‘విలీనం’పై నిరసన
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని 134 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీలతో పాటు, వివిధ రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముంపు గ్రామాల విలీన నిర్ణయాన్ని నిరసిస్తూ భద్రాచలంలో వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఆయా పార్టీల జెండాలను, కేంద్రమంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీని దహనం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్యర్యంలో శనివారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం డివిజన్‌లోని గిరిజన గ్రామాలను విడదీసే హక్కు ఎవరిచ్చారని గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సోందె వీరయ్య ప్రశ్నించారు. ఈనెల 10న అఖిలపక్షం నాయకులు భద్రాచలం డివిజన్ బంద్‌కు పిలుపునిచ్చారు.