మీడియాతో మాట్లాడుతున్న రామ్‌శంకర్ కఠారియా
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్‌డీఎఫ్) అమలు తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేటాయించిన నిధులు, ఖర్చు తీరును సమీక్షించి నివ్వెరపోయింది. మరో నెలన్నరలో వార్షిక సంవత్సరం ముగియనుండగా.. సగం నిధులు కూడా ఖర్చు చేయకపోవడంతో యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల తీరును పరిశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కఠారియా ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి బృందం రెండు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించింది. ఎస్సీ సంక్షేమ సంస్థలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖలతో వేర్వేరుగా సమావేశమై పరిస్థితిని పరిశీలించింది. 2017–18లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి అమలు తీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితోపాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించింది.
అయినా మారలేదు..
2017–18లో ఎస్సీఎస్‌డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సగం కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లో ఉన్నప్పుడూ పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయలేదని, ఈసారి ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినా పరిస్థితి మాత్రం మారలేదని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసినప్పుడే దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. లక్ష్య సాధనలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్‌అండ్‌బీ, పరిశ్రమలు, రుణ వితరణ శాఖలు పురోగతిలో తీవ్ర వెనుకబాటును ప్రదర్శిస్తున్నాయని అభిప్రాయపడింది. ఎస్సీఎస్‌డీఎఫ్‌లో ఉన్న అన్ని శాఖల పనితీరులో అంతరాలున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపైనా సమీక్షించింది. డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
దళితులపై దాడులు పెరుగుతున్నాయ్
రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నా యని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనట్లు తెలిపింది. పోలీసుల తీరుతో బాధితులు నష్టపోతున్నట్లు అభిప్రాయపడింది. దాడి జరిగిన వెంటనే కేసు నమోదు చేయాలని, కానీ కేసుల నమోదు, దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సభ్యులు పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదైతేనే బాధితులకు పరిహా రం వస్తుందని, కానీ నమోదులో జాప్యం జరగడంతో బాధితులకు పరిహారం సకాలంలో అందట్లేదన్నారు. కేసు నమోదు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందని, బాధితులందరికీ కోర్టును ఆశ్రయించే చైతన్యం ఉండకపోవచ్చని అన్నారు. కేసుల నమోదులో జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉందని కమిషన్ వైస్‌చైర్మన్ మురుగన్ అన్నారు. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, పరిహారం తది తర వివరాలతో నివేదికను సమర్పించాలని రాష్ట్ర పోలీసు శాఖకు స్పష్టం చేసినట్లు చెప్పారు.
బాలికల అక్షరాస్యత తగ్గింది
రాష్ట్రంలో దళిత బాలికల అక్షరాస్యత క్రమంగా తగ్గుతోందని కమిషన్ తెలిపింది. కారణాలను అన్వేషించాలని, బాలికల అక్షరాస్యత తగ్గడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎస్సీ బాలికల డ్రాపౌట్ శాతం పెరుగుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనితీరు బాగుందని సభ్యులు కితాబిచ్చారు. దళిత యువతుల వివాహానికి సంబంధించి అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం సత్ఫలితాలిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment