కేంద్రం మొండిగా వ్యవహరించింది: కేసీఆర్
హైదరాబాద్: పోలవరంపై కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ని పూర్తిగా ఉల్లంఘించారని మండిపడ్డారు. తాను స్వయంగా కేంద్రం, రాష్ట్రపతిని కలిసి పోలవరం డిజైన్ మార్చాలని కోరినా కేంద్రం మొండిగా వ్యవహరించిందని వాపోయారు.
బీజేపీ, టీడీపీలు విప్ జారీ చేసి పంతం నెగ్గించుకుంటుంటే తెలంగాణ టీడీపీ, బీజేపీ ఎంపీలు అడ్డుకుని ఉండాల్సిందని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఈ విషయంలో పార్లమెంట్‌లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో గొంతు నొక్కివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల మనోభావాలను కేంద్రం పట్టించుకోలేదన్నారు.
పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పటికీ భద్రాచలంలోని ఏడు మండలాలను కాపాడుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలన్న దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేసీఆర్ చెప్పారు.