గిరిపుత్రుల చదువులపై నీలినీడలు | tension about education to tribal students | Sakshi
Sakshi News home page

గిరిపుత్రుల చదువులపై నీలినీడలు

Published Wed, Jun 11 2014 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

గిరిపుత్రుల చదువులపై  నీలినీడలు - Sakshi

గిరిపుత్రుల చదువులపై నీలినీడలు

భద్రాచలం : జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఏడు మండలాలను పోలవరం ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించటంతో ఈ ప్రభావం గిరిపుత్రుల చదువులపై పడింది. ముంపు పరిధిలోని భద్రాచలం(భద్రాచలం రెవెన్యూగ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు(12 గ్రామాలు మినహా) మండలాలను జిల్లా నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో విలీనం చేశారు.  
 
బదలాయింపు లాంఛనం గా జరిగిపోయినప్పటికీ పరిపాలనా పరంగా వీటిపై ఎవరు అజమాయిషీ చేయాలనే దానిపై స్పష్టత లేకపోవటంతో ముంపు మండలాల్లో ఒకింత అయోమయం నెలకొంది. ప్రధానంగా ఆయా మండలాల్లో ని గిరిపుత్రుల చదువులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూ పిస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలను మరో రెండురోజుల్లో తెరవనుండగా, ఇక్కడ అడ్మిషన్‌లపై గందరగోళం నెలకొంది. ఆయా మండలాల్లో ఉన్న ప్రభుత్వ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో స్థానికంగా ఉన్న విద్యార్థులే చేరతారు కాబట్టి ఇ బ్బందులు లే కున్నప్పటకీ, ఐటీడీఏ పరిధిలో గల ఆ శ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాలపై సందిగ్ధత ఏర్పడింది.
 
అడ్మిషన్‌లపై స్పష్టత లేదు...
ముంపు మండలాల్లో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలు, కేజీబీవీలలో ఇప్పటి వరకూ ఏజెన్సీ ప్రాంతంలోని 29 మండలాలకు చెందిన  విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.. కానీ ముంపు మండలాల బదలాయింపుతో ఇవి ఆంధ్రలోకి వెళ్లిపోవటంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఖమ్మం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ముంపు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలా...? వద్దా..? అనే దానిపై అధికారుల్లో కూడా స్పష్టత లేకుండా ఉంది. భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాలు ఆంధ్ర రాష్ట్రానికి బదలాయింపు జరిగినందున ఇక్కడ ఉన్న ప్రైవేటు, ప్రభ్తుత్వ పాఠశాలల్లో కూడా అడ్మిషన్‌ల విషయమై ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై స్పష్టత లేదు.
 
ఈ వారంలో ముంపు మండ లాల విద్యాశాఖాధికారులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నందున అప్పటి వరకూ తాము కూడా ఏమీ చెప్పలేమని ఓ విద్యాశాఖాధికారి తెలిపారు. ఐటీడీఏ రోడ్‌లో ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదివేవారంతా భద్రాచలం పట్టణంలోని విద్యార్థులే. కానీ ఈ పాఠశాల ఉన్న ప్రాంతం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయింపు జరిగింది. దీంతో తమ పిల్లలను ఇక్కడ చేర్పించే విషయంలో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.
 
1304 పాఠశాలలు ఆంధ్రలోకి
ముంపు మండలాల విలీనంతో వివిధ యాజమాన్యాల కింద ఉన్న 1304 పాఠశాలలు (అంగన్‌వాడీ, ప్రైవేటు పాఠశాలలతో సహా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వెళ్లనున్నాయి. వీటిలో ప్రతి ఏటా సుమారుగా 50 వేల మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఈఏడాది నుంచి వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్నట్లు పరిగణించాల్సి ఉంటుంది. మండల, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ కళాశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్‌వాడీలతో కలిపి మొత్తంగా 4107 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
 
ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ సిబ్బంది, ఇతర విద్యాశాఖ అధికారులు ఇందులో ఉన్నారు. వీరంతా  జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వారు. ఉద్యోగ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంతాన్ని యూనిట్‌గా తీసుకొని స్పెషల్ డీఎస్సీ, అదే విధంగా జిల్లా యూనిట్‌గా డీఎస్సీ ద్వారా నియమింప బడిన వారే ఎక్కువగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ముంపు మండలాల బదలాయింపుతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ సర్వీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యోగుల పంపిణీలో విధి విధానాలు తమకు అనుకూలంగా లేకపోతే పోరు బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు అంటున్నారు.
 
ముంపులో బడిబాట లేనట్లే
డ్రాపవుట్స్ నివారణ కోసం ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట నిర్వహిస్తుంటారు. కానీ ముంపు మండలాల్లో ఈ ఏడాది బడిబాట లేనట్లేనని ఇక్కడి విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ముంపు మండలాల్లోనే డ్రాపవుట్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ మండలాల్లో ఇందుకోసమని ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తుండటమే ఇందుకు ఉదాహరణగా చె ప్పవచ్చు. కానీ బడిబాట కార్యక్రమం లేకపోతే డ్రాపవుట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులు కూడా అంగీకరిస్తున్నారు.
 
అదే విధంగా ముంపు మండలాల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలు సరఫరా కూడా అస్తవ్యస్తంగానే ఉంది. పాఠశాలలు తెరిచే నాటికే పుస్తకాల సరఫరా పూర్తికావాల్సి ఉండగా ఇది సవ్యంగా జరగటం లేదు. ఏమైనా ముంపు మండలాల పాలనపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెంటనే ప్రకటించకపోతే తాము అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement