Assembly Election Commision To Announced Polls Schedule For West Bengal, Kerala, Tamil Nadu, Assam and Puducherry - Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

Published Fri, Feb 26 2021 4:48 PM | Last Updated on Fri, Feb 26 2021 9:20 PM

EC Announced Polls Schedule For WB, Kerala, TN, Puducherry And Assam - Sakshi

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అస్సోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా శుక్రవారం ప్రకటించారు.

కేరళ 140, అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీకి కూడా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు.

షెడ్యూల్‌లో ముఖ్యాంశాలు

  • మొత్తం ఐదు అసెంబ్లీలలోని స్థానాలు 824
  • మొత్తం ఓటర్లు 18.68 కోట్ల మంది
  • మొత్తం 2.70 లక్షల పోలింగ్‌ స్టేషన్లు
  • ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితోపాటు నలుగురే పాల్గొనాలి.
  • రోడ్‌ షోలో ఐదు వాహనాలకే అనుమతి
  • 80 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి అవకాశం
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రం ప్రతి వెయ్యి మందికి ఒకటి ఏర్పాటు. గతంలో1,500 మంది ఓటర్లకు ఒక బూత్‌ ఉండేది.
  • ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్‌.
  • ఈసారి ఎప్పుడు లేని విధంగా ఆన్‌లైన్‌ విధానంలో అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు అవకాశం కల్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
  • మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్నాయి.
  • మే 2వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన
  • ఐదు రాష్ట్రాలు అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి

అసోం
మూడు విడతల్లో 126 స్థానాలకు ఎన్నికలు. మార్చి 27వ తేదీన తొలి విడత పోలింగ్‌ (47 అసెంబ్లీ స్థానాలు). ఏప్రిల్‌ 1, 6వ తేదీల్లో రెండు, మూడో విడతలకు ఎన్నికలు. 33 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు.

తమిళనాడు

234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌. 89 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

కేరళ

140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ ఏప్రిల్ ‌6వ తేదీన ఎన్నిక. 40 వేల పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ చేపట్టనున్నారు. 

పశ్చిమ  బెంగాల్

294 స్థానాలతో అతిపెద్ద అసెంబ్లీగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6, 10, 17, 22, 26, 29 పోలింగ్ చేపట్టనున్నారు. 8 విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు లక్షకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

పుదుచ్చేరి

30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌. 1,500 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు.

మొత్తం అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement