ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీంతో ఇంతకాలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఏడు మండలాలు చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయాయి. పోలవరం ప్రాజెక్టు కట్టడం పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలోని ఏడు మండలాలు ముంపు బారిన పడతాయని, వారికి పునరావాసం కల్పించాలంటే ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉంచడం సబబని గతంలో భావించారు. ఆ మేరకు కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం, 15 గ్రామాలు మినహా బూర్గంపాడు, భద్రాచలం పట్టణం మినహా భద్రాచలం మండలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అయ్యాయి.
పోలవరం నిర్వాసితులకు సొంత మండలంలోనే భూమికి బదులు భూమి లభించేలా పునరావాస ప్యాకేజీని అమలు చేసేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. ఇందుకోసం మండలాలను యూనిట్‌గా తీసుకుని నిర్వాసిత ప్రాంతాలను యూపీఏ-2 సర్కారు సీమాంధ్రలో కలిపింది. అయితే భద్రాచలానికి దారినిచ్చే బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను, భద్రాచలం పట్టణాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచింది. ఈ విషయమై మార్చి 2న జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రానికి చెందిన అప్పటి మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ పాల్గొన్నారు. ఏడు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న అంశాన్ని జైపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
నిజానికి భద్రాచలం పట్టణం, రామాలయం మినహా ఏడు మండలాల్లోని రెవెన్యూ గ్రామాలను మాత్రమే విభజన బిల్లులో చేర్చారు. ముంపు గ్రామాల జీవోను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. కానీ కేవలం ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలంటే సీమాంధ్ర రాష్ట్రానికి కష్టమవుతుందన్న అక్కడి ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అప్పట్లో రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుంటుందని అందులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిన మండలాలివీ...
పాల్వంచ రెవెన్యూ డివిజన్:
కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పుసాక, నకిరిపేట, సోంపల్లి రెవెన్యూ గ్రామాలు మినహా. ఈ 12 గ్రామాలూ తెలంగాణకు వెళ్తాయి)
భద్రాచలం రెవెన్యూ డివిజన్:
చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు. భద్రాచలం టౌన్, రామాలయం మాత్రం తెలంగాణలో ఉంటాయి.
ఆ ఏడు మండలాలు ఇక ఆంధ్రకే
Published Fri, Jul 11 2014 1:52 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement