ముంపు ఉద్యోగులకు.. ఆంధ్ర నుంచే వేతనాలు | salaries from andhra to caved employees | Sakshi
Sakshi News home page

ముంపు ఉద్యోగులకు.. ఆంధ్ర నుంచే వేతనాలు

Published Sat, Nov 22 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

salaries from andhra to caved employees

భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు ముంపు మండలాల్లో పరిపాలన వేగవంతంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే, ముంపు ఉద్యోగులకు వేతనాలను చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, నెల్లిపాక మండలాల అధికారులకు  తూర్పుగోదావరి కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏడు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకుగాను వారి సమగ్ర వివరాలను పంపించాలని పేర్కొన్నారు.

 20వ తేదీన కలెక్టరేట్ నుంచి జారీ అరుున ఈ ఉత్తర్వుల్లో.. వివరాలను 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాలని పేర్కొనడం గమనార్హం. ఇది, ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ లెక్కన నవంబర్ వేతనాలను కూడా ఏపీ నుంచే వచ్చే అవకాశముందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగుల వివరాలకు సంబంధించి పది అంశాలను పొందుపరిచారు.

 విలీన మండలాల్లోని ఉద్యోగులంతా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం నుంచే వేతనాలు పొందారు. ఉద్యోగుల పంపకాలు జరిగితే 80 శాతం వరకు ఉద్యోగులు వెనుక్కి (తెలంగాణకు) వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లోని ఉద్యోగుల నుంచి ఖమ్మం కలెక్టర్ ఇటీవల ఆప్షన్లు తీసుకున్నారు. 1585 మంది తెలంగాణలో, 588 మంది ఆంధ్రాలో ఉంటామని చెప్పారు.

తాజాగా, ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చిన వారు మాత్రం అక్కడి వేతనాలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకసారి వేతనాలు తీసుకుంటే సర్వీసుపరంగా అనేక ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ఏపీలో వేతనాలు తీసుకుంటామని అంగీకరించిన ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంటు వదులుకోవాల్సిందే. ఈ తాము కోరుకున్న రాష్ట్రానికి బదిలీ చేసప్తే ఎలాంటి గందరగోళం ఉండదని ఏడు మండలాల్లోని ఉద్యోగులు అంటున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

 తూగో కలెక్టర్ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు
  డీడీవో వివరాలు, ఏరియా, డీడీవో పేరు.. అడ్రస్.
 కొత్తగా డీడీవో కోడ్ కేటాయించే క్రమంలో కలెక్టర్ ధృవీకరణ కోసం తగిన వివరాలు.
 డీడీవోల పరిధిలోని ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్, శాంక్షన్ పోస్టులు, వర్కింగ్, ఖాళీల వివరాలు. ఇందులో గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, క్లాస్ ఫోర్, సీపీఎస్ హోల్డర్     వివరాలు.

 ఉద్యోగుల వేతన వివరాలు. ఉద్యోగుల ఐడీ, గ్రాస్, డిడక్షన్, నెట్, జీపీఎఫ్ అకౌంట్ నంబర్, ఏపీజీఎల్‌ఐసీ నంబర్, సీపీఎస్ అంకౌంట్ నంబర్, రుణ సదుపాయాలు పొందినట్టరుుతే వాటి వివరాలు.
 ఉద్యోగులు ఏ బ్యాంకు నుంచి వేతనాలు పొందుతున్నారు? బ్యాంకు పేరు, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్.
 డీడీవోలంతా తమ కరెంట్ అకౌంట్‌ను రంపచోడవరంలోని ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకోవాలి.
 కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డీడీవోవారీగా ఇవ్వాల్సుంటుంది.
 ఏపీలో విలీనమైన మండలాల్లో పనిచేస్తూ ఆంధ్ర నుంచి వేతనాలను తీసుకొనేందుకు ఇష్టపడని వారి ఉద్యోగుల వివరాలను డీడీవో ధృవీకరించి పంపాలి.
 వేతనాల బిల్లులను హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్ విధానంలోనే ఇవ్వాలి.
 అన్ని రకాల చెల్లింపులు ఈ-పేమెంట్స్ ద్వారానే జరగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement