తిరువనంతపురం : కేరళలో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్ల అధ్వాన్న స్థితిని ప్రశ్నిస్తూ పీడబ్ల్యూడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన ఆమెను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా అవమానించారు. ఆమె కూర్చున్న చోటి నుంచి వెళ్లి పోయాక ఆవు పేడతో ఆ స్థలాన్ని శుద్ధి చేశారు. కేరళలోని త్రిసూరు జిల్లా నట్టికా ఎమ్మెల్యే గీతా గోపి శనివారం పీడబ్యూడీ కార్యాయలం వద్ద నిరసనకు దిగారు. గుంతలు పడిన రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి సీఎం పినరయి విజయన్ దృష్టికి తీసుకువెళ్తానని అధికారులను హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ యువ నాయకులు కొంతమంది గీతా గోపి కూర్చున్న స్థలాన్ని నీళ్లతో కడిగి ఆవు పేడతో శుద్ధి చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆమె ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితురాలైన కారణంగానే వారు తనను ఇలా అవమానించారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనను కేరళ కళలు, సాంస్కృతిక మంత్రి ఏకే బాలన్ తీవ్రంగా ఖండించారు. ఉత్తర భారత దేశంలో సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని... ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment