భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. వారి నుంచి తీసుకున్న ఆప్షన్‌ల మేరకు బదిలీపై తెలంగాణకు వద్దామని భావించినప్పటికీ, ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపకాలు పూర్తయిన తర్వాతే ముంపు ఉద్యోగుల బదిలీలు ఉంటాయని ఉన్నతాధికారులు తేల్చిచెప్పటంతో వారిలో ఆందోళన మొదలైంది.
ఏపీలో విలీనమైన భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రాచలం కేంద్రంగా ఉన్న ఎస్‌టీవో కార్యాలయం నుంచి వేతనాలు అందుతున్నాయి. ఈ నాలుగు మండలాల్లో 109 డీడీవోల ద్వారా 2,280 మంది ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారు. ఇక కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లోని ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో 29 డీడీవోల ద్వారా 447 మంది ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారు. వీరితో పాటు ఏడు మండలాల్లో 291 మంది పింఛన్‌దారులు ఉన్నారు.
వీరందరికీ ఈ నెల 15వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి వేతనాలు అందనున్నట్లు తెలిసింది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే దానిపై ఇప్పటికే ఆప్షన్ లు తీసుకున్నారు. వీరిలో దాదాపు 80శాతం మంది తెలంగాణకు వచ్చేం దుకే ఇష్టపడుతున్నా రు. ముంపులో ఉన్న వారికి ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని ఉన్నత స్థాయి అధికారులు హామీ ఇవ్వడంతో త్వరలోనే వెనక్కు వస్తామని భావించిన ఉద్యోగులకు ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడు మండలాల విలీనంపై ఈనెల 15న ఫైనల్ గెజిట్ జారీ కావటంతో అప్పటి వరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతనాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ట్రెజరీ కార్యాలయాలకు కూడా ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవటం తో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ముంపులో పనిచేయాల్సిందేనా..?
ముంపు మండలాల్లోని ఉద్యోగులంతా ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయాల్సిందేనని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అక్టోబర్ 2 నుంచి ఏపీలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభమవుతుండగా, దీనిని ముంపు మండలాల్లో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ముంపు మండలాల అధికారులు కూడా హాజరయ్యారు. దీంతో మరికొన్ని నెలల పాటు ఎక్కడి వారక్కడే పనిచేయాల్సి వస్తందేమోననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తాము.. తాజా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం కింద పనిచేయాల్సి రావటంతో, ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్ర కేడర్‌లో ఉన్న ఉద్యోగుల మాట ఎలా ఉన్నా...తమ నియామకమే తెలంగాణలో అయినప్పడు, ఇటువంటి పరిస్థితులు దాపురించడం దురుదృష్టకరమని ఓ ఉపాధ్యాయ సంఘం నేత ‘సాక్షి’ వద్ద వాపోయారు.
కమలనాథన్ కరుణ కోసం ఎదురుచూపు...
ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 80 శాతానికి పైగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకే సుముఖత వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో 348 మంది తెలంగాణకు వస్తామంటే, 214 మంది ఆంధ్రకు వెళ్తామని ఆప్షన్ ఇచ్చారు. మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్లో 528 తెలంగాణకు, 208 మంది ఆంధ్రకు, ఐకేపీలో 61 మంది తెలంగాణకు, 16 మంది ఆంధ్రకు, వైద్య ఆరోగ్యశాఖలో 246 మంది తెలంగాణకు, 54 మంది ఆంధ్రకు, అటవీశాఖలో 168 తెలంగాణకు, 27 మంది ఆంధ్రకు ఆప్షన్ ఇచ్చారు.
మిగతా శాఖల్లో కూడా ఎక్కువ మంది తెలంగాణకు వ చ్చేందుకే మొగ్గు చూపారు. అయితే ఇప్పటికిప్పుడు వేల సంఖ్యలో ఉద్యోగుల సర్దుబాటు ఇరు రాష్ట్రాలకు సమస్యగానే పరిణమించటంతోనే పంపకాల ప్రక్రియను రెండు ప్రభుత్వాలు ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలనాథన్ కమిటీ మానవీయ కోణంలో పరిశీలించి తమ ఆప్షన్‌లపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
భద్రాచలంలో ఏపీ టెలీ కాన్ఫరెన్స్...
అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు శనివారం మండల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ముంపు మండలాల అధికారులు కూడా హాజరుకావాలని ఆదేశించారు. అయితే ముంపు మండలాల అధికారులు భద్రాచలం(తెలంగాణ)లోని ఆర్‌డీవో కార్యాలయంలోనే దీనికి సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉండడంతో ఇక్కడి నుంచే పాల్గొన్నారు.
త్రిశంకు స్వర్గం !
Published Sun, Sep 21 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement