మారాలి.. మార్చాలి
► స్వశక్తితో రాణించాలి
► అప్పుడే సాధికారత సాధ్యం
► స్త్రీ శిశు సంక్షేమానికి పెద్దపీట
► కలెక్టర్ భారతి హోళికేరి
సాక్షి, మెదక్ : ఎవరో వస్తారని ఎదురుచూడకుండా మహిళలు స్వశక్తితో అన్నిరంగాల్లో రాణించేందుకు పట్టుదలతో కృషి చేయాలని అప్పుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధ్యం అవుతుందని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మహిళాదినోత్సవం పురస్కరించుకుని ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు మాట్లాడుతూ జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాటల్లో.. ‘బి బోల్డ్ ఫర్ ఛేంజ్’ అన్న నినాదంతో మహిళలు ముందుకు సాగాలి.. మెదక్ జిల్లాలో యాభై శాతానికిపైగా మహిళలు ఉన్నారు. వీరిని విస్మరించి జిల్లా, రాష్ట్ర అభివృద్ధి సాధించలేం.
మహిళలను భాగస్వాములను చేసినప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది. జిల్లాలోని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇందుకోసం ఎవరికి వారే ప్రేరణ పొందుతూ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ తాము ఎన్నుకున్న రంగాల్లో ఎదగాలి. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కలెక్టర్‌గా జిల్లాలోని మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయటం జరుగుతుంది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల విషయంలో. ప్రతి విద్యార్థిని చదివేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు స్వఛ్చంద సంస్థల ద్వారా ఉన్నతవిద్యలో రాణించేందుకు అవసరమన శిక్షణ అందజేస్తాము.
ఏప్రిల్‌లో ప్రత్యేక శిక్షన తరగతులు నిర్వహించాలనుకుంటున్నాము. ప్రసవాలు వందశాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చర్యలు చేపడుతున్నాం. కౌడిపల్లి పీహెచ్‌సీలో ప్రయోగాత్మకంగా వందశాతం ప్రసవాలు నార్మల్ ప్రసవాలు జరిగేలా చూస్తున్నాము. ఇది క్రమంగా మెదక్ జిల్లా అంతటా అమలు చేస్తాము. బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మహిళలకు సంబంధించి విద్య, వైద్య రంగాల్లో రాణించేలా చూస్తున్నాం. మహిళా రైతులు ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నాం. త్వరలో సేంద్రియ వ్యవసాయం, ఆహార ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై శిక్షణ ఇప్పించనున్నాం అని అన్నారు.