‘తంగలాన్’ సినిమాలో దళిత స్త్రీలకు మొదటిసారి రవికెలు ఇచ్చినప్పుడు వారు వెలిబుచ్చే ఆనందం, సంబరం ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది. స్త్రీలపై పీడన చరిత్రలో అనేక విధాలైతే దళిత స్త్రీలకు పై వస్త్రం ధరించే హక్కు లేకుండా చేయడం మరో పీడన. రవికె ధరించాలంటే దళిత స్త్రీలు ‘ములక్కారం’ పేరుతో సుంకం కట్టాల్సి వచ్చేది. దీనిని ఎదిరించడానికి తన రొమ్ముల్ని కోసుకుంది నాంజెలి అనే స్త్రీ. కన్యాకుమారిలో దళిత స్త్రీలు ‘రవికె కట్టు ఉద్యమాన్ని’ నిర్వహించారు. ఈ తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.
‘తంగలాన్’ సినిమాలో ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని దళితులకు భూమి ఉండదు. ఊరిలో భాగం ఉండదు. అలాగే బట్ట కూడా ఉండదు. ఒంటి నిండా బట్ట లేకుండా ఉంచడం వారిని ‘గుర్తించడానికి’ ఒక సంకేతం. పురుషులు ‘మోకాళ్లకు దిగని’ అంగవస్త్రాన్ని మాత్రమే కట్టుకోవాలి. స్త్రీలు రవిక లేకుండా మోకాళ్ల పైకి చీర చుట్టుకోవాలి. వారి భూమిని వారి నుంచి లాక్కుని వారినే కూలివాళ్లుగా మార్చి పని చేయిస్తుంటాడు జమీందారు.
ఒకవేళ ఎవరికైనా భూమి ఉంటే అందులో పంట పండితే అది ఇల్లు చేరదు. నిప్పుకు ఆహుతి అవుతుంది. ఈ బాధలు పడలేక బ్రిటిష్ వారి కింద ఊడిగం చేసి బంగారు గని కార్మికులుగా పని చేసి బాగుపడదామనుకుంటారు దళితులు. అందులో భాగంగా తంగలాన్ (విక్రమ్) నాయకత్వంలో దళితులను కోలార్‌కు వలస తీసుకెళతారు. అక్కడ విక్రమ్ కష్టం చూసి, నాయకత్వ లక్షణాలు చూసి ముందు అతన్ని దుస్తులతో గౌరవిస్తాడు. ప్యాంట్ షర్ట్ ఇస్తాడు.
కూలి డబ్బు తీసుకొని గుర్రమెక్కి వచ్చిన విక్రమ్ తన వాడ మహిళల కోసం తెచ్చే ఒకే ఒక కానుక రవికలు. వాటిని చూసి మహిళలు తమ జీవితాల్లో ఇలాంటి రోజొకటి వస్తుందా అన్నట్టు చూస్తారు. రవిక తొడుక్కునే స్వేచ్ఛను మొదటిసారి అనుభవిస్తూ పులకించిపోతారు. ఒంటి నిండా బట్ట కట్టుకుంటే వచ్చే గౌరవాన్ని పొందుతారు. 1850 కాలం నాటి కథగా దీనిని దర్శకుడు పా.రంజిత్ చూపుతాడు. అయితే ఆ కాలం దాటి ఇన్నేళ్లు గడిచినా ఇంకా కొన్ని తెగలలో స్త్రీలకు ఎద పై వస్త్రం దొరకడం, తొడిగే ఆర్థిక స్థితి రాకపోవడం విషాదం. అదే సమయంలో తమ హక్కును గుర్తెరిగి వక్షాన్ని కప్పుకునే హక్కు కోసం నినదించే స్త్రీలనూ మనం గుర్తు చేసుకోవాలి.
అరిటాకుల్లో వక్షోజాలు
కేరళ, తమిళనాడుల్లోని ట్రావెన్‌కోర్ రాజ్యాన్ని పరిపాలించిన శ్రీమూలమ్ తిరుమాళ్ (1885–1924) కాలంలో జరిగిన ఘటన ఇది. ఆ రోజుల్లో ట్రావెన్‌కోర్ రాజ్యంలో దళితుల మీద 110 రకాల పన్నులుండేవి. మగవాళ్లు శిరోజాలు పెంచుకుంటే ‘తలక్కారం’ అనే పన్ను కట్టాలి. స్త్రీలు వక్షోజాలు కప్పుకుంటే ‘ములక్కారం’ అనే పన్ను కట్టాలి. అసలే పేదరికంలో ఉన్న దళితులు ఈ పన్నులు కట్టలేక బాధలు అనుభవించేవారు. నాంజెలి అనే మహిళ తన ఇంటి ముందుకు వచ్చిన పన్ను వసూలు వ్యకికీ, అలాగే రాజుకు జీవితకాల పాఠం నేర్పాలని అనుకుంది.
అరిటాకుల్లో బియ్యం పెట్టి కట్టాల్సిన పన్నుకు బదులు పదునైన కొడవలితో కోసుకున్న తన వక్షోజాలను పెట్టి ఇచ్చింది. అరిటాకుల్లో కోసిన వక్షోజాలు కేరళలో పెనుకంపనం కలిగించాయి. ఆ విధంగాప్రాణత్యాగం చేసిన నాంజెలి వల్ల వెంటనే రాజు వక్షోజ పన్నును తొలగించాడు. తొలగించింది పన్నే తప్ప దళిత స్త్రీలకు, నాడార్ స్త్రీలకు రవిక తొడుక్కునే హక్కు ఇవ్వలేదు. దాని కోసం పోరాటం సాగిస్తే ముడివేసుకునే రవికలు ధరించేందుకు అనుమతి లభించింది. ఆ తర్వాత చాలా కాలానికి అందరిలాంటి రవికలు ధరించారు. 1990ల వరకూ కూడా తమిళనాడు, కేరళలోని దళితులలో వృద్ధ మహిళలు రవిక ధరించేవారు కాదు. వారికి ఆ అలవాటు మెదడులో నిక్షిప్తమైపోవడమే కారణం.
రవిక కట్టే ఉద్యమం
ఆ సమయంలోనే కన్యాకుమారి జిల్లాలో దళిత స్త్రీలు ‘రవిక కట్టే ఉద్యమాన్ని’ భారీ ఎత్తున లేవదీశారు. దీనిని ‘మారు మరక్కమ్ సమరం’ అని పిలిచారు. దీనికే ‘చన్నార్ తిరుగుబాటు’ అని పేరు. పై కులాల వాళ్ల ముందు స్త్రీలైనా, పురుషులైనా నగ్నమైన ఛాతీతో ఉండటమే మర్యాదగా నాటి సమాజం నిశ్చయిస్తే రేగిన తిరుగుబాటు అది. పరిశోధకులు ఈ విషయమై సాగించిన అధ్యయనంలో ‘దళిత మహిళలకు చనిపోయిన మహిళల ఒంటిపైన ఉండే దుస్తులు ఇచ్చేవారు. కాన్పు సమయంలోని దుస్తులు ఇచ్చేవారు. వాటినే దళిత మహిళలు ధరించేవారు. శుభ్రమైన కొత్త బట్టలు ఇస్తే దళితులు కట్టుకోవడానికి సంశయించి పక్కన పడేసేవారు. వాటిని ఎప్పటికీ తొడుక్కునేవారు కాదు. అంతగా వారిని బట్టలకు దూరం ఉంచారు’ అని తెలియజేశారు.
యూనిట్‌లో అందరూ ఏడ్చారు
‘ఈ సన్నివేశం మాకు చెప్పేటప్పుడు ఆ కాలంలో ఆ స్త్రీల అనుభూతిని వివరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కాని సన్నివేశంలో నటిస్తున్న స్త్రీలందరం ఒకే రకమైన ఉద్వేగంతో ఉన్నాం. రవిక తొడక్కుండా ఉండటం అంటే ఏమిటో తెలియని మేము ఆనాటి స్త్రీల వేదనను అర్థం చేసుకుని మొదటిసారి తొడుక్కున్నట్టు నటించాం. మొదటి, రెండవ టేకే ఓకే అయింది. మా నటన చూసి యూనిట్‌లో సభ్యులు సంతోషంతో కన్నీరు కార్చారు’ అంది నటి పార్వతి. ఆమె ఈ సినిమాలో విక్రమ్ భార్య గంగమ్మగా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment