► ఉద్యోగుల స్థానచలనానికి కసరత్తు ప్రారంభం
► ఈనెల మొదటివారంలో ఖాళీల జాబితా
► ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సిస్టంపై ఉద్యోగుల్లో ఆందోళన
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది. గత ఏడాది వ్యవసాయ, వైద్యశాఖ ఉద్యోగుల స్థానచలనానికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈసారి అన్ని శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. రాజకీయ పైరవీలు ఊపందుకుంటున్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా ఆన్‌లైన్ ఎంప్లాయి ట్రాన్స్‌ఫర్ సిస్టం ద్వారా బదిలీలు చేపట్టనున్నారు.
జిల్లాలో ఉద్యోగుల బదిలీల కసరత్తు ప్రారంభం కావడంతో రాజకీయ పైరవీలు ఊపందుకుంటున్నాయి. గతేడాది వ్యవసాయ, వైద్యశాఖ ఉద్యోగుల స్థానచలనానికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే ఈసారి పరిపాలనా సౌలభ్యం పేరుతో అందరినీ కదిపే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గతేడాది తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ∙ఆన్‌లైన్ విధానాన్నే ఈసారి కూడా అమలుచేస్తుండడంతో బదిలీల పారదర్శకతపై ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు, సాక్షి: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ ఫీవర్ పట్టుకుంది. ఈ సారి అన్ని శాఖల్లో బదిలీలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. జిల్లాలో దాదాపు 71 ప్రభుత్వ శాఖలున్నాయి. వీటిలో దాదాపు 36 వేల మంది ఉద్యోగులు, మరో 17,600 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 5 ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగం చేసిన వారిని మొదట బదిలీ చేయాల్సి ఉంది. మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీ కోరుకుంటే.... వారు కోరుకున్న చోటు ఖాళీగా ఉంటే మాత్రమే అవకాశం కల్పిస్తారు.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిలో దాదాపు 30 నుంచి 40 శాతం ఉద్యోగులకు స్థాన చలనం అయ్యే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్యాశాఖల బదిలీలకు వేర్వేరుగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. విద్యాశాఖలో వెబ్ విధానం, పనితీరు కోసం పాయింట్లు అమలు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు బదిలీల గైడ్‌లైన్స్ మాత్రం వెలువడలేదు. గత ఏడాది బదిలీలు చేపట్టని వ్యవసాయ, ఆరోగ్యశాఖలో ఈ సారి ఉద్యోగులకు పెద్ద సంఖ్యలో స్థాన చలనం కలగనుందని సమాచారం.
ఆన్‌లైన్ ద్వారానే బదిలీలు..
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ ద్వారానే బదిలీలు చేపడతారు. అయితే బదిలీలు పారదర్శకంగా లేవని నిరుడు ఈవిధానంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఏడాదైనా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల్లో కీలకంగా ఉన్నవారు, డెప్యూటేషన్‌పై పని చేస్తున్నవారు నిబంధనలను సాకుగాచూపి కోరుకున్న చోట పోస్టింగ్‌లు పొందే అవకాశాలున్నాయి. ఐదేళ్లు దాటినా బదిలీలు ఇష్టపడక.. బదిలీ దరఖాస్తు చేయలేని వారికోసం దరఖాస్తు చేసే బాధ్యతను డ్రాయింగ్ ఆఫీసర్స్‌కు అప్పగించారు. ఈ నెల మొదటి వారంలో ఖాళీల జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
పీఠాదీశులు ఈ సారైనా కదిలేనా...
రెవెన్యూ, వ్యవసాయ, సంక్షేమశాఖ, విద్యాశాఖ, సెరికల్చర్‡ శాఖల్లో కొందరు ఏళ్లతరబడి ఒకే చోట పని చేస్తున్నారు. దీంతో అక్కడ అవినీతి భారీగా పేరుకుపోయింది . ఈ సారైనా వీరిని కదిపి అర్హులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బదిలీలు చేపడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు పని చేశారు, ప్రతికూలంగా ఎవరు పని చేశారనే జాబితా వేగుల ద్వారా ఇప్పటికే టీడీపీ అ«ధినాయకత్వానికి చేరిందని సమాచారం.
టీడీపీ సానుభూతిపరులకు వారు కోరుకున్న చోటుకు బదిలీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. గుంటూరులో ప్రత్యేక జీవో ద్వారా ఇప్పటికే నలుగురు ఉపాధ్యాయులు తమకు కావాల్సిన చోటికి బదిలీ చేయించుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగేందుకు అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.