ముగిసిన ‘ముంపు’ కథ ! | Final Gazette issued by the Government of AP | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘ముంపు’ కథ !

Published Fri, Sep 12 2014 1:30 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

Final Gazette issued by the Government of AP

 భద్రాచలం : ముంపు మండలాల కథ ము గిసింది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు. వేలేరుపాడు, బూర్గం పాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలను ఏపీలో విలీనం చేసుకునే చివరి అంకం కూడా పూర్తయింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనల్ గెజిట్ జారీ చేసింది. దీంతో ఆ మండలాలపై ఇక నుంచి ఆ ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమించనున్నాయి.

 భద్రాచలం డివిజన్‌లోని భద్రాచలం, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో గల 277 గ్రామాలను తూర్పు గోదావరి జిల్లాలో కలుపుతూ రంపచోడవం రెవెన్యూ డివిజన్ కింద చేర్చారు. బూర్గంపాడు మండలంలోని 6, కుక్కునూరు మండలంలోని 20, వేలేరుపాడులోని 21 .. మొత్తం 47 రెవెన్యూ గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేసి, వీటిని జంగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చారు. ఇక నుంచి ఆ మండలాలపై ఆయా రెవె న్యూ డివిజన్ పరిధి నుంచే పర్యవేక్షణ సాగనుంది.

గోదావరి వరదలతో సంభవించిన నష్టం పై కూడా అంచనాల నివేదికలను ముంపు మండలాల అధికారులు ఏపీ ప్రభుత్వానికే పంపించాల్సి ఉంటుంది. వరద సాయం కూడా ఆయా రెవెన్యూ డివిజన్‌ల నుంచే విడుదల కానుంది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీనిలో భాగంగానే రంప చోడవరం ఆర్‌డీవో గురువారం చింతూరు కేంద్రంగా భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాల అధికారులతో వరద నష్టంపై సమీక్షించారు.

ముంపు ముండలాలను విలీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ మేరకు అభిప్రాయ సేకరణ కోసం సెప్టెంబర్ 1న ప్రత్యేక గెజిట్ జారీ చేశారు. దీని ప్రకారం 30 రోజుల్లోగా పలువురు తమ అభిప్రాయాలను చెప్పారు. వీటిని ప్రామాణికంగా తీసుకోవటంతో పాటు, రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఫైనల్ గెజిట్ జారీ చేసింది. దీంతో ముంపు మండలాల్లో అన్ని రకాల సేవలు ఏపీ ప్రభుత్వం నుంచే అందనున్నాయి. నేడో, రేపో ఖమ్మం జిల్లా అధికారుల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిసింది.

 ఈ నెలాఖరు నాటికి ఉద్యోగుల పంపకాలు...
 ముంపు మండలాలపై ఫైనల్ గెజిట్ విడుదలైన నేపథ్యంలో పాలనపై పట్టు సాధించే క్రమంలో ఉద్యోగుల సర్దుబాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముంపులో ఉన్న ప్రత్యే క వెసులుబాటు మేరకు  ఈ నెలాఖరు నాటికి ఉద్యోగుల పంపకాలను పూర్తి చేయనున్నట్లు సమాచారం. ముంపులో పనిచేసే ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాలను ఏపీ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుం దని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈ లోగానే ఆ రాష్ట్రానికి ఆప్షన్‌లు ఇచ్చిన వారిని తీసుకొని పాలన సాగించుకోవాలని, తెలంగాణకు ఆప్షన్‌లు ఇచ్చిన వారిని వెంటనే అక్కడ నుంచి పంపించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన స్పష్టత ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement