పనులకు ముప్పు | corruption on caved areas works | Sakshi
Sakshi News home page

పనులకు ముప్పు

Published Mon, Jul 21 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

corruption on caved areas works

భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించ బడిన ముంపు మండలాల్లో అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆగస్టు రెండో వారం నాటికి ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోతాయనే ప్రచారం సాగుతోంది. ఈ మండలాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి.

 కాంట్రాక్టర్‌లు వీటిని పూర్తి చేసేందుకు వెనుకంజ వేస్తుండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోతే తాము చేసిన పనులకు బిల్లులు మంజూరవుతాయో.. లేదోననే ఆందోళనలో కాంట్రాక్టర్‌లు ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు మంజూరైతే చాలన్న రీతిలో వారు ఆయా శాఖల ఇంజనీరింగ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

 కాంట్రాక్టర్లలో
 అనుమానం..ఆందోళన    భద్రాచలం డివిజన్‌లోని భద్రాచలం రూరల్, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అవుతాయి. పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కలుస్తాయి. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఈ తతంగం అంతా ఎప్పట్లోగా పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరవుతాయో లేదోననే అనుమానం కాంట్రాక్టర్లలో నెలకొంది. దీనిపై జిల్లా అధికారులు కూడా స్పష్టంగా సమాధానం చెప్పకపోవటంతో పనులు ముందుకు సాగని పరిస్థితి ఉంది.

 కొనసాగుతున్న  పనులివే..
 గిరిజన సంక్షేమ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఏడు మండలాల్లో రూ.53 కోట్ల మేర పనులు నిర్వహిస్తున్నారు. వీటిలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల భవనాలు, పాఠశాలల భవనాలు, గిరిజన గ్రామాలకు రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు కలపి రూ. 20 కోట్ల విలువైన పనులు ఉంటాయి. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షల విలువైన పనులు ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ. 33 కోట్లు పనులు నిర్వహిస్తున్నారు.

ముంపు మండలాలను అధికారికంగా అప్పగించాల్సి వస్తే ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కూడా సంబంధిత జిల్లాల్లోని ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించాల్సిందే. మరి కొన్ని రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఏ స్టేజి వరకు పనులు చేశారు? ఎంత మేరకు బిల్లు అయింది? అనే దానిపై ప్రస్తుతం నివేదికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఓ ఇంజనీరింగ్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏ క్షణాన అడిగినా పనులను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి చెప్పారు.

 ఎల్‌డబ్ల్యూఈఏ పనులు ఏమవుతాయో..?!
 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా దేశంలోని 60 జిల్లాలు ఎంపికయ్యాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లా మాత్రమే ఉంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్న ఏడు మండలాల్లో ఈ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆశ్రమ పాఠశాలల నిర్మాణ పనులు కొద్దిమేరకు మిగిలి ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.5 కోట్లతో భద్రాచలం- రాజమండ్రి రహదారి, రూ.15 కోట్లతో సీలేరు నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. చింతూరు నుంచి రాజమండ్రి మార్గంలో రూ.13 కోట్లతో ఘాట్ రోడ్ పనులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాంతం ఆంధ్రప్రదే శ్‌కు బదలాయింపు జరగటంతో ఎల్‌డబ్ల్యూఈఏ పథ కం కింద చేపట్టిన పనులు కొనసాగించాలా..? వద్దా..? అనే  దానిపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఆంధ్రకు బదలాయిస్తున్నారు. ఆయా జిల్లాలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో ఈ పనులు ఎలా చేపట్టాలనే దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచే ఆదేశాలు రావాల్సి ఉంటుందని ఓ ఇంజనీరింగ్ అధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement