caved zones
-
ముంపు ఉద్యోగులకు.. ఆంధ్ర నుంచే వేతనాలు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు ముంపు మండలాల్లో పరిపాలన వేగవంతంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే, ముంపు ఉద్యోగులకు వేతనాలను చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, నెల్లిపాక మండలాల అధికారులకు తూర్పుగోదావరి కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏడు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకుగాను వారి సమగ్ర వివరాలను పంపించాలని పేర్కొన్నారు. 20వ తేదీన కలెక్టరేట్ నుంచి జారీ అరుున ఈ ఉత్తర్వుల్లో.. వివరాలను 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాలని పేర్కొనడం గమనార్హం. ఇది, ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ లెక్కన నవంబర్ వేతనాలను కూడా ఏపీ నుంచే వచ్చే అవకాశముందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగుల వివరాలకు సంబంధించి పది అంశాలను పొందుపరిచారు. విలీన మండలాల్లోని ఉద్యోగులంతా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం నుంచే వేతనాలు పొందారు. ఉద్యోగుల పంపకాలు జరిగితే 80 శాతం వరకు ఉద్యోగులు వెనుక్కి (తెలంగాణకు) వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లోని ఉద్యోగుల నుంచి ఖమ్మం కలెక్టర్ ఇటీవల ఆప్షన్లు తీసుకున్నారు. 1585 మంది తెలంగాణలో, 588 మంది ఆంధ్రాలో ఉంటామని చెప్పారు. తాజాగా, ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చిన వారు మాత్రం అక్కడి వేతనాలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకసారి వేతనాలు తీసుకుంటే సర్వీసుపరంగా అనేక ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ఏపీలో వేతనాలు తీసుకుంటామని అంగీకరించిన ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంటు వదులుకోవాల్సిందే. ఈ తాము కోరుకున్న రాష్ట్రానికి బదిలీ చేసప్తే ఎలాంటి గందరగోళం ఉండదని ఏడు మండలాల్లోని ఉద్యోగులు అంటున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తూగో కలెక్టర్ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు డీడీవో వివరాలు, ఏరియా, డీడీవో పేరు.. అడ్రస్. కొత్తగా డీడీవో కోడ్ కేటాయించే క్రమంలో కలెక్టర్ ధృవీకరణ కోసం తగిన వివరాలు. డీడీవోల పరిధిలోని ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్, శాంక్షన్ పోస్టులు, వర్కింగ్, ఖాళీల వివరాలు. ఇందులో గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, క్లాస్ ఫోర్, సీపీఎస్ హోల్డర్ వివరాలు. ఉద్యోగుల వేతన వివరాలు. ఉద్యోగుల ఐడీ, గ్రాస్, డిడక్షన్, నెట్, జీపీఎఫ్ అకౌంట్ నంబర్, ఏపీజీఎల్‌ఐసీ నంబర్, సీపీఎస్ అంకౌంట్ నంబర్, రుణ సదుపాయాలు పొందినట్టరుుతే వాటి వివరాలు. ఉద్యోగులు ఏ బ్యాంకు నుంచి వేతనాలు పొందుతున్నారు? బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్. డీడీవోలంతా తమ కరెంట్ అకౌంట్‌ను రంపచోడవరంలోని ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకోవాలి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డీడీవోవారీగా ఇవ్వాల్సుంటుంది. ఏపీలో విలీనమైన మండలాల్లో పనిచేస్తూ ఆంధ్ర నుంచి వేతనాలను తీసుకొనేందుకు ఇష్టపడని వారి ఉద్యోగుల వివరాలను డీడీవో ధృవీకరించి పంపాలి. వేతనాల బిల్లులను హెచ్ఆర్ఎమ్ఎస్ విధానంలోనే ఇవ్వాలి. అన్ని రకాల చెల్లింపులు ఈ-పేమెంట్స్ ద్వారానే జరగాలి. -
‘ముంపు’ పాలనకు కార్యాచరణ
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాలపై పూర్తిస్థాయిలో పాలన సాగించేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరిలో కలిపిన నెల్లిపాక (భద్రాచలం రూరల్), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో గురువారం ఆ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి తగిన నివేదికలతో రావాల్సిందిగా నాలుగు మండలాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవమున్న నీతూప్రసాద్‌కు ఈ ప్రాంత సమస్యలు, గిరిజనుల ఇబ్బందులపై అవగాహన ఉంది. అక్టోబర్ 2 నుంచి ముంపు మండలాల్లో పూర్తి స్థాయిలో పాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాల అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పర్యటించారు. అధికారులు లేకుండా పాలన ఎలా..?! తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పాలనాపరంగా ఇబ్బంది లేకన్నా, నెల్లిపాక మండలంపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగతా మండలమంతా బదలాయించి, దీనికి నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించారు. కానీ, ఇంతవరకూ అక్కడ కార్యాలయాలు తెరవలేదు. మండల అధికారులు కూడా లేరు. భద్రాచలం పట్టణంలోని మండల అధికారులంతా నెల్లిపాక మండలంతో తమకు సంబంధం లేదని, తాము తెలంగాణ రాష్ట్రం పరిధికి చెందినవారమని చెబుతున్నారు. కూనవరం మండలంలో ఉన్న అధికారులకు నెల్లిపాకను కూడా పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించేందుకు తూ.గో. అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు ఇన్చార్జిలను అప్పగిస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. దీనిపై కలెక్టర్ నీతూ ప్రసాద్ దృష్టి సారించాల్సుంది. ముంపులో నిలిచిన అభివృద్ధి ముంపు మండలాల్లో అభివృద్ధి పనులను ఉన్నఫలంగా అప్పగించేందుకు ఖమ్మం జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మండలాల్లో కొత్తగా పనులు చేసేందుకు ప్రతిపాదనలు కూడా చేయలేదు. చివరకు ఎల్‌డబ్ల్యూఈఏ పథకంక్రింద వివిధ కారణాలతో చేయలేకపోయిన పనులను రద్దు చేసిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు.. వాటిని ముంపు మండలాల్లో కాకుండా జిల్లాలోని ఇతర మండలాలకు కేటాయించారు. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన నాలుగు మండలాల్లో అభివృద్ధి నిలిపోయింది. సమస్యలపై దృష్టి సారించకపోతే కష్టమే భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాలకు చెందిన 277 రెవెన్యూ గ్రామాలు తూర్పుగోదావరి జిల్లాలో కలిసాయి. ఇందులో 38,096 ఇండ్లు వీటిలో 1,31,528 మంది జనాభా ఉంది. 1,99,825.60 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని భూభాగం తూ.గో. జిల్లాలో కలుస్తుంది. నాలుగు మండలాల్లో అత్యధికంగా గిరిజనులే ఉన్నారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో అత్యంత వెనుకబడిన గిరిజన తెగకు చెందిన కొండరెడ్లు గుట్టలపై, కొండలపై నివసిస్తున్నారు. వీరికి సరైన పౌష్టికాహారం అందటం లేదు. వైద్య సేవలు కూడా అంతంత మాత్రమే. ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో పలువురు గర్భిణీలు ఇంకా ఇండ్ల వద్దనే ప్రసవాలు జరుగుతున్నాయి. గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేవు. వీటి పరిష్కరించేలా అధికార యంత్రాంగానికి కలెక్టర్ దిశానిర్దేశం చేయాల్సిన అవసరముంది. ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలేవీ... ముంపు మండలాల్లోని దాదాపు 80శాతం మంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు. వారంతా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మరికొన్ని నెలలపాటు ఎక్కడి వారక్కడనే పనిచేయాలనే సంకేతాలు వస్తున్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లా అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు సాధ్యం కాదనేది వాస్తవం. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. -
ముంపు రైతుకు ముప్పేనా?
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన ముంపు రైతులకు ఏపీ ప్రభుత్వమే పంట నష్టపరిహారం ఇస్తుందని స్పష్టత వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులు చేస్తున్న సర్వేను ఏపీ ప్రభుత్వం ఏ మేరకు ప్రాతిపదికగా తీసుకుంటుందన్న దానిపై రైతుల్లో కొంత అనుమానం నెలకొంది. ముంపు మండలాల విలీనంపై ఫైనల్ గెజిట్ ఇచ్చినా..పాలనా వ్యవహారాలపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు పెద్దగా దృష్టి సారించలేదు. వరద నష్టంపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నా వీరిపై తగిన అజమాయిషీ చేసే అధికారులు లేకపోవటంతో ముంపు మండలాల్లో ఇది అస్తవ్యస్తంగా సాగుతోంది. రేపోమాపో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనాలపై కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు బాహటంగానే అంటున్నారు. పంటలు నష్టపోయిన తమకు తగిన పరిహారం అందుతుందో లేదోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 14 మండలాల్లో 8,967 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లుగా జిల్లా అధికారులు లెక్క తేల్చారు. ఇందులో భద్రాచలం డివిజన్లోని భద్రాచలం రూరల్, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, పాల్వంచ డివిజన్ బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఏపీలో విలీనం అయ్యాయి. ఏపీలో విలీనం అయిన ఏడు మండలాల్లో 5,308 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి నష్ట పరిహారం ఏపీ అధికారులే ఇవ్వాల్సి ఉంటుంది. పంట నష్టం ఎంత చెల్లించాలనే దానిపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గతే డాది నష్ట పరిహారం ఇచ్చేదెవరు? గతేడాది గోదావరి వరదలతో ఇప్పటికంటే ఎక్కువే పంట నష్టం జరిగింది. కానీ నష్టపోయిన రైతులు, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇప్పటి వరకు నయాపైసా సాయం అందలేదు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఏడు మండలాల్లోని బాధిత రైతులకు గతేడాది నష్ట పరిహారం ఎవరు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చాయి. ఇప్పటికే తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. కానీ జిల్లాలో రుణం ఆ ఏడు మండలాలకు చెందిన రైతులు, ప్రస్తుతం ఏపీలోకి వెళ్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ముంపు రైతులకు ఎటువంటి భరోసా రాలేదు. పోలవరం ముంపు భూములకు పరిహారం లేనట్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పునరావాస ప్యాకేజీ చెల్లించిన భూముల్లోని పంటలకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమని ఏపీ విలీనమైన ఏడు మండలాల్లో 74,751.96 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే 45,756.90 ఎకరాలుకు పునరావాస ప్యాకేజీ పంపిణీ చేశారు. కానీ ఈ భూముల్లోని పంటలకే ఎక్కువ నష్టం జరిగింది. పునరావాస ప్యాకేజీ తీసుకున్నా ఇంకా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవటంతో వేలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి రైతులు పంటలు సాగుచేస్తున్నారు. కానీ ఈ భూములకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. -
ఉపాధి సిబ్బంది తెలం‘గానం’
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లా నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు ముంపు మండలాల్లోని మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హమీ పథకం సిబ్బందిలో ఎక్కువమంది తెలంగాణలో పనిచేసేందుకే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో పనిచేసేందుకు 56 మంది ఆప్షన్ ఎంచుకోగా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందిని ఆప్షన్లు ఎంచుకోవాల్సిందిగా రెండునెలల క్రితం ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వారు ఎంచుకున్నారు. కూనవరం మండలంలో మొత్తం తొమ్మిది మంది ఉపాధి సిబ్బంది పనిచే స్తుండగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ మినహా మిగిలిన ఎనిమిది మంది ఆంధ్రాలో పనిచేసేందుకు సముఖత వ్యక్తం చేశారు. జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న మొత్తం 64 మందిలో 56 మంది తెలంగాణలో పనిచేసేందుకు మొగ్గు చూపగా, ఎనిమిది మంది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. తెలంగాణలో పనిచేసేందుకు ఆప్షన్లను ఎంచుకున్న వారిలో ఆరుగురు ఏపీవోలు, ఆరుగురు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, 24 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు కూనవరం మండలంలోని ఒక ఏపీవో, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు నలుగురు ఉన్నారు. {పస్తుతం ఉపాధి హామీ సిబ్బంది అందరూ ఆయా ముంపు మండలాల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేంత వరకు అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఆప్షన్ పెట్టుకున్న సిబ్బంది ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే వారు కలెక్టరేట్లో రిపోర్టు చేస్తే పోస్టింగ్ ఇస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఆప్షన్ ఎంచుకున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేందుకు ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యూవ ల్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ పని చేసేందుకు సుముఖంగా ఉన్న వారిని మళ్లీ వి ధుల్లోకి తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే వారిని ఇతర మండలాల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. ముంపు మండలాల్లో జరిగిన ఉపాధిహామీ పథకం పనుల్లో అనేక అవతవకలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు మొత్తం ఏడు విడతల్లో సోషల్ ఆడిట్ నిర్వహించారు. సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేస్తున్నారు. ఇంకా రూ.2.50లక్షల వరకు రికవరీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రికవరీలను కూడా ఏపీకి బదిలీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో ఇక నుంచి రికవరీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టనుంది. -
త్రిశంకు స్వర్గం !
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. వారి నుంచి తీసుకున్న ఆప్షన్ల మేరకు బదిలీపై తెలంగాణకు వద్దామని భావించినప్పటికీ, ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపకాలు పూర్తయిన తర్వాతే ముంపు ఉద్యోగుల బదిలీలు ఉంటాయని ఉన్నతాధికారులు తేల్చిచెప్పటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఏపీలో విలీనమైన భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రాచలం కేంద్రంగా ఉన్న ఎస్టీవో కార్యాలయం నుంచి వేతనాలు అందుతున్నాయి. ఈ నాలుగు మండలాల్లో 109 డీడీవోల ద్వారా 2,280 మంది ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారు. ఇక కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లోని ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో 29 డీడీవోల ద్వారా 447 మంది ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారు. వీరితో పాటు ఏడు మండలాల్లో 291 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ఈ నెల 15వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి వేతనాలు అందనున్నట్లు తెలిసింది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే దానిపై ఇప్పటికే ఆప్షన్ లు తీసుకున్నారు. వీరిలో దాదాపు 80శాతం మంది తెలంగాణకు వచ్చేం దుకే ఇష్టపడుతున్నా రు. ముంపులో ఉన్న వారికి ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని ఉన్నత స్థాయి అధికారులు హామీ ఇవ్వడంతో త్వరలోనే వెనక్కు వస్తామని భావించిన ఉద్యోగులకు ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడు మండలాల విలీనంపై ఈనెల 15న ఫైనల్ గెజిట్ జారీ కావటంతో అప్పటి వరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతనాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ట్రెజరీ కార్యాలయాలకు కూడా ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవటం తో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ముంపులో పనిచేయాల్సిందేనా..? ముంపు మండలాల్లోని ఉద్యోగులంతా ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయాల్సిందేనని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అక్టోబర్ 2 నుంచి ఏపీలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభమవుతుండగా, దీనిని ముంపు మండలాల్లో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ముంపు మండలాల అధికారులు కూడా హాజరయ్యారు. దీంతో మరికొన్ని నెలల పాటు ఎక్కడి వారక్కడే పనిచేయాల్సి వస్తందేమోననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తాము.. తాజా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం కింద పనిచేయాల్సి రావటంతో, ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్ర కేడర్‌లో ఉన్న ఉద్యోగుల మాట ఎలా ఉన్నా...తమ నియామకమే తెలంగాణలో అయినప్పడు, ఇటువంటి పరిస్థితులు దాపురించడం దురుదృష్టకరమని ఓ ఉపాధ్యాయ సంఘం నేత ‘సాక్షి’ వద్ద వాపోయారు. కమలనాథన్ కరుణ కోసం ఎదురుచూపు... ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 80 శాతానికి పైగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకే సుముఖత వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో 348 మంది తెలంగాణకు వస్తామంటే, 214 మంది ఆంధ్రకు వెళ్తామని ఆప్షన్ ఇచ్చారు. మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్లో 528 తెలంగాణకు, 208 మంది ఆంధ్రకు, ఐకేపీలో 61 మంది తెలంగాణకు, 16 మంది ఆంధ్రకు, వైద్య ఆరోగ్యశాఖలో 246 మంది తెలంగాణకు, 54 మంది ఆంధ్రకు, అటవీశాఖలో 168 తెలంగాణకు, 27 మంది ఆంధ్రకు ఆప్షన్ ఇచ్చారు. మిగతా శాఖల్లో కూడా ఎక్కువ మంది తెలంగాణకు వ చ్చేందుకే మొగ్గు చూపారు. అయితే ఇప్పటికిప్పుడు వేల సంఖ్యలో ఉద్యోగుల సర్దుబాటు ఇరు రాష్ట్రాలకు సమస్యగానే పరిణమించటంతోనే పంపకాల ప్రక్రియను రెండు ప్రభుత్వాలు ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలనాథన్ కమిటీ మానవీయ కోణంలో పరిశీలించి తమ ఆప్షన్లపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. భద్రాచలంలో ఏపీ టెలీ కాన్ఫరెన్స్... అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు శనివారం మండల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ముంపు మండలాల అధికారులు కూడా హాజరుకావాలని ఆదేశించారు. అయితే ముంపు మండలాల అధికారులు భద్రాచలం(తెలంగాణ)లోని ఆర్డీవో కార్యాలయంలోనే దీనికి సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉండడంతో ఇక్కడి నుంచే పాల్గొన్నారు. -
విలీనం సంపూర్ణం
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల విలీన ప్రక్రియ పూర్తయింది. పాల్వంచ డివిజన్లోని వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాల విలీనానికి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఫైనల్ గెజిట్ జారీ చేశారు. కాగా భద్రాచలం డివిజన్లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాల స్వాధీనంపై తూ.గో. కలెక్టర్ నీతూప్రసాద్ గెజిట్ జారీ చేశారు. ఈ నెల 15న జారీ చేసిన గెజిట్ ప్రతులను విలీన మండలాల తహశీల్దార్లకు బుధవారం స్వయంగా అందజేశారు. దీంతో ఇక రికార్డుల అప్పగింతల ప్రక్రియ మినహా ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలు ఇక నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోకి సంపూర్ణంగా విలీనమైనట్లే. ఇదిలా ఉండగా విలీన మండలాల్ల్లో పాలనా వ్యవహారాలు తీసుకునేందుకు ఆయా జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు పర్యటనలకు సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు గురువారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పర్యటనకు వస్తున్నారు. ఆయా మండలాల్లో పర్యటించి, స్థానిక అధికారులు, ప్రజలతో మాట్లాడుతారు. కాగా, తూ.గో. జిల్లాకు చెందిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా గురువారం చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం రూరల్ మండలాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టు ప్రభావిత మండలాలు కావటంతో పోలీస్ అధికారుల పర్యటన వివరాలను చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. కాకినాడ సమీక్షకు వెళ్లిన తహశీల్దార్లు... తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన భద్రాచలం డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం తహశీల్దార్లు బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమీక్షకు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముంపు మండలాల సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. తూ.గో. జిల్లాలో కలిసినందుకు ఇక్కడి ప్రజలు ఎలా భావిస్తున్నారు.. మండలాల్లో చేపట్టాల్సిన ప్రాధాన్యత గల పనులు ఏమిటి.. అని ఆ జిల్లా అధికారులు తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కాగా మరో రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ముంపు మండలాల పర్యటనకు వస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా వారికి సూచించినట్లు తెలిసింది. రికార్డుల అప్పగింతకు ఆదేశం... ముంపు మండలాల్లో రెవెన్యూ రికార్డుల అప్పగింతకు సిద్ధం కావాలని తహశీల్దార్లకు తూ.గో. జిల్లా అధికారులు సూచించారు. అడంగల్, పహణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప రికార్డులను అప్పగించలేమని ముంపు మండలాల అధికారులు చెపుతున్నారు. -
అభివృద్ధికి బ్రేక్
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన మండలాల్లో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్ కార్యాలయాల నుంచి ఇప్పటికే ప్రాథమిక గెజిట్ రావటంతో అప్పగింతల కోసం ఇక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడో, రేపో ఫైనల్ గెజిట్ కూడా వస్తే విలీన మండలాలపై మన జిల్లా యంత్రాంగం అజమాయిషీ వదులుకోవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి లేఖ రావటమే తరువాయి.. ముంపు మండలాలను ఏపీకి అప్పగించేందుకు జిల్లా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రభావం ముంపు మండలాల్లో అభివృద్ధి పనులపై పడింది. కొత్తగా పనులు చేపట్టే పరిస్థితి లేకపోగా, ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన నిధులతో జరుగుతున్న పనులు సైతం నిలిచిపోయాయి. ఇప్పటికే పూర్తయిన వాటికి మాత్రం బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఐటీడీఏ, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో రహదారులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల పేరిటి వివిధ రకాల పనులు జరుగుతున్నాయి ఈ నెలాఖరు నాటికి ముంపు పనుల లెక్క తేల్చాలని వచ్చిన మౌఖిక ఆదేశాలతో ఆయా ఇంజనీరింగ్ శాఖల అధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు ఉన్నప్పటికీ, బిల్లుల మంజూరుకు ఎక్కడ ఇబ్బంది అవుతుందేమోనని ఆందోళనతో ఉన్న కాంట్రాక్టర్లు.. ఇప్పటివరకు చేపట్టిన పనులకు ఒక రూపాన్ని తీసుకొచ్చేందుకే ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంపు మండలాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద ఎంపికై న ఖమ్మం జిల్లాలో రెండో దఫా నిధుల మంజూరుకు ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు చేసినప్పటికీ, ముంపు మండలాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఆయా మండలాల్లో ఐఏపీ కింద మిగిలిపోయిన నిధులతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసింది. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి నుంచి అటవీప్రాంతం మీదగా చింతూరు మండలం దొంగల జగ్గారం వరకు, చింతూరు మండలం బొడ్డుగూడెం నుంచి బొడ్డుగూడెం కాలనీ వరకు రహదారుల నిర్మాణానికి 2012-13 సంవత్సర నిధుల నుంచి రూ.2.76 కోట్లు కేటాయించారు. ఈ పనులు వివిధ కారణాలతో ఆగిపోగా, ప్రస్తుతం వీటిని రద్దు చేశారు. అయితే మావోయిస్టుల హెచ్చరికలు, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం వంటి కారణాలతోనే ఆ ప్రాంతంలో రహదారులను పూర్తి చేయలేకపోయామని జిల్లా అధికారులు చెపుతున్నారు. ఇక ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో తిరిగి అక్కడ పనులు చేపట్టే పరిస్థితి లేదు. దీంతో ఈ నిధులను వెనక్కు తీసుకొచ్చి వేరే ప్రాంతంలో వినియోగిస్తున్నారని సమాచారం. కాగా, ఏపీలో విలీనమైన మండలాల్లో కొత్తగా అభివృద్ధి పనులను ఆ ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ‘ముంపు’లో పాలనకు సిద్ధమవుతున్న అధికారులు... ఫైనల్ గెజిట్ విడుదలతో విలీన మండలాల్లో పాలనా పగ్గాలు చేపట్టేందుకు ఉభయ గోదావరి జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ముంపు మండలాల్లోని తహశీల్దార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థానికులే కాగా, మిగతా కీలక శాఖల్లో కూడా ఏపీకి చెందిన అధికారులనే నియమించేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల బదిలీలు ఈ నెలాఖరు వరకూ జరుగనుండటంతో, ముంపు ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అక్కడి అధికారులు యోచిస్తున్నారు. ముంపులో ఉన్న ఉద్యోగులు ఎటువైపు ఉంటారనే దానిపై ఖమ్మం జిల్లా అధికారులు ఇప్పటికే వారి నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఉద్యోగుల పంపకాల ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి పూర్తి కావచ్చు. ఈలోగానే ముంపు మండలాల్లోని పోలీసులను వెనక్కు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల్లిపాక కాదు.. ఎటపాక ఏపీలో విలీనమైన భద్రాచలం రూరల్‌లోని గ్రామాలకు ఎటపాక మండల కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించేందుకు తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లిపాక మండల కేంద్రమని తొలుత ప్రకటించినప్పటికీ, అక్కడ మండల స్థాయి కార్యాలయాల నిర్వహణకు తగినన్ని భవనాలు అందుబాటులో లేవని, ఎటపాక అయితే ఇందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వచ్చిన అధికారులు ఎటపాకలో ఉన్న భవనాలను పరిశీలించి వీడియో, ఫొటోలు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌ను కూడా ఎటపాక ప్రతిభా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగానే రెండు రోజుల క్రితం తూ.గో. జిల్లా పోలీసు శాఖ అధికారులు భవనాలు చూసి వెళ్లారు. నెల్లిపాక పేరుతోనే తాత్కాలికంగా ఎటపాకలో మండల కార్యాలయాలను నెలకొల్పి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నాయని ర ంపచోడవరంనకు చెందిన ఓ డివిజన్ స్థాయి అధికారి సాక్షికి తెలిపారు. ఎటపాకకు చెందిన కొంతమంది ఇటీవల ఏపీకి చెందిన మంత్రులను కలిసి మండల కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేయాలని విన్నవించటంతో పాటు, ఎటపాక సమీపంలో ఉన్న భవనాల ఫొటోలు, వీడియోలను వారికి చూపించారు. అధునాతన భవనాలు అందుబాటులో ఉండటంతో ఎటపాకలోనే మండల కార్యాలయాలను ప్రారంభించాలని తూ.గో. జిల్లా అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. అయితే ఎటపాకతో పాటు ఈ దారిలో ఉన్న నాలుగు పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలని ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. -
ముగిసిన ‘ముంపు’ కథ !
భద్రాచలం : ముంపు మండలాల కథ ము గిసింది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు. వేలేరుపాడు, బూర్గం పాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలను ఏపీలో విలీనం చేసుకునే చివరి అంకం కూడా పూర్తయింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనల్ గెజిట్ జారీ చేసింది. దీంతో ఆ మండలాలపై ఇక నుంచి ఆ ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమించనున్నాయి. భద్రాచలం డివిజన్లోని భద్రాచలం, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో గల 277 గ్రామాలను తూర్పు గోదావరి జిల్లాలో కలుపుతూ రంపచోడవం రెవెన్యూ డివిజన్ కింద చేర్చారు. బూర్గంపాడు మండలంలోని 6, కుక్కునూరు మండలంలోని 20, వేలేరుపాడులోని 21 .. మొత్తం 47 రెవెన్యూ గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేసి, వీటిని జంగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చారు. ఇక నుంచి ఆ మండలాలపై ఆయా రెవె న్యూ డివిజన్ పరిధి నుంచే పర్యవేక్షణ సాగనుంది. గోదావరి వరదలతో సంభవించిన నష్టం పై కూడా అంచనాల నివేదికలను ముంపు మండలాల అధికారులు ఏపీ ప్రభుత్వానికే పంపించాల్సి ఉంటుంది. వరద సాయం కూడా ఆయా రెవెన్యూ డివిజన్ల నుంచే విడుదల కానుంది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీనిలో భాగంగానే రంప చోడవరం ఆర్డీవో గురువారం చింతూరు కేంద్రంగా భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాల అధికారులతో వరద నష్టంపై సమీక్షించారు. ముంపు ముండలాలను విలీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ మేరకు అభిప్రాయ సేకరణ కోసం సెప్టెంబర్ 1న ప్రత్యేక గెజిట్ జారీ చేశారు. దీని ప్రకారం 30 రోజుల్లోగా పలువురు తమ అభిప్రాయాలను చెప్పారు. వీటిని ప్రామాణికంగా తీసుకోవటంతో పాటు, రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఫైనల్ గెజిట్ జారీ చేసింది. దీంతో ముంపు మండలాల్లో అన్ని రకాల సేవలు ఏపీ ప్రభుత్వం నుంచే అందనున్నాయి. నేడో, రేపో ఖమ్మం జిల్లా అధికారుల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరు నాటికి ఉద్యోగుల పంపకాలు... ముంపు మండలాలపై ఫైనల్ గెజిట్ విడుదలైన నేపథ్యంలో పాలనపై పట్టు సాధించే క్రమంలో ఉద్యోగుల సర్దుబాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముంపులో ఉన్న ప్రత్యే క వెసులుబాటు మేరకు ఈ నెలాఖరు నాటికి ఉద్యోగుల పంపకాలను పూర్తి చేయనున్నట్లు సమాచారం. ముంపులో పనిచేసే ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాలను ఏపీ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుం దని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈ లోగానే ఆ రాష్ట్రానికి ఆప్షన్లు ఇచ్చిన వారిని తీసుకొని పాలన సాగించుకోవాలని, తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిని వెంటనే అక్కడ నుంచి పంపించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన స్పష్టత ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు కోరుతున్నారు. -
ఇంకా ముంపులోనే
భద్రాచలం : ఉగ్ర గోదారి శాంతించింది. 56 అడుగులు దాటి ప్రవహించటంతో తీవ్ర భయాందోళనకు గురైన పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి 49.7 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే ఏజెన్సీలోని పలు గ్రామాలు మాత్రం ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 25 గ్రామాలకు చెందిన 623 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా 31 చోట్ల రహదారులు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో వందలాది గ్రామాలకు మంగళవారం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో చీకుపల్లి అవతల ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గినా, దిగువన ఉన్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాపై తీవ్ర ప్రభావం చూపింది. వీఆర్ పురం మండలం శ్రీరామగిరి, వడ్డిగూడెం, కూనవరం మండలంలోని ఉదయ భాస్కర్ కాలనీలకు వరద నీరు చేరింది. దీంతో ఆయా గ్రామాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చింతూరు నుంచి వీఆర్‌పురం వెళ్లే దారిలో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం డివిజన్లో ఏడు మండలాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు ప్రకటించారు. డివిజన్లోని 9 గ్రామాలకు వరద నీరు చుట్టుముట్టగా, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. పాల్వంచ డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన 16 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టగా రెండు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించారు. భద్రాచలాన్ని వీడని వరద... భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికీ పట్టణంలోని అశోక్ నగర్ కొత్తకాలనీని వరద వీడలేదు. వరద తగ్గిన తరువాత ఇక్కడ ఇంకా ఎక్కువగా నీరు చేరటం గమనార్హం. సమీపాన ఉన్న అయ్యప్ప కాలనీలోని ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరింది. స్లూయీస్‌ల నుంచి వరద నీరు కాలనీలోకి వస్తుండగా, దానిని ఆ స్థాయిలో బయటకు తరలించకపోవటంతోనే సమస్య జఠిలంగా మారింది. ఈ విషయంలో అధికారుల వైఖరిపై కలెక్టర్ ఇలంబరితి కూడా సీరియస్‌గానే ఉన్నారు. పంట నష్టం అంచనాలకు సిద్ధం... వరద తగ్గుముఖం పడుతుండటంతో పంటలు ఏ మేరకు నష్టపోయాయో సర్వే చేపట్టాలని కలెక్టర్ ఇలంబరితి ఆదేశించిన నేపథ్యంలో ఇందుకు వ్యవసాయశాఖాధికారులు సిద్ధమయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం 25 వేల ఎకరాలకు పైగానే పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే వరద పూర్తిగా తొలగితే తప్ప వాస్తవ నష్టాన్ని లెక్క కట్టవచ్చని ఓ వ్యవసాయశాఖాధికారి తెలిపారు. సహాయక చర్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి... వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సోమవారం అంతా భద్రాచలంలోనే ఉన్న కలెక్టర్ మంగళవారం కూడా వచ్చి అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నటు ్ల‘సాక్షి’తో చెప్పారు. ఏపీకి బదలాయించిన ముంపు మండలాల్లోనూ తామే సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు కోతకు గురైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. -
ముంపులో ఆప్షన్లు షురూ..!
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ముంపు మండలాల ఉద్యోగుల పంపకాలకు సర్వం సిద్ధమైంది. ముంపులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట కల్పించేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారానికి రావడంతో పంపకాల ప్రక్రియను వేగవంతం చేశారు. ముంపులో పని చేస్తున్న అన్ని శాఖల ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మూడు రోజులుగా ఈ వ్యవహారం శరవేగంగా జరుగుతుండగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి మరో కబురు వచ్చింది. ముంపులో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వివరాలతో పాటు, వారికి సంబంధించిన సర్వీసు రిజిస్టర్ల(ఎస్ఆర్) ఆధారంగా ఆయా శాఖల ఉన్నతాధికారుల ద్వారా సమగ్ర జాబితాను తమకు అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి సేకరించిన అంగీకార పత్రాలనే ఆప్షన్లుగా పరిగణించి వారికి నచ్చిన రాష్ట్రంలో పని చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసే క్రమంలోనే ఆగమేఘాల మీద ఇందుకు సంబంధించి జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల పాలన చేపట్టే క్రమంలోనే ముందుగా ఉద్యోగుల సర్ధుబాట్లుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ నెలలో ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం అంతకు ముందుగా, ముంపులో ఉండేందుకు ఇష్టపడే తెలంగాణ ఉద్యోగులను తీసుకునేందుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలోనే జాబితా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏడు మండలాలకు చెందిన మినిస్టీరియల్ సిబ్బందితో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారులు తగు నివేదికలతో రావాలని జిల్లా క లెక్టరేట్ నుంచి పిలుపు వచ్చింది. బుధవారం జరిగే సమీక్షకు ముంపు మండలాల ఎంఈఓలు రావాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారి నుంచి సమాచారం వచ్చింది. మండలాల వారీగా ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ఎంతమంది ప్రస్తుతం పనిచేసే చోటనే ఉండేందుకు అంగీకరించారు..? ఎంతమంది ప్రస్తుతం పనిచేసే చోట ఉండమని తెలిపార..? అనేది పూర్తి స్థాయిలో వివరాలు, వారికి సంబంధించిన జాబితాను తీసుకు రావాల్సిందిగా డీఈఓ నుంచి సమాచారం అందింది. ఈ విషయాన్ని ముంపు మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించారు. నెలాఖరు నాటికి బదిలీ ఉత్తర్వులు : ఈ నెలాఖరు నాటికి ముంపులో పనిచేస్తున్న అన్నిశాఖల ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముంపులో పనిచేసే వారందరికీ దాదాపు ఆప్షన్లు ఖాయంగా తెలుస్తోందని ఉద్యోగులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి సర్ధుబాట్లు చేసేంత వరకూ కొన్ని రోజులు అక్కడనే పనిచేసేలా కూడా ఒప్పందాలు జరిగే అవకాశం లేకపోలేదని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది ప్రస్తుతం ఉన్న చోటనే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేందుకు అంగీకారం తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల వరకూ పరిశీలించినట్లైతే మొత్తం ఏడు మండలాల్లో సుమారు 490 మంది ఉపాధ్యాయులు తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇవ్వగా, 210 మంది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. తుది జాబితా సిద్ధమయ్యే సమయానికి కొంత మంది ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉందని ఎంఈఓలు తెలిపారు. దాదాపు అన్ని శాఖల్లో కూడా 30 నుంచి 40 శాతం వరకు ప్రస్తుతం పనిచేసే చోటనే అంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేందుకు ఆప్షన్లు ఇస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముంపులో ఇక ఆంధ్ర సేవలు : ముంపు మండలాల్లో సెప్టెంబర్ 1 నుంచి దాదాపు అన్ని రకాల పౌర సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే అందనున్నాయి. సామాజిక పింఛన్లు, రేషన్ సరుకులు, ఇతర అన్ని వ్యవహారాలు ఏపీ ప్రభుత్వం చూడనుంది. వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా జరుగుతున్న పనులను కూడా నిలిపివేసి సెప్టెంబర్ 17న వాటికి సంబంధించిన జమా ఖర్చుల జాబితాను అందజేయాలని ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన బడ్జెట్ కేటాయింపులు కూడా ఆగస్టు నెల వరకే ఉన్నందున, సెప్టెంబర్ వేతనాలు, ఇతర ఖర్చులను ముంపులో ఏపీ ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే గత రెండు రోజుల క్రితం ఏపీ పోలీసు ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి సరిహద్దులను చూసి వెళ్లారు. మొత్తంగా చూస్తే ఈ నెలఖరునాటికి పంపకాల ప్రక్రియ ముగించేందుకే మన జిల్లా అధికారులు కూడా సిద్ధమయ్యారని, అందుకే ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. -
ముంపు మండలాలపై కొరవడిన స్పష్టత
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదలాయించిన ముంపు మండలాలు ప్రస్తుతం ఏ ప్రభుత్వం కింద ఉన్నాయనే దానిపై అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది. సోమవారం భద్రాచలంలో చోటుచేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనం. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారామ్‌నాయక్ చేసిన ప్రారంభోత్సవాలు ఏ ప్రభుత్వం కిందకు వస్తాయో అధికారులు సైతం చెప్పలే ని పరిస్థితి. ఉన్నతాధికారుల్లోనే ఈ సందిగ్ధత ఉంటే ముంపు ప్రాంతంలో ఉన్న సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. భద్రాచలం మండలం ఎటపాక వద్ద రూ.3.80 కోట్లతో యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎంపీ సీతారాంనాయక్ చేతులు మీదగా ప్రారంభించేందుకు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీవో డి. దివ్య తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ముందుగా అంతా కొబ్బరికాయలు కొట్టారు. ఆ తరువాత ఎంపీ సీతారామ్‌నాయక్ శిలాఫలాకానికి తెరతీసి ప్రారంభించారు. ప్రత్యేక హంగులు సంతరించుకున్న వైటీసీ సెంటర్‌పై అప్పటి వరకూ చర్చించుకున్న వారంతా, ఒక్క సారిగా శిలాఫలకంపై దృష్టి కేంద్రీకరించారు. వైటీసీ కేంద్రం ఏ ప్రభుత్వం పరిధిలోకి వస్తుందనేది ఆ శిలాఫలకంపై లేదు. కానీ దాన్ని నిశితంగా పరిశిలించిన వారికి ఒక గమ్మత్తై అంశం కనిపించింది. శిలాఫలకం పైన తెలంగాణ ప్రభుత్వం అని రాయించారు. కింద ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ పేర్లను రాశారు. కానీ పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం అనేది, కింద ఉన్న పీవో, జిల్లా కలెక్టర్ల పేర్లను కనిపించకుండా నల్లటిరంగుతో పూత వేశారు. ముంపుగా ప్రకటించిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ తీసుకొచ్చింది. ఇది జూన్ 2 నుంచే అమల్లోకి వచ్చింది. కానీ అధికారుల్లో దీనిపై ఇంకా అయోమయం ఉందనడానికి ఈ శిలాఫలకంపై పూసిన పూతలే నిదర్శనమని పలువురు చర్చించుకున్నారు. ఎందుకిలా చేశారని సందరు ఇంజనీరింగ్ అధికారులను సాక్షి ప్రశ్నిస్తే...ఎంపీ గారు ప్రారంభోత్సవానికి తొందర చేశారని సమాధానం ఇచ్చారు. భద్రాచలం జడ్పీటీసీ సభ్యుడైన జి. రవికుమార్ ఇంకా ప్రమాణం స్వీకారం చేయలేదు. ఎటపాక ఎంపీటీసీ పరిస్థితి కూడా అదే. కానీ శిలాఫలకంపై వీరిద్దరి పేర్లను రాయించటం కూడా చర్చనీయాంశంగా మారింది. 30లోపు ముగించేయండి సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభత్వమే పాలన వ్యవహారాలను చూస్తుందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. దీనిలో భాగంగానే అప్పగింతలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ముంపు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గ్రామసభలను నిర్వహించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం ఇక్కడి అధికారులకు మరో లేఖ అందింది. ఈ నెల 30వ తేదీలోపు ఈ తతంగాన్ని పూర్తి చేయాలని అందులో ఉంది. ఆ తరువాత ఫైనల్ గెజిట్ విడుదలవుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంటే సరిగ్గా ఐదు రోజుల్లో ఏడు మండలాలపై ఏపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో హక్కు సంక్రమిస్తుందన్న మాట. ఈలోగా చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు సర్వత్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారులు సైతం ప్రజానీకాన్ని గందరగోళానికి గురిచేస్తుండగం గమనార్హం. -
ముహూర్తం ఖరారు!
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాలను విలీనం చేసుకునే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ముంపు మండలాల్లో నిలిపివేయటమే కాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు కథ ముగిసినట్లేనని స్వ యంగా ప్రకటించటంతో దీనిపై స్పష్టత వచ్చినట్లయింది. ముంపు మండలాల్లో త మ పాలన సాగించేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ 2 నుంచి ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిం చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆం ధ్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉభయ గో దావరి జిల్లాల అధికారులు విలీన వ్యవహా రానికి సంబంధించిన ఒక్కో ప్రక్రియను వ రుసగా చేస్తున్నారు. ఇప్పటికే ముంపు మం డలాల్లో ఉభయ గోదావరి జిల్లా పరిషత్ అధికారుల ఆదేశానుసారమే మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. మద్యం దుకాణాలు కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ కిందనే నడుస్తున్నాయి. విలీన ప్రక్రియలో భాగంగా ముంపు మండలాల ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామసభలను నిర్వహించాలని ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లు గెజిట్ కూడా జారీ చేశారు. దీని ప్రకారం ఈ నెల 30 లోపు ప్రజాభిప్రాయాన్ని చెప్పా ల్సి ఉంటుంది. గ్రామసభలు జరుగకపోయినా పునర్విభజన చట్టం ప్రకారం పాలన పగ్గాలు చేపట్టే క్రమంలోనే గెజిట్ జారీ చేసి, వీటిని స్వాధీనం చేసుకునే దిశగా అక్కడి అధికారులు చకా చకా ఏర్పాట్లు చే సు కుపోతున్నారు. భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాల్లో 277 రెవెన్యూ గ్రామాలకు చెందిన 1,31,528 మంది జనాభా తూర్పుగోదావరి జిల్లాలో కలువనున్నారు. ఇక పాల్వంచ డివిజన్లోని బూ ర్గంపాడు మండలంలోని 6, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 41 రెవెన్యూ గ్రామాలకు చెందిన 58,776 మంది పశ్చిమ గోదావరి జిల్లాలో కలువనున్నారు. అక్టోబర్ 2 నుంచి పాలన.. ముంపు మండలాల్లో అక్టోబర్ 2 నుంచి పాలన చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వ చ్చిన నేపథ్యంలో ఈ లోగానే అప్పగింతల తంతు ముగించేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. భద్రాచలం డివిజన్లో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం( భద్రాచలం రెవెన్యూ గ్రామం తెలంగాణాలోనే ఉంటుంది), పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి ఉభయ గోదావరి జిల్లాల అధికారులే ఆయా మండలాల్లో పూర్తి స్థాయిలో పాలన వ్యవహారాలు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముంపులో ఖాళీలు అక్కడి వారితోనే భర్తీ.. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన మండలాల్లో ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగులతోనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ఓ డివిజన్ స్థాయి అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఉద్యోగులెవైరె నా ముంపు మండలాలకు వెళ్తామని కోరుకుంటే వారితోనే భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ముంపులో పనిచేసేందుకు ముందుకొచ్చే ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ముందుగా పోలీసు సిబ్బంది నియామకంపై ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఇక ముంపు మండలాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం పరిధిలోకే వస్తారు. అయితే 80 శాతం మంది వరకు తెలంగాణలోకే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆయా మండలాలకు చెందిన సుమారు 20 శాతం మంది ఉద్యోగులు ఆప్షన్లు తీసుకొని అక్కడే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల విభజన పూర్తిస్థాయిలో జరిగే వరకూ పాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న ఖాళీలనే ప్రాతిపదికగా తీసుకొని భర్తీ చేసేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిసింది. ముంపులో ఉంటారా... బయటకు వస్తారా..? ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి వారు కోరుకున్న రాష్ట్రంలో పనిచేసేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకునేందకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ఆంధ్రరాష్ట్రంలోకి వెళ్లిన ముంపులో పనిచేస్తారా..? తెలంగాణ రాష్ట్రానికి వస్తారా..? అనే అంశాలతో కూడిన ఒక నమూనాను రూపొందించి ముంపు మండల అధికారులకు పంపించారు. ఉద్యోగి కేడర్, వారి నెలసరి వేతనం, ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే దానిపై వారి అభిప్రాయం తెలుసుకునే క్రమంలోనే ఖమ్మం జిల్లా అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూస్తే సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ అప్పగింతల ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది. -
సర్వేకు సహకరించేనా..?
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన జిల్లాలోని ఏడు మండలాల్లో ఈ నెల 19న చేపట్టబోయే సామాజిక సర్వేపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముంపు మండలాల్లో పాలనా వ్యవహారాలు జిల్లా నుంచే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా సామాజిక సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. మరోవైపున ఈ మండలాలను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెలాఖరునాటికి ఆ మండలాలను విలీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమించింది. కానీ జిల్లా యంత్రాంగం మాత్రం ముంపు మండలాల్లో కూడా సామాజిక సర్వే చేపట్టాలని కార్యాచరణ ప్రకటించింది. ఈ మొత్తం పరిణామాలు ఇక్కడ పనిచేసే అధికారులను ఇరకాటంలో పడేస్తున్నాయి. ముంపు మండలాల్లోని ప్రజాప్రతినిధుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తుండటంతో సర్వేకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారు ఆలోచనలో పడ్డారు. ఏడు మండలాల్లో 324 రెవెన్యూ గ్రామాలు, వాటిలో నివసిస్తున్న 1,90,304 మంది జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించబడ్డారు. తాము మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల్లో నమోదు కావాల్సి ఉంటుందని, అలాంటప్పుడు తమ సమగ్ర సమాచారాన్ని సేకరించి ఏం ప్రయోజనమని కొంతమంది సర్పంచ్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాటిలోని అక్రమాలను అరికట్టేందుకు చేపడుతున్న ఈ సామాజిక సర్వేతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా అధికారులు చెపుతున్నారు. ఒక వేళ ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పటకీ, సర్వే నివేదికను వారికి అప్పగిస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. సర్వేపై భద్రాద్రిలో సర్పంచ్ల నిరసన... సామాజిక సర్వే సవ్యంగా సాగేలా సర్పంచ్‌లకు సోమవారం భద్రాచలం తహశీల్దార్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సర్వేకు సహకరించి ప్రజల సమగ్ర సమాచారం అందేలా చూడాలని తహశీల్దార్ రాజేంద్రకుమార్ సర్పంచ్‌లను కోరారు. ఈ దశలో కొంతమంది సర్పంచ్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ గ్రామాలను బదలాయించారని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సర్వేలని నిలదీశారు. గతంలో ఉన్న భూములను అవసరాల కోసం అమ్ముకున్నామని, కానీ ఏజెన్సీ చట్టాల ప్రకారం అవి తమ హ క్కుపత్రాల నుంచి మాత్రం వేరు కాలేదని, అలాంటప్పుడు తమ ఆస్తుల వివరాలను ఏ రీతిన నమోదు చేసుకోవాలని వెంకటరెడ్డిపేట ఉపసర్పంచ్ కృష్ణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తమలాంటి వారికి నష్టమే జరుగుతుందని, తీరా సర్వే జరిగిన తరువాత ఆంధ్రలోకి వెళ్లాల్సి వస్తుందని, ఈ లోగానే తమకు ఉన్న రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు రద్దయ్యే ప్రమాదం ఉందని మరికొందరు సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రంపచోడవం ఆర్డీవోను కలిసిన ముంపు సర్పంచ్‌లు.. చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలకు చెందిన 24 మంది సర్పంచ్‌లు సోమవారం రంపచోడవరం వెళ్లి ఆర్డీవోను కలిశారు. ఈ సందర్భంగా ముంపు మండలాల సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాల విభజన నేపథ్యంలో ముంపు మండలాల్లో గత కొంతకాలంగా ఎటువంటి అభివృద్ధి పనులు జరుగటం లేదని, వీటిని ఆంధ్రలో కలిపినందున ఇప్పటికైనా అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ముంపు మండలాలకు ప్రత్యేకాధికారి.. ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలను తమ అజమాయిషీ కిందనే సాగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జరిగిన ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముంపు మండలాల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా బదలాయించిన ఏడు మండలాలకు ఓ ప్రత్యేకాధికారిని నియమించేందుకు కేబినెట్లో ఆమోదించినట్లు సమాచారం. దీంతో ముంపు మండలాలను తమ పాలన కిందకు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. -
‘ముంపు’లో మాయ..!
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరవడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఇంజనీరింగ్ శాఖల పరిధిలో అయితే పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. భద్రాచలం ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతుండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. పనుల పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఓ కాంట్రాక్టర్ ఇక్కడి అధికారులు చేస్తున్న నిర్వాకంపై సమగ్ర సమాచారంతో ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ముంపులో మాయాజాలం వెలుగులోకి వచ్చింది. 2013 జనవరి నుంచి 2014 మే వరకు భద్రాచలం ఆర్అండ్బీ శాఖ పరిధిలో జరిగిన పనుల బాగోతంపై ఓ కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సదరు అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రధానంగా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు సదరు కాంట్రాక్టర్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయటంతో దీనిపై మిగతా కాంట్రాక్టర్లు తర్జన భర్జన పడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రస్తుతం భద్రాచలం ఆర్అండ్బీ డివిజన్ పరిధిలోని జరిగిన పనులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తరువాతే బిల్లులు చెల్లించాలని ఆర్అండ్బీ సీఈ పీఐవో అధికారులకు సూచించారు. దీంతో బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. ఫిర్యాదుల నేపథ్యంలో స్వయంగా ఆ శాఖ ఎస్ఈ చింతూరు సబ్ డివిజన్లోని పనులను పరిశీలించి వెళ్లారు. ఈ నిర్వాకంతో చేసిన పనులకు కూడా సకాలంలో బిల్లు రాని పరిస్థితి ఏర్పడిందని మిగతా కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు మండలాల్లో చేసిన పనులకు ఈ నెలాఖరు నాటికి బిల్లులు రాకపోతే అవి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతున్నందున ఇబ్బందులు తప్పవని పనులు సవ్యంగా చేసిన కొంతమంది కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. కాగా, విచారణ పూర్తి అయితే ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన ఇక్కడి ఉద్యోగుల్లో నెలకొంది. విజిలెన్స్ అధికారులు విచారణకు వస్తున్నారని తెలియటంతో అసంపూర్తిగా వదిలేసిన పనులను సదరు కాంట్రాక్టర్లు హడావిడిగా పూర్తి చేస్తున్నారు. అసలే నాణ్యత లేకుండా పనులు జరిగాయని ఆరోపణలు ఉండగా, ప్రస్తుతం క్వాలిటీ కంట్రోల్ అధికారుల కళ్లు గప్పేందుకు చేసిన పైపై పూతలు ఎన్ని రోజులు ఉంటాయో అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఇదే రీతిన కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు విచారణ తరువాత దిగువ శ్రేణి ఉద్యోగులకు అలవెన్స్‌లలో కొతపెట్టారు. కానీ ఈ సారి పనులు చేయకుండానే ఎంబీ రికార్డులు చేసిన ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మిగతా శాఖల్లోనూ ఇదే తీరు.. ఈ నెలాఖరు నాటికి ముంపు మండలాల్లోని పనులన్నీ పూర్తి చేయాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఒక వేళ పనులు మిగిలినట్లైతే వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే బిల్లులు పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతుండటంతో కాంట్రాక్టర్లు హడావిడిగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. దీంతో ఆ పనుల్లో నాణ్యత కొరవడుతుందనే విమర్శలు ఉన్నాయి. ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ఎటువంటి తనిఖీలు ఉండటం లేదు. దీంతో కింద స్థాయిలోని పర్యవేక్షణాధికారులు, కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయి పనులను ‘మమ’ అనిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ ప్రత్యేక ప్రాజెక్టు కింద చేపడుతున్న రహదారుల నిర్మాణాల్లోనూ కూలీలకు బదులుగా పొక్లైన్లతోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. ముంపులో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. -
‘టచ్’లో ఉంటామండీ..
విలీనమయ్యే మండలాల నేతల ముందుచూపు పత్యేక గిరిజన జిల్లాలో పదవులపై కన్ను! తూర్పు’ నాయకులతో సత్సంబంధాలకు ఆరాటం వైఖరి మారినవారిలో ఎక్కువమంది టీడీపీవారే సాక్షి, రాజమండ్రి :ఇన్నాళ్లూ.. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఉభయగోదావరి జిల్లాల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించిన అక్కడి రాజకీయనేతలు.. ఇప్పుడు వైఖరిని మార్చుకుంటున్నారు. ఆ మండలాల విలీనంతో పాటు.. వాటినీ, ఉభయ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎలాగూ జరిగి తీరే పరిణామాన్ని వ్యతిరేకించి, చెడ్డ అనిపించుకునే దాని కన్నా.. ఇక్కడి నేతలను మచ్చిక చేసుకోవడమే మేలన్న ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా తూర్పు గోదావరి జిల్లా నాయకుల వద్దకు వస్తున్న వారిలో తెలుగు తమ్ముళ్లే ఎక్కువమంది. ఆ మండలాల్లోని ద్వితీయశ్రేణి నేతలు గత పది రోజులుగా జిల్లాకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. ‘టచ్’లో ఉంటామని చెప్పి వెళ్తున్నారు.ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాల్లోని 277 గ్రామాలు రంపచోడవరం డివిజన్లో విలీనమవుతున్నాయి. వీటిలో భద్రాచలం మినహా మూడు మండలాల అధ్యక్ష ఎన్నికలను తూర్పుగోదావరి యంత్రాంగం నిర్వహించింది. భద్రాచలం పట్టణం మాత్రం విలీనంలో లేకపోవడంతో నెల్లిపాక గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించారు. ఈ మండల పరిషత్ ఎన్నికలు జరగలేదు. ఆ మండలాల జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా కాకినాడలో తొలి జిల్లా పరిషత్ సమావేశం రోజున చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించడంతో ఇక తాము తూర్పు నేతలతో సత్సంబంధాలు కొనసాగించడమే మేలనుకుంటున్నారు ఈ నేతలు. పదవులపై ‘జేబురుమాలు’ వేయడమే.. విలీనం ప్రతిపాదన చట్ట రూపం దాల్చే వరకూ వారంతా ఈ ప్రక్రియను వ్యతిరేకించడమే కాక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. కానీ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంతో వైఖరిని మార్చుకున్నారు. ఈ నెల ఆరున జరిగిన ఎంపీపీ ఎన్నికలకు ముందు మూడు మండలాల నేతలు హోం మంత్రి చినరాజప్పను అమలాపురంలో, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను కోరుకొండలో కలిసి తమ ప్రాంత సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీడీపీ నేత, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావుతో కూడా మూడు మండలాల నేతలు నిత్యం అందుబాటులో ఉంటున్నట్టు తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలో కొద్దోగొప్పో పట్టున్న ద్వితీయశ్రేణి నేతలు కొత్తజిల్లా ఏర్పాటైతే జిల్లాస్థాయి పదవులు పొందవచ్చన్న ఆశతో ఉన్నారు. దీంతో ముందుగానే తూర్పులోని ముఖ్యనేతలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా.. ఏదో ఒక పదవిపై ‘జేబురుమాలు’ వేసినట్టవుతుందన్నది వారి ఆలోచన అంటున్నారు. మారని అధికారుల తీరు విలీన మండలాల నేతలు తమ మనసు మార్చుకుని విలీనాన్ని పదవీయోగానికి అవకాశంగా చూస్తుంటే అధికారులు మాత్రం విలీన ప్రక్రియకు విఘాతం కలిగిస్తూనే ఉన్నారు. ఈనెల నాలుగు నుంచి ప్రారంభమైన గ్రామ సభలను అక్కడి అధికారులు బహిష్కరించారు. సభలు నిర్వహించేది లేదని తహశీల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇతర క్షేత్ర స్థాయి అధికారులు సహాయ నిరాకరణను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల విలీనం, కొత్త జిల్లా ఏర్పాటుపై ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలిచ్చినా ఖాతరు చేయడం లేదు. -
‘ముంపు’తో మావోయిస్టుల ముప్పు!
కుక్కునూరు : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రలో విలీనమైన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు. ఆ జిల్లాల్లో విలీనమైన ఏడు ముంపు మండలాల్లో 2005 నుంచి ఇప్పటి వరకు పలు ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ మండలాలు విలీనమైన నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఉంటుందని ఆంధ్ర పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ర్ట మావోయిస్టులు ఇంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని సెంట్రల్జోన్గా చేసుకుని కార్యకలాపాలు సాగించారని, ఇప్పుడు ఏలూరును ఎంచుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల పశ్చిమగోదావరి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.రఘురామ్‌రెడ్డి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లను తనిఖీ చేసిన సందర్భంగా పోలీసులను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏడు మండలాల్లో పలు సంఘటనలు.. ఆదివాసీల మనుగడను ముంచేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని మావోయిస్టులు మొదటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు బదలాయించిన చింతూరుకు పక్కనే ఛత్తీస్‌గఢ్ ఉండడంతో మావోయిస్టులు, పోలీసుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుండడం పరిపాటిగా మారింది. వీఆర్‌పురం మండలంలో 20 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులను, 2009లో కూనవరానికి చెందిన శ్రీమంతుల సీతారామారావును మావోయిస్టులు కాల్చి చంపినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాకు బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పదేళ్లలో ఐదారు ఘటనలు జరిగాయి. 2005లో కుక్కునూరులోని పోలీస్‌స్టేషన్ పేల్చివేతకు గురైంది. పారిటాకులంకలో 2006, 2007లలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగి ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2007లో మండల పరిధిలోని తొండిపాకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మండవ రామిరెడ్డిని మావోయిస్టులు కాల్చిచంపారు. 2008లో కుక్కునూరు, అశ్వారావుపేట, దమ్మపేట రిజర్వ్పారెస్ట్లో మావోయిస్టులకు సంబంధించిన సామగ్రి, మందుగుండు పోలీసులకు లభించిన సంఘటనలు ఉన్నాయి. 2010లో పోలవరం నిర్వాసతుల కోసం వేలేరుపాడు మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మావోయిస్టులు కూల్చివేశారు. ఈ ఘటనల ద్వారా ముంపు మండలాల్లో మావోయిస్టులు పలుమార్లు తమ ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు ఆ ఏడు మండలాలు ఉభయగోదావరి జిల్లాల్లో కలవడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా మావోయిస్టుల ప్రాబల్యంలేదని, తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిసిన ముంపు మండలాలతోనే అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇటీవల ఏలూరులో పోలీసుల ప్రగతి సమీక్షా సమావేశంలో చెప్పారు. -
అటు టీడీపీ.. ఇటు సీపీఎం
భద్రాచలం: ముంపు మండలాలు సహా భద్రాచలం డివిజన్లో మండల పరిషత్ పాలకమండలి ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. అన్నిచోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఏక గ్రీవంగా జరిగింది. డివిజన్ కేంద్రమైన భద్రాచలానికి అటువైపునగల వాజేడు, వెంకటాపురం, చర్లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను టీడీపీ దక్కించుకుంది. కో-ఆప్షన్ సభ్యులు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే ఎంపికయ్యారు. దుమ్ముగూడెం మండలంలో సీపీఎం పాగా వేసింది. ఆ పార్టీకి చెందిన వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయా పార్టీలకు పూర్తిస్థాయిలో మెజార్టీ ఉండటంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ముంపు మండలాల్లో వైఎస్ఆర్ సీపీ బలం చాటుకుంది. చింతూరు మండలంలో జడ్పీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీనే గెలిచింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో వైస్ ఎంపీపీ స్థానం కూడా దక్కించుకుంది. చింతూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడు పండా నాగరాజు వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. కూనవరంలో వైఎస్ఆర్సీపీకి చెందిన గుజ్జా బాబు వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. భ ద్రాచలానికి మళ్లీ ఎన్నికలు జరుగాల్సిందేనా! తెలంగాణలోని నాలుగు మండలాల్లో ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. ఒక్క భద్రాచలం మిన హా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో కూడా బుధవారం ఎన్నిక జరిగింది. భద్రాచలం మండలం పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామం మిన హా మండలంలోని మిగతా 70 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. మొత్తం 25 ఎంపీటీసీ స్థానాలకుగాను పట్టణంలో 13, రూరల్‌లో 12 ఉన్నాయి. మండలం మెత్తాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. ప్రస్తుతం ఒక్క భద్రాచలం మండల ఎంపీపీ ఎన్నిక మాత్రమే నిలిచిపోయింది. జడ్పీటీసీ స్థానం కూడా రిజర్వేషన్ మారే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో భద్రాచలం పట్టణం, ఆంధ్రలో నెల్లిపాక మండల కేంద్రంగా మళ్లీ మండల పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
ఒకటా.. రెండా.. మూడా..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయా? ఒక్కో పార్లమెంటు స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున పెంచితే జిల్లాలో పెరిగే నియోజకవర్గాల సంఖ్య మూడుకు చేరుతుందా? ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడంతో ఒక్కటే పెరుగుతుందా? కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలేంటి? ఖమ్మం-2 వస్తుందా? ఏన్కూరు కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటవుతుందా? కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు తప్పవా?...అనే చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరుగా సాగుతోంది. తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడంతో ‘పునర్విభజన’ లెక్కలు మళ్లీ మొదలయ్యాయి. పునర్విభజన జరిగితే జిల్లాలో 12 నియోజకవర్గాలవుతాయని, కొత్తగా ఏర్పడే రెండు స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అవుతాయని చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో కూడా అసెంబ్లీ స్థానం పెంపు అంశం ఉండడంతో 2019 ఎన్నికల నాటికి జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపంలో మార్పులు కచ్చితంగా వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు ప్రకియ్ర ప్రారంభమయ్యేందుకు చాలా సమయమున్నా... ముఖ్యమంత్రి లేఖ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, మేధావులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా డీలిమిటేషన్ చర్చ జరుగుతోంది. ఏం జరగవచ్చు..? జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీల్లో పలురకాల చర్చలు నడుస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్యతో పాటు రిజర్వేషన్ల మార్పుల అంశంపైనా ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు జిల్లాలో పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు 12కు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా. కొత్తగా ఖమ్మం-2, ఏన్కూరు నియోజకవర్గాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలంటున్నాయి. వారి అంచనాల ప్రకారం... ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం (రైల్వే ట్రాక్‌కు అవతలి వైపు), రూరల్ మండలాలను కలిపి ఖమ్మం-2 నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీలో భాగంగా ఉన్న ఖమ్మం 1, 2 టౌన్లు, రఘునాధపాలెం మండలం యథావిధిగా ఉంటాయి. ఇక పాలేరు నియోజకవర్గంలో ఉన్న రూరల్ మండలం ఖమ్మం-2లో కలిస్తే ముదిగొండ మండలం మళ్లీ పాలేరులోకి రానుంది. మధిర నుంచి విడిపోయి మళ్లీ పాతస్థానంలో కలిసే అవకాశం ఉంది. ఇక, మిగిలిన మధిర, బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని మండలాలతో మధిర కొనసాగుతుంది. ఇల్లెందు నియోజకవర్గంలో కొత్తగా గుండాల మండలం కలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు పినపాక నియోజకవర్గంలో ఉన్న ఆ మండలం ఇల్లెందుకు వచ్చే అవకాశాలుంటాయి. అయితే, ఇప్పటివరకు ఇల్లెందులో ఉన్న కామేపల్లి విడిపోతుంది. ఇల్లెందు, బయ్యారం, గార్ల, టేకులపల్లి, గుండాల మండలాలతో కలిపి ఇల్లెందు నియోజకవర్గం అవుతుంది. వైరా నియోజకవర్గం కూడా స్వరూపాన్ని మార్చుకోనుంది. ఆ నియోజకవర్గం నుంచి మూడు మండలాలు విడిపోయి రెండు మండలాలు కలవనున్నాయి. ఇప్పటివరకు వైరాలో ఉన్న ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లితో పాటు కామేపల్లిని కలుపుకుని ఏన్కూరు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటవుతుందని అంచనా. ఇక వైరాలో వైరా, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు మండలాలు ఉంటాయి. అదే జరిగితే సత్తుపల్లి మున్సిపాలిటీ, రూరల్, వేంసూరు, పెనుబల్లి మండలాలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రలో కలవనుండగా, మిగిలిన మండలాలతో (అశ్వారావుపేట, చంద్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట) అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పాటు కానుంది. ఇక ముంపు ప్రాంతం కింద ఆంధ్రలోనికి వెళ్లే భద్రాచలం నియోజకవర్గంలోని మండలాలు పోను భద్రాచలం టౌన్, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలు భద్రాచలం అసెంబ్లీ పరిధిలో ఉంటాయి. పినపాక నుంచి గుండాల పోను మణుగూరు, పినపాక, బూర్గంపాడు (ఆరు గ్రామాలు ఆంధ్రలోనికి వెళ్తాయి.), అశ్వాపురం మండలాలతో ఈ నియోజకవర్గం కొనసాగుతుంది. కొత్తగూడెం మాత్రం యథావిధిగా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, మండలాలతో కలిపి కొనసాగుతుంది. రిజర్వేషన్లలోనూ మార్పు! పునర్విభజన జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాల రిజర్వేషన్లలోనూ మార్పులు జరగనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే పాలేరు నియోజకవర్గంలో ముదిగొండ మండలం కలిస్తే అది ఎస్సీకి రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని ఎస్సీ జనాభాలో ఉన్న 0.5 శాతం వ్యత్యాసం కారణంగా సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ అయింది. అదే ముదిగొండ మండలాన్ని మళ్లీ పాలేరులో కలిపితే అదే వ్యత్యాసంతో పాలేరును ఎస్సీకి రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే మళ్లీ సత్తుపల్లి జనరల్ కావచ్చు. ఇక, వైరాలో మార్పులు జరిగితే అది జనరల్‌కు రిజర్వ్ అవుతుందని, ఏన్కూరు కేంద్రంగా ఏర్పడే నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ చేస్తారని అంచనా. మొత్తంమీద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల సంఖ్యలో మార్పుండదు కానీ ఈ రెండు నియోజకవర్గాల రిజర్వేషన్లు మారొచ్చని అంచనా. దీంతోపాటు కొత్తగా ఏర్పడే ఖమ్మం - 2, తోపాటు వైరా నియోజకవర్గాలు కూడా జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుడు జిల్లాలో జనరల్ నియోజకవర్గాల సంఖ్య ఐదుకు చేరుతుంది. ఇప్పటివరకు ఉన్న జనరల్స్థానాల కరువు కూడా తీరుతుంది. కాగా, తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మేరకు కొత్తగూడెం లేదా భద్రాచలం కేంద్రంగా మరో జిల్లా ఏర్పడినప్పటికీ.. నియోజకవర్గాలను రాష్ట్రం యూనిట్‌గానే పరిగణిస్తున్నందున ఇందులో మార్పు ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. పార్లమెంటుకు రెండు చొప్పున.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంటే కొత్తగా 34 స్థానాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలుంటే, ఒక్కో ఎంపీ స్థానానికి రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున పునర్విభజన జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సి ఉంటుంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో రెండు, మహబూబాబాద్ పరిధిలో ఓ స్థానం పెరిగే అవకాశం ఉన్నా, ముంపు ప్రాంతం కింద ఏడు మండలాల్లోని రెండు లక్షలకు పైగా జనాభా ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఒక నియోజకవర్గం తగ్గుతుందని అంచనా. అసలేం జరుగుతుంది? కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికిప్పుడే జరిగే అవకాశం లేదు. సీఎం రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే దీనిపై సీఈసీ ఓ కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం పునర్విభజనపై కసరత్తు చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలా చేయాలి? ఎంత జనాభా యూనిట్‌గా వస్తుంది? దాన్ని బట్టి మండలాలు, గ్రామాల సరిహద్దులు చెరిగిపోకుండా జనాభా లెక్కకు మించకుండా శాస్త్రీయ పద్ధతిలో ఒక ప్రతిపాదనను తెస్తుంది. ఆ ప్రతిపాదన తయారు చేసే క్రమంలో అన్ని రాజకీయ పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుంటారు. అదే విధంగా అభ్యంతరాల నమోదును కూడా పరిశీలించి ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
తేలిన లెక్క
భద్రాచలం: ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన నేపథ్యంలో విభజన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగించాలని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ముంపు మండలాలను అప్పగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అంగీకరిస్తూ ఆ ఏడు మండలాలను ఇచ్చేయాలని ఏ క్షణానైనా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్న అధికార యంత్రాంగం.. ఇందుకు సంబంధించిన నివేదికలను సిద్ధం చే స్తోంది. ఈ నేపథ్యంలోనే ఏడు మండలాల్లో ఉన్న విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించేందుకు గిరిజన సంక్షేమ విద్యాశాఖ లెక్క తేల్చింది. ఐటీడీఏ అధికారుల నివేదిక మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి కమిషనర్ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నెల 22న లేఖ రాశారు. దీని ప్రకారం ఏడు మండలాల నుంచి గిరిజన సంక్షేమ విద్యాశాఖ పరిధిలో 141 విద్యా సంస్థ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించనున్నారు. వీటిలో 11,124 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 575 మంది బోధన, 148 మంది బోధనేతర సిబ్బంది ఖమ్మం జిల్లా నుంచి వేరుచేయబడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తారు. ఏ మండలంలో ఎన్ని... ఏడు మండలాల్లో గిరిజన సంక్షేమ విద్యాశాఖ పరిధిలో ఒక ఏటీడబ్ల్యూవో కార్యాలయం, ఒక రెసిడె న్షియల్ కళాశాల, 2 రెసిడెన్షియల్ పాఠశాలలు, 25 ఆశ్రమ పాఠశాలలు, 4 వసతి గృహాలు, 3 కేజీబీవీ లు, ఒక మినీ గురుకులం, 98 ప్రాధమిక పాఠశాలలు, 6 స్వయం పాలిత వసతి గృహాలు ఉన్నాయి. మండలాల వారీగా చూస్తే.. భద్రాచలంలో 21, బూర్గంపాడులో 3, చింతూరులో 46, కూనవరంలో 18, కుక్కునూరులో 14, వేలేరుపాడులో 12, వీఆర్‌పురంలో మండలంలో 27 విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించనున్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఎటపాకలోని విద్యాసంస్థలకు మినహాయింపు... భద్రాచలం మండలంలోని ఎటపాక సమీపంలో పలు విద్యాసంస్థ లు ఉన్నాయి. ప్రతిభా పాఠశాల, కేజీబీవీ, పాలిటెక్నిక్ కళాశాల, నవోదయ విద్యాలయంలతో పాటు ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్, ఇటీవలే నెలకొల్పిన యువ శిక్షణ కేంద్రం ఉన్నాయి. రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పది జిల్లాల విద్యార్థులు చేరుతారు. ప్రతిభ పాఠశాలలోనూ ఇదే రీతిన అడ్మిషన్లు కల్పిస్తారు. నవోదయ విద్యాలయంలో జిల్లాలోని 14 మండలాలకు చెందిన విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. భద్రాచలం పట్టణంలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఇటీవలే ఎటపాకలో గల నూతన భవనంలోకి మార్చారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో గల గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరికొన్ని భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు తెలంగాణలోని పదిజిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మిగిలిన భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాలు, జిల్లాలోని మిగతా గిరిజన ప్రాంతాల వారికి ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎటపాకలో ఉన్న ఈ విద్యాసంస్థలను తెలంగాణలోనే ఉంచాల్సిన ఆవశ్యకతను ఐటీడీఏ పీవోదివ్య జిల్లా కలెక్టర్‌కు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదించారు. దీంతో కమిషనర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించేందుకు సిద్ధం చేసిన విద్యాసంస్థల జాబితాలో కూడా వీటి కి మినహాయింపు ఇచ్చిన అధికారులు, ఇందుకు గల కారణాలను కమిషనర్ తన లేఖలో వివరంగా ప్రభుత్వానికి తెలియజేశారు. ఆ 17 గ్రామాలు ఇటే ఉంచండి.. భద్రాచలం మండలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించగా, ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచారు. అయితే తెలంగాణలోనే ఉన్న దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలంటే భద్రాచలం మండలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గల కొన్ని గ్రామాలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దీంతో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం రామాలయం భూములు ఉన్న పురుషోత్తపట్నం కూడా ఆంధ్రకే వెళ్లిపోవటం వల్ల భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నమవుతాయని ఇక్కడి అధికారుల సూచన మేరకు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శికి కమిషనర్ రాసిన లేఖలో వివరించారు. భద్రాచలం మండలంలోని లక్ష్మీదేవిపేట, ఎటపాక, చంద్రంపాలెం, కొలనగూడెం, చింతలగూడెం, సీతంపేట, కన్నాయిగూడెం, తాళ్లగూడెం, మ దిమేరు, మిడిపర్ పేట, గట్టుగూడెం, పిచుకుల పాడు, తునికిచెరువు, శ్రీ నివాసపురం, పెర్గూసన్పేట, పురుషోత్తపట్నం, సీతారాంపురం రెవెన్యూ గ్రామాలను తెలంగాణలోనే ఉంచేలా చూడాలని కమిషనర్ కోరారు. -
పనులకు ముప్పు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించ బడిన ముంపు మండలాల్లో అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆగస్టు రెండో వారం నాటికి ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోతాయనే ప్రచారం సాగుతోంది. ఈ మండలాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు వీటిని పూర్తి చేసేందుకు వెనుకంజ వేస్తుండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోతే తాము చేసిన పనులకు బిల్లులు మంజూరవుతాయో.. లేదోననే ఆందోళనలో కాంట్రాక్టర్లు ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు మంజూరైతే చాలన్న రీతిలో వారు ఆయా శాఖల ఇంజనీరింగ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లలో అనుమానం..ఆందోళన భద్రాచలం డివిజన్లోని భద్రాచలం రూరల్, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అవుతాయి. పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కలుస్తాయి. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఈ తతంగం అంతా ఎప్పట్లోగా పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరవుతాయో లేదోననే అనుమానం కాంట్రాక్టర్లలో నెలకొంది. దీనిపై జిల్లా అధికారులు కూడా స్పష్టంగా సమాధానం చెప్పకపోవటంతో పనులు ముందుకు సాగని పరిస్థితి ఉంది. కొనసాగుతున్న పనులివే.. గిరిజన సంక్షేమ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఏడు మండలాల్లో రూ.53 కోట్ల మేర పనులు నిర్వహిస్తున్నారు. వీటిలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల భవనాలు, పాఠశాలల భవనాలు, గిరిజన గ్రామాలకు రోడ్లు, అంగన్వాడీ భవనాలు కలపి రూ. 20 కోట్ల విలువైన పనులు ఉంటాయి. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షల విలువైన పనులు ఉన్నాయి. ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ. 33 కోట్లు పనులు నిర్వహిస్తున్నారు. ముంపు మండలాలను అధికారికంగా అప్పగించాల్సి వస్తే ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కూడా సంబంధిత జిల్లాల్లోని ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించాల్సిందే. మరి కొన్ని రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఏ స్టేజి వరకు పనులు చేశారు? ఎంత మేరకు బిల్లు అయింది? అనే దానిపై ప్రస్తుతం నివేదికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఓ ఇంజనీరింగ్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏ క్షణాన అడిగినా పనులను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి చెప్పారు. ఎల్‌డబ్ల్యూఈఏ పనులు ఏమవుతాయో..?! మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా దేశంలోని 60 జిల్లాలు ఎంపికయ్యాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లా మాత్రమే ఉంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్న ఏడు మండలాల్లో ఈ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆశ్రమ పాఠశాలల నిర్మాణ పనులు కొద్దిమేరకు మిగిలి ఉన్నాయి. ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.5 కోట్లతో భద్రాచలం- రాజమండ్రి రహదారి, రూ.15 కోట్లతో సీలేరు నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. చింతూరు నుంచి రాజమండ్రి మార్గంలో రూ.13 కోట్లతో ఘాట్ రోడ్ పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఆంధ్రప్రదే శ్‌కు బదలాయింపు జరగటంతో ఎల్‌డబ్ల్యూఈఏ పథ కం కింద చేపట్టిన పనులు కొనసాగించాలా..? వద్దా..? అనే దానిపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఆంధ్రకు బదలాయిస్తున్నారు. ఆయా జిల్లాలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో ఈ పనులు ఎలా చేపట్టాలనే దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచే ఆదేశాలు రావాల్సి ఉంటుందని ఓ ఇంజనీరింగ్ అధికారి వెల్లడించారు. -
నిరసనల హోరు...
భద్రాచలం : ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో గిరిజన గురుకుల విద్యాలయ ఉద్యోగులు కూర్చోగా, టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూబన్న ప్రారంభించారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కేంద్ర మాజీమంత్రి పోరిక బలరామ్‌నాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముంపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ముంపు మండలాల ప్రజల అభిప్రాయాల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్నారు. ఈ ప్రాంత ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటకీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తోందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరామ్‌నాయక్ మాట్లాడుతూ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనేం చేయటం అన్యాయమన్నారు. అయితే ఆయన మాట్లాడుతుండగా.. ‘మీరు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, నాడు అడ్డుకోకపోవడం వల్లే ఇప్పుడు ఆదివాసీలకు అన్యాయం జరిగింది’ అని బలరాం నాయక్‌ను జేఏసీ నాయకులు నిలదీశారు. శుక్రవారం నాటి దీక్షల్లో బాణోతు కృష్ణ, ఎం దేవదాసు, కృష్ణార్జునరావు, చంద్రయ్య, నాగముణి, మధు, శ్రీహరి, పద్మ, పార్వతి, రాంబాబు, బాలరాజు కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్శిం హారావు, కొవ్వూరి రాంబాబు, జేఏసీ నాయకులు వెక్కిరాల, రామాచారి, సోమశేఖర్, జపాన్‌రావు, రామాచారి, బాలకృష్ణ, దాసరి శేఖర్, పూసం రవికుమారి తదితరులు మద్దతు పలికారు. నేటి నుంచి ఆంధ్ర బస్సులు నిలిపివేత... ఆర్డినెన్స్‌కు వ్యతిరేక పోరులో భాగంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు(72 గంటలు) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటామని జేఏసీ నాయకులు ప్రకటించారు. కాగా ముంపు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ శుక్రవారం కూడా మూత పడ్డాయి. ఇదిలా ఉండగా నెల్లిపాకలో ఏర్పాటు చేసిన ఆంధ్ర ఎక్సైజ్ చెక్‌పోస్టును తొలగించేందుకు టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు తదితరులు ప్రయత్నించారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఎక్సైజ్ సిబ్బంది అక్కడి నుంచి మరో చోటకు వెళ్లిపోయారు. చెక్‌పోస్టు ఏర్పాటుకు గుడిసెను ఎవరు అద్దెకు ఇచ్చారని జేఏసీ నాయకులు ఆరా తీసి, సదరు యజమానిని దీనిపై నిలదీశారు. చెక్‌పోస్టును వెంటనే తొలగించకపోతే తామే తీసేస్తామని హెచ్చరించారు. -
‘ముంపు’ విద్యార్థులకు..నో బస్‌పాస్ !
భద్రాచలం : జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ పాలన పరంగా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా మండలాలను జిల్లా నుంచే పర్యవేక్షిస్తున్నారు. అయితే భద్రాచలం ఆర్టీసీ అధికారులు మాత్రం అప్పుడే ఆ మండలాలతో తెలంగాణకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే బస్‌పాసులు ఇస్తామని ప్రకటించారు. బస్‌పాస్ తీసుకునేందుకు డిపోకు వచ్చిన ముంపు మండలాల విద్యార్థులు ఈ ప్రకటన చూసి ఆందోళన చెందుతున్నారు. ముంపు మండలాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే కలిసిపోయినట్లు స్థానిక ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తుండటంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీని రెండు రాష్ట్రాలకు సర్దుబాటు చేయకపోయినప్పటకీ సదరు అధికారులు అత్యుత్సాహం చూపించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు వివిధ సాంకేతిక విద్య, నర్సింగ్ కళాశాలలు భద్రాచలంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో భద్రాచలం, పాల్వంచ డివిజన్ పరిధిలో గల ఏడు మండలాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇక్కడికి వస్తున్నారు. వీరంతా ఆర్టీసీ రాయితీ ద్వారా కల్పించే బస్‌పాసులు తీసుకొని కళాశాలలకు వచ్చిపోతుంటారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో వీరి చదువులకు ఆటంకంగా మారనుంది. ఇతర రాయితీ కార్డులకూ నో చాన్స్.. విద్యార్థుల బస్‌పాస్‌లతో పాటు ఆర్టీసీ ద్వారా వివిధ వర్గాల వారికి ఇచ్చే రాయితీ కార్డుల ద్వారా ఆంధ్రరాష్ట్రానికి వెళ్లే అవకాశం కూడా ఇకపై ఉండకపోవచ్చు. వీటిని కూడా అనుమతించ వద్దని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ, ఈ ప్రాంత ప్రజానీకం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రస్తుతానికి వీటిని అనుమతిస్తున్నారు. ఆందోళన బాటలో విద్యార్థులు.. ముంపు మండలాల్లోని విద్యార్థులకు బస్‌పాసులు ఇవ్వకపోవటం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ అధికారుల వ్యవహారంపై శుక్రవారం నుంచి ఆందోళన బాట పట్టేందుకు ఆయా సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ముంపు మండలాలను వేరు చేయటం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : డీఎం ఉన్నతాధికారుల ఆదేశం మేరకే ముంపు మండలాల విద్యార్థులకు బస్‌పాసులు ఇవ్వటం లేదని భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వర బాబు తెలిపారు. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. అయితే వివిధ రకాల రాయితీ కార్డులను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎఫ్ఐ ఆందోళన ముంపు మండలాల్లోని విద్యార్థులకు బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు కారం నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వతీరు వల్లే ముంపు మండలాల్లోని ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే చుట్టుపక్కల మండలాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరు కళాశాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ముంపు మండలాల విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు బస్సు పాసులు ఇవ్వకపోతే వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు చర్యల వల్ల సుమారు 1800 మంది విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును తక్షణమే నిలిపివేసి ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చరణ్,సతీష్, రమేష్, అనీల్, చలపతి తదితరులు పాల్గొన్నారు. -
సెంటు భూమీ వదిలేది లేదు..
టీఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర హోంమంత్రి నాయిని హామీ భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన జిల్లాలోని ముంపు మండలాల్లో సెంటు భూమి కూడా వదులుకునేది లేదని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ విషయంలో ఖమ్మం జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భద్రాచలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. నాయకులు రాజేంద్రవర్దన్, కొండముక్కల సాయిబాబా, జిల్లా మహిళా నాయకురాలు చల్లపూడి సంధ్యాలక్ష్మి ఆధ్వర్యంలో పలువురు హైదరాబాద్ వెళ్లి హోంమంత్రిని బుధవారం కలిశారు. ముంపు మండలాల పరిస్థితిని వివరించారు. ఏడు మండలాలు సీమాంధ్రకు బదలాయించటం వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై తమ ప్రాంతంలో ఆందోళన నెలకొందని వివరించారు. స్పందించిన నాయిని ముంపు మండలాల ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానిమంత్రి మోడీని కలుస్తామని చెప్పారని.. హైదరాబాద్ వెళ్లిన నాయకులు తెలిపారు. గోదావరి జలాలు వినియోగానికి తెలంగాణ రాష్ట్రం తరఫున తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో పర్యటించాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు త్వరలోనే వస్తానని హామీ ఇచ్చారన్నారు. హోంమంత్రిని ఘనంగా సన్మానించి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ప్రసాదాలను అందజేశామన్నారు. -
గిరిపుత్రుల చదువులపై నీలినీడలు
భద్రాచలం : జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఏడు మండలాలను పోలవరం ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించటంతో ఈ ప్రభావం గిరిపుత్రుల చదువులపై పడింది. ముంపు పరిధిలోని భద్రాచలం(భద్రాచలం రెవెన్యూగ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు(12 గ్రామాలు మినహా) మండలాలను జిల్లా నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. బదలాయింపు లాంఛనం గా జరిగిపోయినప్పటికీ పరిపాలనా పరంగా వీటిపై ఎవరు అజమాయిషీ చేయాలనే దానిపై స్పష్టత లేకపోవటంతో ముంపు మండలాల్లో ఒకింత అయోమయం నెలకొంది. ప్రధానంగా ఆయా మండలాల్లో ని గిరిపుత్రుల చదువులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూ పిస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలను మరో రెండురోజుల్లో తెరవనుండగా, ఇక్కడ అడ్మిషన్లపై గందరగోళం నెలకొంది. ఆయా మండలాల్లో ఉన్న ప్రభుత్వ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో స్థానికంగా ఉన్న విద్యార్థులే చేరతారు కాబట్టి ఇ బ్బందులు లే కున్నప్పటకీ, ఐటీడీఏ పరిధిలో గల ఆ శ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాలపై సందిగ్ధత ఏర్పడింది. అడ్మిషన్లపై స్పష్టత లేదు... ముంపు మండలాల్లో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలు, కేజీబీవీలలో ఇప్పటి వరకూ ఏజెన్సీ ప్రాంతంలోని 29 మండలాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.. కానీ ముంపు మండలాల బదలాయింపుతో ఇవి ఆంధ్రలోకి వెళ్లిపోవటంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఖమ్మం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ముంపు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలా...? వద్దా..? అనే దానిపై అధికారుల్లో కూడా స్పష్టత లేకుండా ఉంది. భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాలు ఆంధ్ర రాష్ట్రానికి బదలాయింపు జరిగినందున ఇక్కడ ఉన్న ప్రైవేటు, ప్రభ్తుత్వ పాఠశాలల్లో కూడా అడ్మిషన్ల విషయమై ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై స్పష్టత లేదు. ఈ వారంలో ముంపు మండ లాల విద్యాశాఖాధికారులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నందున అప్పటి వరకూ తాము కూడా ఏమీ చెప్పలేమని ఓ విద్యాశాఖాధికారి తెలిపారు. ఐటీడీఏ రోడ్లో ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదివేవారంతా భద్రాచలం పట్టణంలోని విద్యార్థులే. కానీ ఈ పాఠశాల ఉన్న ప్రాంతం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయింపు జరిగింది. దీంతో తమ పిల్లలను ఇక్కడ చేర్పించే విషయంలో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. 1304 పాఠశాలలు ఆంధ్రలోకి ముంపు మండలాల విలీనంతో వివిధ యాజమాన్యాల కింద ఉన్న 1304 పాఠశాలలు (అంగన్వాడీ, ప్రైవేటు పాఠశాలలతో సహా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వెళ్లనున్నాయి. వీటిలో ప్రతి ఏటా సుమారుగా 50 వేల మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఈఏడాది నుంచి వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్నట్లు పరిగణించాల్సి ఉంటుంది. మండల, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ కళాశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలతో కలిపి మొత్తంగా 4107 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ సిబ్బంది, ఇతర విద్యాశాఖ అధికారులు ఇందులో ఉన్నారు. వీరంతా జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వారు. ఉద్యోగ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంతాన్ని యూనిట్‌గా తీసుకొని స్పెషల్ డీఎస్సీ, అదే విధంగా జిల్లా యూనిట్‌గా డీఎస్సీ ద్వారా నియమింప బడిన వారే ఎక్కువగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ముంపు మండలాల బదలాయింపుతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ సర్వీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యోగుల పంపిణీలో విధి విధానాలు తమకు అనుకూలంగా లేకపోతే పోరు బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు అంటున్నారు. ముంపులో బడిబాట లేనట్లే డ్రాపవుట్స్ నివారణ కోసం ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట నిర్వహిస్తుంటారు. కానీ ముంపు మండలాల్లో ఈ ఏడాది బడిబాట లేనట్లేనని ఇక్కడి విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ముంపు మండలాల్లోనే డ్రాపవుట్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ మండలాల్లో ఇందుకోసమని ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తుండటమే ఇందుకు ఉదాహరణగా చె ప్పవచ్చు. కానీ బడిబాట కార్యక్రమం లేకపోతే డ్రాపవుట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అదే విధంగా ముంపు మండలాల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలు సరఫరా కూడా అస్తవ్యస్తంగానే ఉంది. పాఠశాలలు తెరిచే నాటికే పుస్తకాల సరఫరా పూర్తికావాల్సి ఉండగా ఇది సవ్యంగా జరగటం లేదు. ఏమైనా ముంపు మండలాల పాలనపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెంటనే ప్రకటించకపోతే తాము అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. -
‘ముంపు’ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
టీజేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ భద్రాచలం టౌన్: పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి వేరు చేయాలని జారీ చేసిన అక్రమ ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ టీజేఏసీ, ప్రజా, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ముఖ్య కూడళ్ల నుంచి తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులకు భంగం కల్గించేలా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను వేరు చేసి సంపదను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర స్థాయిలో ఆర్డినెన్స్ రద్దుకై ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, ఎస్కే గౌసుద్దీన్, పూసం రవికుమారి, కొండరెడ్ల సంఘ నాయకులు ముర్ల రమేష్, సీపీఎం నాయకులు జీఎస్ శంకర్రావు, టీఎఫ్‌ఎఫ్ నాయకులు బి రాజు, వెంకటేశ్వర్లు, వీరభద్రం, గెజిటెడ్ ఉద్యోగ సంఘ నాయకులు కె. సీతారాములు, నాయకపోడు సంఘ నాయకులు సంగం నాగేశ్వరరావు, బీఎస్పీ నాయకులు ఏవి రావు, మాలమహానాడు నాయకులు దాసరి శేఖర్, టీఆర్ఎస్ నాయకులు కొండముక్కుల సాయిబాబా, ప్రజా సంఘాల నాయకులు జగదీష్, ఆదినారాయణ పాల్గొన్నారు.