న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు ఎన్నికలు చాలా ఖరిదైనవిగా మారిపోతున్నాయి. కేవలం ప్రచారం కోసమే వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో తిరిగి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రచారం కోసం రూ.154.28 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ ఏడాది జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోకి, ఇదే అత్యధికం కావడం గమనార్హం.
అలాగే, తమిళనాడులోని అధికారాన్ని చేజిక్కించుకున్న ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) రాష్ట్రంలో, అలాగే పక్కనే ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల కోసం రూ.114.14 కోట్లకు పైగా (రూ.1,14,08,525) ఖర్చు చేసినట్లు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన ఎన్నికల వ్యయ ప్రకటనలో తెలిపింది. గుర్తింపు కలిగిన అన్ని జాతీయ, స్థానిక పార్టీలు ఈ ఏడాది ఎన్నికల్లో తాము పెట్టిన ఖర్చును ఎన్నికల సంఘానికి సెప్టెంబర్ 2న సమర్పించడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ప్రకటనలను పోల్ ప్యానెల్ పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ చేశారా..?)
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడును పాలించిన ఎఐఎడిఎంకె రాష్ట్రంలో, పుదుచ్చేరిలో ప్రచారం కోసం రూ.57.33 కోట్లు(రూ.57,33,86,773) ఖర్చు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం ఎన్నికలన్నింటికీ కలిపి కాంగ్రెస్ రూ. 84.93 కోట్లను ఖర్చు చేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక యుటీలో ప్రచారం కోసం సీపీఐ 13.19 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపింది. బీజేపీ ఎన్నికల ఖర్చు నివేదికను మాత్రం ఈసీ సెప్టెంబర్ 2 నాటికి ప్రచురించకపోవడం ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment