ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు... కొమరం భీంలా పోరాడదాం
వేలేరుపాడు, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆదివాసీలంతా కొమరం భీం మాదిరిగా పోరాడాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వేలేరుపాడు మండలంలోని మారుమూలనున్న కొయిదాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఇక్కడ ఏర్పాటైన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆంధ్రాలోని బడా పారిశ్రామికవేత్తల స్వప్రయోజనాల కోసం ఇక్కడి ఆదివాసీలను ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. విలీనంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకపోవడం వెనుక ఏపీ పెద్దల కుట్ర ఉందన్నారు. ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2వ తేదీన ముంపు మండలాల్లో బ్లాక్ డే జరపనున్నట్టు చెప్పారు.
20 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర
కొయిదాలో శనివారం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి 20 కిలోమీటర్ల దూరంలోగల కన్నాయిగుట్టకు చేరింది. ఈ పాదయాత్రకు గిరిజన గ్రామాల్లో విశేష స్పందన లభించింది. మేడేపల్లి నుంచి మరో బృందం ప్రారంభించిన పాదయాత్ర మల్లారం వరకు సాగింది. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ఎస్‌కె.గౌస్, గోకినేపల్లి వెంకటేశ్వరావు, సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఎండి.మునీర్, వైఎస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస గౌడ్, వివిధ పార్టీల నాయకులు కారం దారయ్య, అమరవరపు అశోక్, ఎస్‌కె.నజీర్, వలపర్ల రాములు, గిల్లా వెంకటేశ్వర్లు, పూరెం లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.