చాన్నాళ్లుగా అందరూ ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల భేరి మోగింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 27–ఏప్రిల్ 29మధ్య వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన వోట్ల లెక్కింపు మే 2న వుంటుంది. ఈ నాలుగు రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలుం డగా... 18.68 కోట్లమంది వోటర్లు తమ తీర్పునివ్వాల్సివుంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27–ఏప్రిల్ 29 మధ్య 8 దశల్లో పోలింగ్ నిర్వహించబోతుండగా... అస్సాంలో మార్చి 27– ఏప్రిల్ 6 మధ్య మూడు దశలుగా పోలింగ్ వుంటుంది. 234 సీట్లున్న తమిళనాడులో, 140 సీట్లున్న కేరళలో, 30 సీట్లున్న పుదుచ్చేరిలో మాత్రం ఒకే దశలో... అంటే ఏప్రిల్ 6న పోలింగ్ వుంటుంది.
వీటిల్లో కేవలం ఒకే ఒకచోట–అస్సాంలో బీజేపీ అధికారంలో వుంది. పుదుచ్చేరిలో ఈమధ్యే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించారు. గత మూడు నెలలుగా పరస్పర వాగ్యుద్ధాలతో, నిందారోపణలతో... దాడులు, ప్రతి దాడులతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్‌కు ఎనిమిది దశల పోలింగ్ ప్రకటించటం సహజంగానే అక్కడి అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌కు ఆగ్రహావేశాలు కలిగించింది. తమ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఇచ్చిన ఎన్నికల కేలం డర్‌ను యధాతథంగా ప్రకటించారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘంపై విరుచుకుపడిన తీరు కూడా గమనించదగ్గది. 8 దశల పోలింగ్‌పై ఆమె అసహనంగా వున్నారు. రానున్న రోజుల్లో ఆమె బీజేపీతోపాటు ఎన్నికల సంఘంతో కూడా లడాయికి దిగడానికి వెనకాడరని ఈ ప్రకటన తేటతెల్లం చేస్తోంది.
ఇప్పటికే తృణమూల్‌నుంచి పలువురు నేతలు బీజేపీలోకి ఫిరా యించారు. మమత సన్నిహిత బంధువులతోపాటు పలువురు తృణమూల్ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కూడా మొదలైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి మూడు స్థానాలు గెల్చుకుని బోణీ కొట్టిన బీజేపీ ఈసారి అధికారం తమదేనన్నంతగా హడావుడి చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో సాధించిన విజయమే ఈ దూకుడుకు కారణం. అయితే అధికారం దక్కడం అసాధ్యమని కొన్నాళ్లక్రితం వెలువడిన సర్వేలు చెబుతున్నాయి.
తృణమూల్ ఇప్పటికే ‘బెంగాల్ తన కుమార్తెను తప్ప మరెవరినీ కోరుకోవటం లేద’న్న ప్రధాన నినాదంతో బరిలో నిలిచింది. మమత చిత్రం, ఆ నినాదంవున్న హోర్డింగ్‌లు రాష్ట్రం నలుమూలలా వెలిశాయి. బెంగాల్‌ను బెంగాలీలు తప్ప బయటివారు పాలించటానికి ప్రజానీకం అంగీకరించ బోరని పలు బహిరంగసభల్లో మమత తరచు చెబుతున్నారు. అలాగే ఈసారి ‘జై శ్రీరాం’కూ...‘జై బంగ్లా’కూ మధ్య పోటీ జరగబోతోందని, బెంగాల్‌ను గుజరాతీలు పాలించడానికి వీల్లేదని ఆమె చేస్తున్న ప్రకటనలు చూస్తే బీజేపీని ఎదుర్కొనడానికి బెంగాలీ సెంటిమెంటును ఆమె బలంగా ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది.
అయితే తమిళనాడులో జాతీయ పార్టీలను గత కొన్ని దశాబ్దాలుగా నిలువనీడ లేకుండా చేస్తున్న ‘ద్రవిడ’ సెంటిమెంటు స్థాయిలో ఇది పని చేస్తుందా అన్నది వేచిచూడాలి. రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలేలిన వామపక్షాలు అత్యంత బలహీ నమైన స్థితిలో పడటం, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ సైతం అసంగతంగా మారటం ఇన్నాళ్లూ తృణమూల్‌కు వరమైంది. ఇప్పుడు బీజేపీ రూపంలో కొత్తగా వచ్చిపడిన సవాలును ఎదుర్కొ నవలసి రావటం ఆ పార్టీకి కష్టంగానే వుంది. ఒకపక్క అవినీతి ఆరోపణలు, మరోపక్క అంతంత మాత్రం అభివృద్ధి తృణమూల్‌కు సమస్యాత్మకమైనవి. వీటిని ఆ పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
మరో ప్రధాన రాష్ట్రం తమిళనాడులో ఈసారి తమ పార్టీ మెరుగైన స్థానంలో వుండాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. తమిళనాడులో వెయ్యి మెగావాట్ల నైవేలీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించటంతోసహా అనేక కొత్త ప్రాజెక్టులు ఆ రాష్ట్రానికి ప్రకటించారు. అటు పుదుచ్చేరికి కూడా చిన్నతరహా పోర్టుతో సహా అనేకం మంజూరయ్యాయి. అదే సమయంలో డీఎంకేకు ప్రధాన వనరుగా వుండే ఓబీసీలనూ, దళితులనూ దగ్గర చేసుకోవటానికి ఆ వర్గాలకు చెందిన నేతలకు పార్టీలోనూ, బయటా ప్రాధాన్యమిస్తున్నారు. అయితే శశికళ పార్టీకి ఎలాంటి ఆద రణ లభిస్తుందో, అన్నాడీఎంకే సర్కారు ప్రభావమెంతో, బీజేపీతో చెలిమి ఆ పార్టీకి లాభిస్తుందో లేదో చూడాల్సివుంది. కేరళలో వరసగా రెండోసారి అధికారం చేజిక్కించుకుని కొత్త రికార్డు నెల కొల్పాలని అక్కడి ఎల్‌డీఎఫ్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
అటు శబరిమల ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవటంతోపాటు ఇటు సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక ఆందోళనకారులపై పెట్టిన కేసుల్ని కూడా ఆ ప్రభుత్వం ఎత్తేసింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన గెలుపు ఎల్‌డీఎఫ్ ఆశల్ని పెంచింది. అస్సాంలో అధికార పక్షంగా వున్న బీజేపీకి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నుంచి గట్టి సవాలే ఎదురుకాబోతోంది. చట్టవిరుద్ధ వలసలను అరికట్టేం దుకు ఉద్దేశించిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏలు గత ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ఆయుధాలు. ఈసారి వాటి ప్రస్తావన లేకుండానే బీజేపీ బరిలో దిగుతోంది. మొత్తానికి ఎంతో ఆసక్తికరంగా సాగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఎలాంటి అపశ్రుతులూ చోటుచేసుకోరాదని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment