫైనాన్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, పెట్రోలియం ఎకనామిక్స్ తదితర రంగాల్లో స్థిరపడొచ్చు. కన్సల్టింగ్ ఏజెన్సీల్లోనూ పనిచేయొచ్చు. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు సాంకేతిక దృక్పథం, న్యూమరికల్ స్కిల్స్, ‘థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అప్రోచ్’ ఎంతో అవసరం. అంతేకాకుండా ‘డూ ఇట్’ అనే వైఖరి ఉంటే తక్కువ సమయంలోనే కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయిదారు ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నప్పటికీ.. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా వీటి సంఖ్య కూడా సమీప భవిష్యత్తులోనే పెరగడం ఖాయం. ఈ కోర్సులో చేరాలనుకునేవారికి విస్తృత ఆలోచన పరిధి.. కష్టపడి పనిచేసే స్వభావం.. ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం.. నిరంతరం నేర్చుకునే తత్వం..  అంతర్జాతీయ విపణిపై నిరంతర అవగాహన ఎంతో అవసరం.
 
 ప్రొ॥హేమంత్ సి. త్రివేది
 డెరైక్టర్, స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్‌మెంట్,
 పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ

 
 పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్

 ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్ ఆవశ్యకత ఎంతో ఉంది. దేశంలో ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. కానీ వాటి అమలులో మరెన్నో లోపాలు. వీటిని సరిదిద్దుతూ అసలైన లబ్ధిదారులకు వాటిని చేర్చే విధంగా నైపుణ్యాలను అందించే కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్. దేశానికి స్వాతంత్య్రం  వచ్చాక కొన్ని దశాబ్దాల పాటు పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్ కేవలం సివిల్ సర్వెంట్లకు, ఇతర ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమైంది. తర్వాత మారుతున్న కాలంతోపాటు ప్రభు త్వ ఆలోచనా దృక్పథంలోనూ మార్పు వచ్చింది. దీనికి అనుగుణంగా.. ప్రభుత్వం తాను చేపడుతున్న పథకాలపై విశ్లేషణ, సలహాలు, సూచనల కోసం కేవలం సివిల్ సర్వెంట్లే కాకుండా.. సమాజంలో నిపుణులు, మేధావుల సహకారం తీసుకుంటోంది. ఈ క్రమంలో.. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలు, వాటికి సంబంధించి పర్యవసానాలు, లాభనష్టాలు, పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరేందుకు గల మార్గాలు వంటి వాటిపై శిక్షణనిచ్చేందుకు తెరపైకి వచ్చిన కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్. పబ్లిక్ పాలసీ అనేది నిర్దేశిత లక్ష్యాల సాధనకు సంబంధించి సంస్థాగత నిర్ణయాలు, నిర్వహణ, ఆర్థిక, పరిపాలన విధానాల రూపకల్పన వంటి విషయాల్లో నైపుణ్యం అందిస్తుంది. ముఖ్యంగా విధాన సమస్యల సమీక్ష, డేటా అనాలిసిస్, సాధారణ ప్రజానీకానికి ఎదురవుతున్న సమస్యల పరిష్కార మార్గాలపై నిర్వహణ పరమైన నైపుణ్యాలను పూర్తి స్థాయిలో అందించేలా ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన వారు అవకాశాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. ప్రస్తుతం పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న ఈ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరిశోధనా సంస్థల్లో అనలిస్ట్‌లు, ప్రభుత్వ శాఖల్లో.. అదే విధంగా స్వచ్ఛంద సంస్థల్లో సలహాదారులు లేదా మేనేజర్లుగా అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కాన్సెప్ట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేట్ సంస్థల్లో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సును ఎంచుకోవాలనుకునేవారికి ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి, అవగాహన ఉండాలి. ఇక.. అకడమిక్ పరంగా డేటా అనాలిసిస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అవసరం.
 
 ప్రొ॥ఆర్. సుదర్శన్
 డీన్, జిందాల్ స్కూల్ ఆఫ్
 గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ,
 ఒ.పి. జిందాల్ గ్లోబల్
 యూనివర్సిటీ- హర్యానా

 
 ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్

దేశంలో ఇన్సూరెన్స్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతున్న తరుణమిది. భారత్‌లో బీమా రంగంలో ప్రభుత్వంతోపాటు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు సైతం ప్రవేశించాయి. మరోవైపు బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఇన్సూరెన్స్ డొమైన్ ఏరియాలో.. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోలు, వినియోగదారుల సేవాపరమైన అంశాలు, నిర్వహణ విభాగాల్లో సమర్థవంతమైన నిర్వహణ అత్యవసరంగా మారింది. అందుకు అనుగుణంగా బీమా రంగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్! ఈ కోర్సులో భాగంగా.. జీవితబీమా సంబంధ వ్యవహారాల నిర్వహణతోపాటు జనరల్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు (ఉదా: మెరైన్ కార్గో ఇన్సూరెన్స్, హెల్త్ అండ్ పర్సనల్ ఇన్సూరెన్స్, మిస్లేనియస్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్) బోధిస్తారు. అంతేకాకుండా రిస్క్ మేనేజ్‌మెంట్, యాక్చుయేరిల్ సైన్స్ వంటి సాంకేతిక అంశాలపైనా శిక్షణ ఉంటుంది. ఫలితంగా.. కోర్సు పూర్తయ్యే సమయానికి ఒక విద్యార్థి బీమా రంగ కార్యకలాపాలకు సంబంధించి అన్ని విభాగాల్లో పరిపూర్ణత సాధిస్తాడు. ఎంబీఏ ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌ను అభ్యసిస్తే బీమా సంస్థల్లో ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఆసక్తిని బట్టి బీమా సలహాదారుగా పనిచేయొచ్చు. భవిష్యత్తులో మరిన్ని బీమా సంస్థలు ప్రవేశించే అవకాశముంది. కాబట్టి సమర్థులైన మానవ వనరుల అవసరం మరింత పెరగనుంది. అయితే,  ఔత్సాహిక అభ్యర్థులకు ఇన్సూరెన్స్ రంగంతోపాటు.. ఈ రంగాన్ని ప్రభావితం చేసే దేశ ఆర్థిక పరిస్థితులపై నిరంతర అవగాహన ఉండాలి. దీంతోపాటు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, బృందంలో పనిచేసే లక్షణాలు ఉంటే మరింతగా రాణించగలరు.
 
 ప్రొ॥డి. విజయ లక్ష్మి
 చైర్ ప్రొఫెసర్,
 నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ- పుణె

 
 టెలికం మేనేజ్‌మెంట్


 సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న  రంగం టెలికం. ప్రపంచంలోని అతిపెద్ద రంగాల్లో భారత టెలికం రంగం కూడా ఒకటి. ఆర్థిక సంస్కరణల తర్వాత టెలికం రంగంలో ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చారు. అదేసమయంలో టెలికం సేవల వినియోగం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు ప్రైవేట్ రంగం విస్తరణ.. మరోవైపు సేవలకు డిమాండ్ వెరసి.. ఈ రంగంలో భారీగా నిపుణుల అవసరం ఏర్పడింది.  టెలికం రంగం నిర్వహణకు సుశిక్షితులైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. టెలికం మేనేజ్‌మెంట్! అభివృద్ధి చెందుతున్న  మన దేశంలో ఈ కోర్సు ఆవశ్యకత ఎంతో ఉంది. కోర్సులో భాగంగా.. మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ వంటి రెగ్యులర్ ఎంబీఏ సబ్జెక్టులతోపాటు టెలికం విభాగానికి సంబంధించి.. టెలికం సర్వీసెస్ టెక్నాలజీస్, వైర్‌లెస్ కమ్యూనికేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, టెలికం సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఐటీ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, కన్వర్జెన్స్ ఆఫ్ టెలికం నెట్‌వర్క్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ టెలికం, కేస్ స్టడీస్ ఇన్ టెలికం మేనేజ్‌మెంట్ వంటి కోర్ సబ్జెక్ట్‌లలో శిక్షణ ఉంటుంది. ఇక.. ఈ రంగం భవిష్యత్ కోణంలో విశ్లేషిస్తే.. రోజుకో సరికొత్త టెక్నాలజీ.. కొత్త సంస్థల ప్రవేశంతో సేవల రంగంలో ఒకటైన కమ్యూనికేషన్‌కు సంబంధించి టెలికం విభాగం వేగంగా పురోగమిస్తోంది. ఈ నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బ్యాచిలర్ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు కెరీర్ ఉన్నతి పరంగా టెలికం మేనేజ్‌మెంట్ మరింత కలిసొచ్చే కోర్సు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు కష్టించేతత్వం, నిరంతరం ఆవిష్కృతమవుతున్న కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకునే దృక్పథం అవసరం.
 
 ప్రొ॥సునీల్ పాటిల్
 డెరైక్టర్, సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికం
 మేనేజ్‌మెంట్- పుణే

 
 హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
 
 దేశంలో హెల్త్‌కేర్ రంగం సగటున 15.5 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసుకుంటూ శరవేగంగా పయనిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆధునిక హంగులతో హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్స్ భారీగా ఏర్పాటవుతున్నాయి. అంతేకాకుండా హెల్త్‌కేర్ సంబంధిత హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ తదితర విభాగాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ఫలితంగా క్లినికల్ నిపుణులతోపాటు ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు సేవలందించే విషయంలో నిర్వహణా నిపుణుల ఆవశ్యకత ఏర్పడుతోంది. వైద్యులు.. రోగులకు చికిత్సపరంగా సేవలందిస్తే.. సదరు ఆస్పత్రి పరిపాలన వ్యవహారాలు, రోగులకు సేవలందించేందుకు పలు విభాగాలను సమన్వయం చేయడం వంటి విధులను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో ఆదాయ-వ్యయాల విషయంలో అటు సంస్థకు, ఇటు రోగులకు అనుకూలమైన విధానాలు రూపొందించడం.. నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలు ఎంతో అవసరం. అటువంటి స్కిల్స్‌ను అందించే కోర్సు.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్! ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, అదే విధంగా ప్రభుత్వం మెడికల్ టూరిజం కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఈ రంగంలో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించొచ్చు! కేవలం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్‌గానే కాకుండా.. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, హెల్త్ ఎన్‌జీఓలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు అకడమిక్ నేపథ్యంతోపాటు వైద్యులతో సమానంగా ప్రజలకు సేవలందిస్తున్నామనే ఆత్మ సంతృప్తి, సేవా దృక్పథం, పలు సంస్కృతుల ప్రజలతో మమేకం కావడం, కష్టపడి పనిచేసే తత్వం వంటి లక్షణాలు ఉంటే కెరీర్ మరింత ఉజ్వలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగం అనేది ఆర్థిక మాంద్యం సెగ తగలని విభాగం కాబట్టి.. కెరీర్ పరంగా దీన్ని ఎవర్‌గ్రీన్‌గా పేర్కొనొచ్చు.
 
 డా॥ధీరేంద్ర కుమార్
 డెరైక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, బెంగళూరు.

 
 ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్
 
 భారత ఆర్థిక వ్యవస్థకు కుటుంబ వ్యాపారాలే వెన్నెముకలు. దేశంలోని మొత్తం వ్యాపారాల్లో 90 శాతం సంస్థలు, పరిశ్రమలు  కుటుంబాల నిర్వహణ పరిధిలోనివే. ఈ సంస్థలపైన మరెన్నో అనుబంధ వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయి (ఉదా: వెండర్స్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు తదితర). ఎన్ని బహుళ జాతి సంస్థలు దేశంలో అడుగుపెట్టినా భవిష్యత్తులోనూ దేశ ప్రగతి విషయంలో ఫ్యామిలీ బిజినెస్ కీలక పాత్ర పోషించనుంది. ఇంతలా ప్రాధాన్యం సంతరించుకున్న ఫ్యామిలీ బిజినెస్‌కు సంబంధించి.. సదరు యజమాని లేదా వారసుల్లో వ్యాపార వృత్తి నిర్వహణ నైపుణ్యాలు లేకపోవడం.. నిర్వహణ లోపం వంటివి సమస్యగా మారుతోంది. ఇలాంటి నైపుణ్యాలను అందించే కోర్సే.. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్. గతంలో సాధారణంగా ఈ తరహా కోర్సులను ఆయా సంస్థల యాజమాన్యాల వారసులే అభ్యసించేవారు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో.. ఒక కుటుంబ అధీనంలోని వ్యాపార సంస్థల నిర్వహణ దిశగా ఆయా యాజమాన్యాలు తమకు సహకరించేందుకు ఫ్యామిలీ బిజినెస్‌లో నిష్ణాతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కోర్సులో భాగంగా సాధారణ ఎంబీఏ సబ్జెక్ట్‌లతోపాటు ఫ్యామిలీ బిజినెస్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలలో(స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూరియల్ బయోగ్రాఫిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్ మేనేజ్‌మెంట్) శిక్షణ ఉంటుంది. కోర్సు ఔత్సాహికులకు అకడమిక్ లక్షణాలకంటే ప్రధానంగా మూడు సహజ లక్షణాలు అవసరం. అవి.. వ్యాపార నిర్వహణపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, వ్యాపారంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలనే ఉత్సాహం. ఇవి ఉంటే ఫ్యామిలీ బిజినెస్ విభాగంలో రాణించడం ఎంతో తేలిక.
 
 ప్రొ॥పరిమళ్ మర్చెంట్
 డెరైక్టర్- పీజీపీఎఫ్‌ఎంబీ, ఎస్.పి.జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement