టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్
ఎదులాపురం, న్యూస్‌లైన్ : పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపకుండా ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే విధంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం అన్యాయమని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.అశోక్ అన్నారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీవో సంఘ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని పేర్కొన్నారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. జూన్ 2న భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
జూన్ 1న సాయంత్రం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటామన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వాములమవుతామన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్‌లు ఇవ్వకుండా స్వస్థలాల్లో విధులు నిర్వహించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎన్జీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, ఉపాధ్యక్షుడు రమణ, సభ్యులు శ్రీనివాస్, నవీన్‌కుమార్, ఆశారెడ్డి, తిరుమలరెడ్డి, బలరాం, ముజఫర్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలి
Published Sun, Jun 1 2014 3:13 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement