భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల విలీన ప్రక్రియ పూర్తయింది. పాల్వంచ డివిజన్‌లోని వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాల విలీనానికి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఫైనల్ గెజిట్ జారీ చేశారు. కాగా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాల స్వాధీనంపై తూ.గో. కలెక్టర్ నీతూప్రసాద్ గెజిట్ జారీ చేశారు.
ఈ నెల 15న జారీ చేసిన గెజిట్ ప్రతులను విలీన మండలాల తహశీల్‌దార్‌లకు బుధవారం స్వయంగా అందజేశారు. దీంతో ఇక రికార్డుల అప్పగింతల ప్రక్రియ మినహా ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలు ఇక నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోకి సంపూర్ణంగా విలీనమైనట్లే. ఇదిలా ఉండగా విలీన మండలాల్ల్లో పాలనా వ్యవహారాలు తీసుకునేందుకు ఆయా జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు పర్యటనలకు సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు గురువారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పర్యటనకు వస్తున్నారు.
ఆయా మండలాల్లో పర్యటించి, స్థానిక అధికారులు, ప్రజలతో మాట్లాడుతారు. కాగా, తూ.గో. జిల్లాకు చెందిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా గురువారం చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం రూరల్ మండలాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టు ప్రభావిత మండలాలు కావటంతో పోలీస్ అధికారుల పర్యటన వివరాలను చెప్పేందుకు అధికారులు నిరాకరించారు.
కాకినాడ సమీక్షకు వెళ్లిన తహశీల్దార్లు...
తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం తహశీల్దార్‌లు బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షకు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముంపు మండలాల సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. తూ.గో. జిల్లాలో కలిసినందుకు ఇక్కడి ప్రజలు ఎలా భావిస్తున్నారు.. మండలాల్లో చేపట్టాల్సిన ప్రాధాన్యత గల పనులు ఏమిటి.. అని ఆ జిల్లా అధికారులు తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కాగా మరో రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ముంపు మండలాల పర్యటనకు వస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా వారికి సూచించినట్లు తెలిసింది.
రికార్డుల అప్పగింతకు ఆదేశం...
ముంపు మండలాల్లో రెవెన్యూ రికార్డుల అప్పగింతకు సిద్ధం కావాలని తహశీల్‌దార్‌లకు తూ.గో. జిల్లా అధికారులు సూచించారు. అడంగల్, పహణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప రికార్డులను అప్పగించలేమని ముంపు మండలాల అధికారులు చెపుతున్నారు.
విలీనం సంపూర్ణం
Published Thu, Sep 18 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement