సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట): జిల్లాకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి చెన్నైకు ఆగ్నేయంగా 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కిలో మీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. తీవ్ర వాయుగుండం మరింత బలపడి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తుపాను క్రమంగా బలపడి నెల్లూరు–చెన్నైల మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మూడు రోజుల తర్వాత తుపాను చెన్నైకు సమీపించే అవకాశాలుఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుపాను కోస్తా జిల్లాలోపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంగా జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండం తుపానుగా మారిన తర్వాత 100 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది. తుపాను ప్రభావంతో ఈ నెల 14వ తేదీ రాత్రి నుంచి 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అప్రమత్తంగా ఉండండి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో తుపాను పరిస్థితిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం వల్ల ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, కావలి డివిజన్లపై తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు వెంటనే ఏర్పాటు చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. తీరప్రాంత మండలాలు, లోతట్టు ప్రాంతాల మండలాలకు ప్రత్యేక అధికారులు, బృందాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో పర్యటించాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చెట్లు నేల కూలితే వాటిని తొలగించే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
జనరేటర్లు, పడవలు, జేసీబీలు, అవసరమైన వాటితో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు అవసరమైన నిత్యావసర సరుకులు, మంచి నీరు, పాలు, కూరగాయలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎటువంటి విపత్తు సంభవించిన సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ కె.వెట్రిసెల్వి, గూడూరు, కావలి సబ్ కలెక్టర్లు ఓ. ఆనంద్, శ్రీధర్, డీఆర్‌ఓ ఎస్‌వీ నాగేశ్వరరావు, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ సదా భార్గవి, నెల్లూరు, ఆత్మకూరు, నాయుడుపేట ఆర్డీఓలు చిన్నికృష్ణ, సువర్ణమ్మ, శ్రీదేవి, ఏఎస్‌పీ పరమేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్, డ్వామా పీడీ బాపిరెడ్డి, డీఎస్‌ఓ చిట్టిబాబు, డీఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ వరసుందరం, ఇరిగేషన్ ఎస్‌ఈ ప్రసాద్‌రావు, డీటీసీ శివరామ్‌ప్రసాద్, విద్యుత్ శాఖ సీఈ విజయ్‌కుమార్‌రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment