‘టచ్’లో ఉంటామండీ..
విలీనమయ్యే మండలాల నేతల ముందుచూపు
పత్యేక గిరిజన జిల్లాలో పదవులపై కన్ను!
తూర్పు’ నాయకులతో సత్సంబంధాలకు ఆరాటం
వైఖరి మారినవారిలో ఎక్కువమంది టీడీపీవారే
సాక్షి, రాజమండ్రి :ఇన్నాళ్లూ.. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఉభయగోదావరి జిల్లాల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించిన అక్కడి రాజకీయనేతలు.. ఇప్పుడు వైఖరిని మార్చుకుంటున్నారు. ఆ మండలాల విలీనంతో పాటు.. వాటినీ, ఉభయ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎలాగూ జరిగి తీరే పరిణామాన్ని వ్యతిరేకించి, చెడ్డ అనిపించుకునే దాని కన్నా.. ఇక్కడి నేతలను మచ్చిక చేసుకోవడమే మేలన్న ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా తూర్పు గోదావరి జిల్లా నాయకుల వద్దకు వస్తున్న వారిలో తెలుగు తమ్ముళ్లే ఎక్కువమంది. ఆ మండలాల్లోని ద్వితీయశ్రేణి నేతలు గత పది రోజులుగా జిల్లాకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు.
‘టచ్’లో ఉంటామని చెప్పి వెళ్తున్నారు.ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాల్లోని 277 గ్రామాలు రంపచోడవరం డివిజన్‌లో విలీనమవుతున్నాయి. వీటిలో భద్రాచలం మినహా మూడు మండలాల అధ్యక్ష ఎన్నికలను తూర్పుగోదావరి యంత్రాంగం నిర్వహించింది. భద్రాచలం పట్టణం మాత్రం విలీనంలో లేకపోవడంతో నెల్లిపాక గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించారు. ఈ మండల పరిషత్ ఎన్నికలు జరగలేదు. ఆ మండలాల జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా కాకినాడలో తొలి జిల్లా పరిషత్ సమావేశం రోజున చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించడంతో ఇక తాము తూర్పు నేతలతో సత్సంబంధాలు కొనసాగించడమే మేలనుకుంటున్నారు ఈ నేతలు.
పదవులపై ‘జేబురుమాలు’ వేయడమే..
విలీనం ప్రతిపాదన చట్ట రూపం దాల్చే వరకూ వారంతా ఈ ప్రక్రియను వ్యతిరేకించడమే కాక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. కానీ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంతో వైఖరిని మార్చుకున్నారు. ఈ నెల ఆరున జరిగిన ఎంపీపీ ఎన్నికలకు ముందు మూడు మండలాల నేతలు హోం మంత్రి చినరాజప్పను అమలాపురంలో, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను కోరుకొండలో కలిసి తమ ప్రాంత సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీడీపీ నేత, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావుతో కూడా మూడు మండలాల నేతలు నిత్యం అందుబాటులో ఉంటున్నట్టు తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలో కొద్దోగొప్పో పట్టున్న ద్వితీయశ్రేణి నేతలు కొత్తజిల్లా ఏర్పాటైతే జిల్లాస్థాయి పదవులు పొందవచ్చన్న ఆశతో ఉన్నారు. దీంతో ముందుగానే తూర్పులోని ముఖ్యనేతలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా.. ఏదో ఒక పదవిపై ‘జేబురుమాలు’ వేసినట్టవుతుందన్నది వారి ఆలోచన అంటున్నారు.
మారని అధికారుల తీరు
విలీన మండలాల నేతలు తమ మనసు మార్చుకుని విలీనాన్ని పదవీయోగానికి అవకాశంగా చూస్తుంటే అధికారులు మాత్రం విలీన ప్రక్రియకు విఘాతం కలిగిస్తూనే ఉన్నారు. ఈనెల నాలుగు నుంచి ప్రారంభమైన గ్రామ సభలను అక్కడి అధికారులు బహిష్కరించారు. సభలు నిర్వహించేది లేదని తహశీల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇతర క్షేత్ర స్థాయి అధికారులు సహాయ నిరాకరణను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల విలీనం, కొత్త జిల్లా ఏర్పాటుపై ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలిచ్చినా ఖాతరు చేయడం లేదు.