
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రపంచం భారత్ వైపే చూస్తోందని, ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్ రూపొందిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (సీపీవీ, ఓఐఏ) ఔసాఫ్ సయీద్ పేర్కొన్నారు. విదేశీ వలసలను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారులు, ఇతర ఉన్నతస్థాయి అధికారులతో ప్రాంతీయ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఔసాఫ్ సయీద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర రాష్ట్ర అధికారులతో సమావేశమై పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్, విదేశీ వీసాలు తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం భారత ప్రధాన పాస్‌పోర్టు అధికారి ఆమ్‌స్ట్రాంగ్ చాంగ్సన్, సంయుక్త కార్యదర్శి(ఓఈ) బ్రహ్మ కుమార్, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విదేశాలకు వెళ్లి పనులు చేసేందుకు ఆసక్తి చూపే యువత, మహిళలకు తగిన శిక్షణ ఇచ్చి పంపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 12 దేశాలతో ఇప్పటికే మ్యాన్ పవర్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. మరో 15 దేశాలతో సంప్రదింపులు సాగుతున్నా యన్నారు. ప్రతి శనివారం విదేశాలకు వెళ్లే వారికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణలో పాస్‌పోర్టులు వేగవంతం
తెలంగాణలో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని సయీద్ తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక పోస్టా్టఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రంగా పనిచేస్తుందన్నారు. మరో ఐదు నెలల్లో దేశంలో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టు (ఈ పాస్‌పోర్టు)ల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అమ్‌స్ట్రాంగ్ చాంగ్సన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment