పోల‘వరాన్ని’ నీరు గార్చేందుకే..
సాక్షి, రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టును నీరు గార్చేందుకే ప్రభుత్వం గోదావరిపై ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదిస్తోందని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కృష్ణా డెల్టాకు నీరందివ్వాలంటూ పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం వద్ద రూ.1200 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. గోదావరి నుంచి పంపుల ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని తరలించాలని ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీన్ని వ్యతిరేకిస్తూ రాజమండ్రి వీటీ కళాశాల సెమినార్ హాలులో శనివారం భారతీయ కిసాన్ సంఘ్, రాష్ట్ర నీటి వినియోగ దారుల సంఘాల సమాఖ్య, పోలవరం సాధన సమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పేరుకు కృష్ణా డెల్టాకు నీరంటున్నా విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణానికి కావాల్సిన నీటి కోసమే ఈ ప్రాజెక్టు తలపెట్టారని రైతు నేతలు విమర్శించారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆలోచించాలి తప్ప, ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు. ముందుగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు పుష్కలంగా ఇచ్చి పూర్తి చేయాలి. ఎత్తిపోతల కోసం ఏటా రూ.250 కోట్లు విద్యుత్తు ఛార్జీలు కట్టాలి. 132 మెగా వాట్‌ల విద్యుత్తు అవసరం. ఇది పూర్తయితే ఎడమ కాలువకు కూడా లిప్టు పెట్టుకుని నీళ్లు తోడుకోండని, పోలవరం అవసరమే లేదని ఇతర రాష్ట్రాలు న్యాయస్థానం వద్ద వాదించే ప్రమాదం ఉంది.
- నాగిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్
కేంద్రమే పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో కట్టిస్తామంటుంటే మధ్యలో ఈ ప్రాజెక్టు ఏంటి? పోలవరం కాలువలు ఇంకా పూర్తవాలి. ఆక్విడెక్టులు నిర్మించాలి. ఇవన్నీ పూర్తవాలంటే నాలుగేళ్లు పడుతుంది. ఈ లోగా ఈ కొత్త పథకం వృథా.
-వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి
లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి వ్యతిరేకంగా జనవరి ఒకటి నుంచి ఉద్యమిస్తాం. 13 జిల్లాల రైతాంగానికి దీని వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కలుపుకొని నెలాఖరులోగా కార్యాచరణ రూపొందిస్తాము.
- జలగం కుమారస్వామి, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి
వరద నీటిని మాత్రమే తోడుతాం అని ప్రభుత్వం చెబుతున్నా తాగు నీటి అవసరాలు అని చెప్పి 365 రోజులూ నీటి తరలింపు ఉంటుంది. దీంతో ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు పారదు. ప్రాజెక్టు కట్టాలనే ప్రభుత్వం నిర్ణయిస్తే పంపుల ఎత్తుపై స్పష్టంగా జీఓ తెచ్చుకోవాలి. లేదంటే చట్టపరంగా కూడా రైతుకు లాభం జరగదు.
- సానా నాగేశ్వరరావు, ‘పోలవరం’ రిటైర్డు ఇంజనీరు
కృష్ణాడెలా నీటి అవసరాల్ని పోలవరం మాత్రమే మా శాశ్వతంగా తీరుస్తుంది. కొత్తగా నిర్మించిన పులిచింతలలో ఇప్పు డు కేవలం 10 టీఎంసీల నీరు నిల్వ ఉంచుతున్నారు. తెలంగాణ కు పునరావాసం కోసం రూ.240 కోట్లు చెల్లిస్తే మరో 30 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు.
- అక్కినేని భవానీప్రసాద్,
కృష్ణా జిల్లా రైతు సంఘాల ప్రతినిధి
కృష్ణా జిల్లా రైతులే ఎత్తిపోతల పథకం వల్ల తమకు ఉపయోగం లేదంటున్నా, ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిపాదిస్తుండడం హాస్యాస్పదం. మేం కూడా రాజకీయాలకు అతీతంగా పోలవరం సాధనకు రైతులతో ముందుకు నడుస్తాం.
- కందుల దుర్గేష్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
పోలవరం కడితే ఆరు జిల్లాల్లోని 63 లక్షల మంది రైతులకు ప్రయోజనం. ప్రభుత్వం ముందు ఆ పథకం వంక చూడాలి. ఈ ఎత్తిపోతల పథకాల వల్ల రైతుకు లాభం లేదు.
- ఎం.వి.సూర్యనారాయణరాజు,
పోలవరం సాధన సమితి కార్యదర్శి
డెల్టా రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లే ఎలాంటి చర్యలనైనా బీజేపీ ఖండిస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని కేంద్ర జల సంఘం దృష్టికి కూడా తీసుకు వెళ్తాను. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే వ్యతిరేకిస్తాం.
- ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్యే, రాజమండ్రి సిటీ
డెల్టా రైతుల పరిరక్షణకు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా, పార్టీలకు అతీతంగా రైతు నేతలు కలిసి రావాలి. మూడేళ్లలో పోలవరం పూర్తిచేయగలిగితే ఈ పథకం వృధా అవుతుంది కదా. దీన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలు కనిపించడం లేదు. లిఫ్టు వల్ల కృష్ణా రైతాంగానికి ప్రయోజనం లేకపోగా, ఉభయగోదావరి రైతులు అన్యాయమైపోతారు.
- కొవ్వూరి త్రినాథరెడ్డి,
నీటి సంఘాల వినియోగ దారుల సమాఖ్య కార్యద ర్శి