భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాలపై పూర్తిస్థాయిలో పాలన సాగించేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరిలో కలిపిన నెల్లిపాక (భద్రాచలం రూరల్), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో గురువారం ఆ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి తగిన నివేదికలతో రావాల్సిందిగా నాలుగు మండలాల అధికారులకు ఉత్తర్వులు పంపారు.
భద్రాచలం సబ్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవమున్న నీతూప్రసాద్‌కు ఈ ప్రాంత సమస్యలు, గిరిజనుల ఇబ్బందులపై అవగాహన ఉంది. అక్టోబర్ 2 నుంచి ముంపు మండలాల్లో పూర్తి స్థాయిలో పాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాల అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పర్యటించారు.
అధికారులు లేకుండా పాలన ఎలా..?!
తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పాలనాపరంగా ఇబ్బంది లేకన్నా, నెల్లిపాక మండలంపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగతా మండలమంతా బదలాయించి, దీనికి నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించారు. కానీ, ఇంతవరకూ అక్కడ కార్యాలయాలు తెరవలేదు. మండల అధికారులు కూడా లేరు.
భద్రాచలం పట్టణంలోని మండల అధికారులంతా నెల్లిపాక మండలంతో తమకు సంబంధం లేదని, తాము తెలంగాణ రాష్ట్రం పరిధికి చెందినవారమని చెబుతున్నారు. కూనవరం మండలంలో ఉన్న అధికారులకు నెల్లిపాకను కూడా పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించేందుకు తూ.గో. అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు ఇన్‌చార్జిలను అప్పగిస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. దీనిపై కలెక్టర్ నీతూ ప్రసాద్ దృష్టి సారించాల్సుంది.
ముంపులో నిలిచిన అభివృద్ధి
ముంపు మండలాల్లో అభివృద్ధి పనులను ఉన్నఫలంగా అప్పగించేందుకు ఖమ్మం జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మండలాల్లో కొత్తగా పనులు చేసేందుకు ప్రతిపాదనలు కూడా చేయలేదు. చివరకు ఎల్‌డబ్ల్యూఈఏ పథకంక్రింద వివిధ కారణాలతో చేయలేకపోయిన పనులను రద్దు చేసిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు.. వాటిని ముంపు మండలాల్లో కాకుండా జిల్లాలోని ఇతర మండలాలకు కేటాయించారు. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన నాలుగు మండలాల్లో అభివృద్ధి నిలిపోయింది.
సమస్యలపై దృష్టి సారించకపోతే కష్టమే
భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాలకు చెందిన 277 రెవెన్యూ గ్రామాలు తూర్పుగోదావరి జిల్లాలో కలిసాయి. ఇందులో 38,096 ఇండ్లు వీటిలో 1,31,528 మంది జనాభా ఉంది. 1,99,825.60 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని భూభాగం తూ.గో. జిల్లాలో కలుస్తుంది. నాలుగు మండలాల్లో అత్యధికంగా గిరిజనులే ఉన్నారు.
చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో అత్యంత వెనుకబడిన గిరిజన తెగకు చెందిన కొండరెడ్లు గుట్టలపై, కొండలపై నివసిస్తున్నారు. వీరికి సరైన పౌష్టికాహారం అందటం లేదు. వైద్య సేవలు కూడా అంతంత మాత్రమే. ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో పలువురు గర్భిణీలు ఇంకా ఇండ్ల వద్దనే ప్రసవాలు జరుగుతున్నాయి. గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేవు. వీటి పరిష్కరించేలా అధికార యంత్రాంగానికి కలెక్టర్ దిశానిర్దేశం చేయాల్సిన అవసరముంది.
ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలేవీ...
ముంపు మండలాల్లోని దాదాపు 80శాతం మంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు. వారంతా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మరికొన్ని నెలలపాటు ఎక్కడి వారక్కడనే పనిచేయాలనే సంకేతాలు వస్తున్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లా అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు సాధ్యం కాదనేది వాస్తవం. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.
‘ముంపు’ పాలనకు కార్యాచరణ
Published Thu, Sep 25 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement