48 మండలాలు.. 931 గ్రామాలు | 41,730 hectares of forest land to merge | Sakshi
Sakshi News home page

48 మండలాలు.. 931 గ్రామాలు

Published Sat, Sep 13 2014 12:45 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

48 మండలాలు.. 931 గ్రామాలు - Sakshi

48 మండలాలు.. 931 గ్రామాలు

‘పశ్చిమ’ స్వరూపం మారింది
జిల్లాలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు
విస్తరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన
ఏలూరు : మొన్నటివరకు ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు మన జిల్లాలో కలిశాయి. బూర్గం పాడు మండలానికి చెందిన 6 గ్రామాలు సైతం జిల్లా పరిధిలోకి రాగా, వాటిని కుక్కునూరు మండలంలో కలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులను జిల్లాలో కలుపుతూ ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నప్పటికీ శుక్రవారం జిల్లా రాజపత్రం (గెజిట్)లో ప్రచురితమైంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్నిర్మాణం చట్టం 1974 (7) మూడో విభాగంలో రెండవ ఉప విభాగం ద్వారా సంక్రమించిన అధికారాల ఆధారంగా పరిపాలన సౌలభ్యం, వాటిని అభివృద్ధి చేసేం దుకు వీలుగా ఆ మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేసినట్టు గెజిట్‌లో పేర్కొన్నారు.

దీంతో ఆ రెండు మండలాల్లోని 47 గ్రామాలు జిల్లాలో అధికారికంగా కలిశాయి. మూడు నెలలుగా సాగుతున్న విలీన ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడం విశేషం. ఈ రెండు మండలాలను జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో చేర్చారు. ఇప్పటివరకు ఆ డివిజన్‌లో ఆరు మండలాలు ఉం డగా, ఈ రెండింటితో కలిపి మండలాల సంఖ్య 8కి పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకూ 46మండలాలు ఉం డగా, ఆ సంఖ్య 48కి చేరింది. కుక్కునూరు మండలంలో 20 గ్రామాలకు, బూర్గంపాడు మండలంలోని సీతారామనగరం, శ్రీధరవేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, రవిగూడెం (పెద్ద) గ్రామాలను కుక్కునూరు మండలంలో విలీనం చేశారు. దీంతో కుక్కునూరు మండలంలోని గ్రామాల సంఖ్య 26కు పెరగ్గా, వేలేరుపాడు మండలంలోని 21 గ్రామాలతో కలిపి 47 గ్రామాలు జిల్లాలో కలిశాయి. ఇప్పటివరకు జిల్లాలో 884గ్రామాలుం డగా, 47 గ్రామాల చేరికతో మొత్తం గ్రామాల సంఖ్య 931కి చేరింది.
 
పెరిగిన జనాభా 58,365
 జిల్లాలోని 46మండలాల్లో 39,36,966 జనాభా ఉంది. కొత్త మండలాల నుం చి 58,365 మంది చేరికతో జిల్లా జనాభా సంఖ్య 39,95,331కు చేరింది.
 
ఇక ఆంధ్రా పాలన
జంగారెడ్డిగూడెం : కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇకనుంచి ఆంధ్రా పాలన సాగనుంది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల విలీనానికి జూలైలో లోక్‌సభ, రాజ్యసభలో ఆమో ద ముద్రపడింది. ఆ రెండు మండలాలను విలీనం చేస్తూ సెప్టెంబర్ 1న అధికారిక ప్రచురణ నిమిత్తం జిల్లా రాజపత్రం (గెజిట్ నోటిఫికేషన్) విడుదల చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో వి.మురళీమోహనరావు ఆయా మండలాలకు వెళ్లి స్థానిక అధికారులతో మాట్లాడారు. విలీన ప్రక్రియ పూర్తరుునట్టు శుక్రవారం అధికారిక ప్రకటన జారీ చేయడంతో ఆ మండలాల్లోని పాలన జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాగనుంది. అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకుల సరఫరాతోపాటు, పింఛన్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నామని ఆర్డీవో తెలిపారు.

అదేవిధంగా ముంపు మండలాల్లోని నిర్వాసితులను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు వారి ఆప్షన్లను బట్టి విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఆ మండలాల్లోని ప్రజలకు సంబంధిం చిన ఆధార్, రేషన్ కార్డులు, భూమి పట్టాలు వంటివన్నీ ఆంధ్రాలోకి మార్చాల్సి ఉందన్నారు. ఆ ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం విద్య, వైద్యం, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై దృష్టి సారించినట్టు చెప్పా రు.

ఇకపై జీసీసీ ద్వారా నిత్యావసర సరుకులను ఆయా గ్రామాల్లోని చౌక డిపోలకు సరఫరా చేసేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే అన్ని శాఖల అధికారులతో ఆ మండలాల్లో సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి పరిపాలన అందించే దిశగా కృషి చేస్తామని ఆర్డీవో తెలిపారు. పోలీస్ కార్యకలాపాలకు సంబంధించి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు అక్కడి పోలీసులతో ఇప్పటికే మాట్లాడారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఎక్సైజ్ అధికారులు ఆ రెండు మండలాల్లోని కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
 
41,730 హెక్టార్ల అటవీ భూమి విలీనం
రెండు మండలాల విలీనంతో జిల్లాలో అటవీ విస్తీర్ణం బాగా పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 81,166 హెక్టార్ల అటవీ భూమి ఉండగా, విలీరంతొ 41,730 హెక్టార్లు భూమి కలిసింది. దీంతో జిల్లాలోని అటవీ విస్తీర్ణం 1,22,896 హెక్టార్లకు విస్తరించింది. ఆ రెండు మండలాల నుంచి 76,765 హెక్టార్ల రెవెన్యూ భూమి కూడా మన జిల్లాలో కలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement