ఇంకెప్పటికి మారతాం?! | Sakshi Editorial On Womens Leadership | Sakshi
Sakshi News home page

ఇంకెప్పటికి మారతాం?!

Published Fri, Oct 13 2023 4:10 AM | Last Updated on Fri, Oct 13 2023 4:10 AM

Sakshi Editorial On Womens Leadership

ఆ కేంద్రపాలిత ప్రాంతం మొత్తంలో ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి కూడా ఆమే! తీరా, అలాంటి వ్యక్తి కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏమనాలి? మామూలు పరిస్థితుల్లో రాజీనామా చేయడం కాదు... లింగ, కుల దుర్విచక్షణల్ని తట్టుకోలేక రాజీనామా చేశానంటున్నారు. ఆ ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఏకైక దళిత, మహిళా ఎమ్మెల్యే సి. చంద్ర ప్రియాంక ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే, ఆమె అసమర్థత రీత్యానే పదవి నుంచి తప్పించామని అధికార కూటమి అంటోంది. ఏమైనా, ఈ మహిళా మంత్రి రాజీనామా ఉదంతం స్త్రీలు, వెనుకబడిన కులాల పట్ల మన వ్యవస్థలోని చిన్నచూపును మరోసారి చర్చకు పెడుతోంది.  

దాదాపు 40 ఏళ్ళ విరామం తర్వాత పుదుచ్చేరిలో మంత్రి పదవి దక్కిన మహిళ చంద్రిక అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముప్ఫై మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో కారైక్కాల్‌ ప్రాంతంలో రిజర్వుడు స్థానమైన నెడుంగాడు నుంచి ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ముఖ్యమంత్రి ఎన్‌. రంగస్వామి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో 2021లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ‘మంచి ఆలోచనలతో, కష్టపడి పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చాన’న్న చంద్రిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో వివక్షకు గురయ్యానని ఆరోపించారు. ప్రజాదరణ ఉన్నా కుట్రల్ని తట్టుకొని, ధనశక్తి అనే భూతంపై పోరాడడం తేలిక కాదని గ్రహించినట్టు ఆమె తన రాజీనామా లేఖలో ఆవేదన చెందారు.  

ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకె, వామపక్షాలు ప్రభుత్వాన్నీ, సీఎం ‘దళిత వ్యతిరేక వైఖరి’నీ తప్పు బట్టాయి. అయితే, కీలకమైన మంత్రి పదవిని చంద్రిక సమర్థంగా నిర్వహించట్లేదనీ, ఆరునెలలుగా చెబుతున్నా పట్టించుకోవట్లేదనీ, అందుకే ఆమెను పదవి నుంచి తప్పించామనీ, కేంద్రానికి లేఖ పంపగానే అది తెలిసి ఆమె ముందే రాజీనామా చేశారనీ అధికార పక్షం చెబుతోంది.

చిత్రమేమిటంటే, అధికారపక్షం చెబుతున్న ఈ కథనాన్నే పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నరైన మరో మహిళ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొనడం! దుర్విచక్షణ ఉన్నట్టు తెలీదనీ, తనకు చెబితే పరిస్థితిని చక్కదిద్దేదాన్ననీ గవర్నర్‌ అన్నట్టు తమిళ పత్రికల కథనం. అయితే, మన దేశంలో అలాంటివి లేవనుకోవడం వట్టి భ్రమ. ఆ మాటకొస్తే, ఎవరూ బయటపడకపోయినా చంద్రిక కథ లాంటిదే... ఈ దేశంలోని పలు వురు మహిళా నేతల వ్యధ! పురుషాధిక్య ప్రపంచంలో, అందులోనూ రాజకీయాల్లో ఎన్నో సహించి, భరిస్తే కానీ స్త్రీలు తమకంటూ చిన్నచోటు దక్కించుకొని, గొంతు విప్పలేరన్నది నిష్ఠురసత్యం. 

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, చట్టం చేయడానికి సైతం దశాబ్దాలు పట్టిన రాజకీయ వ్యవస్థ మనది. అది అమలయ్యేదెన్నడో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరి స్థితుల్లో చంద్రిక లాంటి వారి ఉదంతాలు ఒక మేలుకొలుపు. ఆమె ఆరోపణలు సంపూర్ణ అసత్యాలని కొట్టిపారేయలేం. స్వతంత్ర భారత శతవసంతాల నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది పాలకులు ప్రవచిస్తున్న లక్ష్యం.

2047 కల్లా అది సాధ్యం కావాలంటే, జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళల పాత్ర, వారి ప్రాతినిధ్యం కీలకం. కానీ, అధిక శాతం పార్టీలు, ప్రభుత్వాల చేతలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గమనిస్తే, 1970ల వరకు లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం వద్దే తచ్చాడుతూ వచ్చింది. 2009లో గానీ అది రెండంకెలకు చేరు కోలేదు. రాజ్యసభలో అయితే 1951 నుంచి ఇప్పటి దాకా ఏనాడూ మహిళల సంఖ్య 13 శాతమైనా దాటలేదు. రాష్ట్ర శాసనసభల్లోనైతే సగటు మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువే. 

మహిళా మంత్రుల సంఖ్యలోనూ మన దేశంలో ఇదే పరిస్థితి. గత మూడు దశాబ్దాల పైచిలుకులో కేంద్రంలో మంత్రిపదవులను చేపట్టిన స్త్రీలు నాటి మహిళా ప్రాతినిధ్యంతో పోలిస్తే 11 శాతమే. క్యాబినెట్‌ హోదా దక్కినవారైతే 7 శాతమే. రాజకీయ పాలనలో కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలోనూ ఆడవారి వాటా మరీ తీసికట్టు. మొత్తం 30 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 11 శాతమే స్త్రీలు. కార్యనిర్వాహక, శాసన నిర్మాణ వ్యవస్థలతో పోలిస్తే, భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత మరీ కనాకష్టం.

1950 నుంచి చూస్తే, సుప్రీమ్‌ కోర్ట్‌ జడ్జీల్లో కూడా ఆడ వాళ్ళు 3 శాతమే. ప్రతిచోటా ఉన్నత స్థాయికి చేరడానికి అతివలకు అనేక అవరోధాలు. ఈ గణాంకాలన్నీ ఇప్పటికీ మహిళల పట్ల మనకున్న దుర్విచక్షణకూ, మారని మన పితృస్వామ్య భావజాలా నికీ నిలువుటద్దాలు. దానికి తోడు దళితులు, వెనుకబడిన వర్గాల స్త్రీల పరిస్థితి మరీ కష్టం. ఈ నేపథ్యం నుంచి పుదుచ్చేరి ఉదంతాన్ని చూసినప్పుడే సమస్య లోతులు స్పష్టమవుతాయి.  

దాదాపు 156 దేశాల్లో సగటున 23 శాతం మహిళా మంత్రులుంటే, భారత్‌ తద్భిన్నం. కేంద్రంలో పేరుకు మహిళా మంత్రుల సంఖ్య పెంచినా, వారికి రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, రవాణా, వ్యవసాయం లాంటి కీలక శాఖలు అప్పగించడం అరుదు. ఈ పరిస్థితిని మార్చాలంటే, మహిళా రిజర్వేషన్‌ చట్టాలు తెస్తే సరిపోదు. కులం, మతం, ప్రాంతం, జెండర్‌ అంశాల్లో పార్టీల, ప్రజల ఆలోచన మారాలి.

వెనుకబడిన వర్గాల, స్త్రీల సమర్థతను శంకించడం క్షమార్హం కాదు. అవకాశమిచ్చి, ప్రోత్సహిస్తే, పలువురు నేతల కన్నా వారే సమర్థులు. పాలిచ్చి పెంచిన అమ్మలు మనల్ని పాలించ లేరా? కుటుంబానికి ఇరుసుగా మారి, మొత్తం సమాజాన్ని నిలబెడుతున్న స్త్రీలు సమర్థులు కారా? వారికా సమర్థత లేదనుకోవడం మూర్ఖత్వం. మకిలిపట్టిన మనసుల్లోని మనుస్మృతి భావజాలం! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement