సాక్షి, నెల్లూరు : సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుపై మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అవినీతిపై పాలనాధికారి చర్యలు తీసుకోవాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. ఐదేళ్లు జెడ్పీ ఛైర్మెన్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందని అధికారులను గౌరవించడం తనకు తెలసునని చెప్పారు. ఒకరు చెబితే తెలుసుకొనే స్థితిలో లేననన్నారు. జిల్లాలో అనేక మంది గొప్పవాళ్ళు కలెక్టర్లుగా సమర్థవంతంగా పనిచేశారని చెప్పిన ఆయన.. ప్రభుత్వ ఉత్తర్వులను పక్కన పెట్టి, పాలకవర్గం మెహర్భాని కోసం కలెక్టర్ వేరే ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు.
మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వచ్చ భారత్ అవార్డు అందుకున్న కలెక్టర్‌కు ఇవి కనిపించడం లేదా నిలదీశారు. కలెక్టర్ అవినీతి పరుడని తాము అనలేదని, పాలన గాడి తప్పిందని హెచ్చరిస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించమని కోరడం ప్రజాప్రతినిధిగా తప్పా అని అడిగారు. గతంలో ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ అధికారులకు అండగా నిలిచానని గుర్తు చేసిన ఆయన, ఆ రోజు తన తీరును అధికారాలు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల అవినీతికి ప్రభుత్వ అధికారులను బలిపశువులను చేస్తున్నారని కాకాణి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment