నెల్లూరు(సెంట్రల్): పనులు చేయకుండా దొంగబిల్లులు డ్రా చేసిన, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా బిల్లులు చెల్లింపులు చేసిన వారిపై కలెక్టర్ ముత్యాలరాజు చర్యలెందుకు తీసుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంత అసమర్థ కలెక్టర్ ఎక్కడా చూడలేదన్నారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. జిల్లాను దోచుకుంటున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కలెక్టర్ వత్తాసు పలకడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి టీడీపీ నేతల జాబితాను సంబంధిత శాఖ అధికారులకు అందించి వీరు చెప్పిన పనులు చేయాలని, పనులు చేయకపోయినా బిల్లులు మంజూరుచేయాలని మంత్రి కొందరు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శి పేరుతో సంబంధంలేని వ్యక్తులు తీర్మానం పెట్టారన్నారు.
ఈ విషయంలో కార్యదర్శి లిఖితపూర్వకంగా రాసిచ్చినా సంబంధిత వ్యక్తులపై కలెక్టర్ చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో రామదాసుకండ్రిగ భూములకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వాటిపై మంత్రి సంతకాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారన్నారు. పీఆర్ కార్యాలయంలో ఇంజినీర్లను ఏమైనా అడిగితే తమకు తెలియదనే సమాధానం వస్తోందన్నారు. పసుపు కుంభకోణంలో వీఆర్వోలను సస్పెండ్ చేసి కలెక్టర్ చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. ఫోర్జరీ తీర్మానాలతో రూ.8 కోట్ల రోడ్ల పనుల్లో మంత్రి ముడుపులు తీసుకున్నా, ఫోర్జరీ పట్టాలతో రైతుల పరిహారాన్ని కాజేయాలనుకున్నా కలెక్టర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా భారీ స్థాయిలో అవినీతి, అవకతవకలు జరుగుతుంటే జిల్లాకు కలెక్టర్ ఉన్నారా, లేక సోమిరెడ్డి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారా అనే అనమానం కలుగుతోందన్నారు.
మామూళ్లు ఇవ్వకపోతే బెదిరింపులు
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇంగితజ్ఞానం లేకుండా నిజాయితీగా పనిచేసే వారిపై నోరు పారేసుకుంటారని కాకాణి విమర్శించారు. ఇంజి నీరింగ్ అధికారులు టీడీపీ నేతలకు మామూళ్లు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారన్నారు. నిజాయితీగా ఉండే ఓ మహిళా ఇంజినీర్‌పై డోంట్ టాక్ రబ్బీష్ అని ఆగ్రహం వ్యక్తం చేయడం, మరో అధికారిని యూజ్‌లెస్‌ఫెలో అని తిట్టడం సోమిరెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పనులు నాణ్యత జరిగాయా? లేదా? అని విచారణకు ఆదేశించగల దమ్ము చంద్రమోహన్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. దిగజారుడు పనులు చేయిస్తూ, దొంగబిల్లులు చేసుకోమని చెబుతూ ఓట్లు వేయాలని షరతులు పెడుతుండటం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాష్ట్రంలోని టాప్‌టెన్ అవినీతిపరుల్లో సోమిరెడ్డి ఒకరన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి మంత్రి చేస్తున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీటీసీలు వెంకటశేషయ్య, నెల్లూరు శివప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment