కలెక్టర్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న దళిత మహిళలు
నెల్లూరు(సెంట్రల్): దళిత మహిళా ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా చెక్‌పవర్‌లు రద్దు చేయించి మానసికంగా తమను హింసిస్తున్నారని పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ ఆరోపించారు. నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి పొరపాటు జరగకపోయినా, ఏ నేరం చేయక పోయినా, ఎక్కడా అవినీతికి పాల్పడకపోయినా తమ చెక్‌పవర్ రద్దు చేయించి మహిళలను, దళితులను అణగదొక్కడానికి కలెక్టర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా చట్ట విరుద్ధమైన , న్యాయ సమ్మతం కాని పనులు చేయమని చెప్పిన మాటలకు తాము నిరాకరించడం తప్పుగా భావించిన కలెక్టర్ తమ చెక్ పవర్ రద్దు చేయించడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కలెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పెత్తనం చేయడం శోచనీయమన్నారు. గతంలో ఎంతో మంది కలెక్టర్లు జిల్లాలో పనిచేశారని, ప్రస్తుత కలెక్టర్ తీరు, అసమర్థంగా పాలన ఇంత వరకు ఎవరూ చేయలేదన్నారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అధికారులతో విమర్శలు చేయిస్తూ, దళిత మహిళలమైన తమ మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. కలెక్టర్ పద్ధతి మార్చుకోక పోతే జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఏకమై కలెక్టరేట్‌ను దిగ్బంధం చేసి మా హక్కుల కోసం పోరాటం చేస్తామే తప్ప, మీ లాంటివారిని విడిచి పెట్టబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటాచలం సర్పంచ్ మణెమ్మ, వెంకటాచలం ఎంపీపీ అరుణమ్మ మరి కొంత మంది మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment