ముంపులో ఆప్షన్‌లు షురూ..! | caved employees to have options | Sakshi
Sakshi News home page

ముంపులో ఆప్షన్‌లు షురూ..!

Published Wed, Aug 27 2014 2:54 AM | Last Updated on Sat, Jun 2 2018 6:38 PM

caved employees to have options

భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ముంపు మండలాల ఉద్యోగుల పంపకాలకు సర్వం సిద్ధమైంది. ముంపులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట కల్పించేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారానికి రావడంతో పంపకాల ప్రక్రియను వేగవంతం చేశారు. ముంపులో పని చేస్తున్న అన్ని శాఖల ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మూడు రోజులుగా ఈ వ్యవహారం శరవేగంగా జరుగుతుండగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి మరో కబురు వచ్చింది.

ముంపులో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వివరాలతో పాటు, వారికి సంబంధించిన సర్వీసు రిజిస్టర్‌ల(ఎస్‌ఆర్) ఆధారంగా ఆయా శాఖల ఉన్నతాధికారుల ద్వారా సమగ్ర జాబితాను తమకు అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి సేకరించిన అంగీకార పత్రాలనే ఆప్షన్‌లుగా పరిగణించి వారికి నచ్చిన రాష్ట్రంలో పని చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసే క్రమంలోనే ఆగమేఘాల మీద ఇందుకు సంబంధించి జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల పాలన చేపట్టే క్రమంలోనే ముందుగా ఉద్యోగుల సర్ధుబాట్లుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ నెలలో ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం అంతకు ముందుగా, ముంపులో ఉండేందుకు ఇష్టపడే తెలంగాణ ఉద్యోగులను తీసుకునేందుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలోనే జాబితా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏడు మండలాలకు చెందిన మినిస్టీరియల్ సిబ్బందితో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారులు తగు నివేదికలతో రావాలని జిల్లా క లెక్టరేట్ నుంచి పిలుపు వచ్చింది.

బుధవారం జరిగే సమీక్షకు ముంపు మండలాల ఎంఈఓలు రావాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారి నుంచి సమాచారం వచ్చింది. మండలాల వారీగా ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ఎంతమంది ప్రస్తుతం పనిచేసే చోటనే ఉండేందుకు అంగీకరించారు..? ఎంతమంది ప్రస్తుతం పనిచేసే చోట ఉండమని తెలిపార..? అనేది పూర్తి స్థాయిలో వివరాలు, వారికి సంబంధించిన జాబితాను తీసుకు రావాల్సిందిగా డీఈఓ  నుంచి సమాచారం అందింది. ఈ విషయాన్ని ముంపు మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించారు.

 నెలాఖరు నాటికి బదిలీ ఉత్తర్వులు : ఈ నెలాఖరు నాటికి ముంపులో పనిచేస్తున్న అన్నిశాఖల ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముంపులో పనిచేసే వారందరికీ దాదాపు ఆప్షన్‌లు ఖాయంగా తెలుస్తోందని ఉద్యోగులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి సర్ధుబాట్లు చేసేంత వరకూ కొన్ని రోజులు అక్కడనే పనిచేసేలా కూడా ఒప్పందాలు జరిగే అవకాశం లేకపోలేదని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.

ఇదిలా ఉండగా ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది ప్రస్తుతం ఉన్న చోటనే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేందుకు అంగీకారం తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల వరకూ పరిశీలించినట్లైతే మొత్తం ఏడు మండలాల్లో సుమారు 490 మంది ఉపాధ్యాయులు తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇవ్వగా, 210 మంది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. తుది జాబితా సిద్ధమయ్యే సమయానికి కొంత మంది ఆప్షన్‌లు మార్చుకునే అవకాశం ఉందని ఎంఈఓలు తెలిపారు. దాదాపు అన్ని శాఖల్లో కూడా 30 నుంచి 40 శాతం వరకు ప్రస్తుతం పనిచేసే చోటనే అంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేందుకు ఆప్షన్‌లు ఇస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

 ముంపులో ఇక ఆంధ్ర సేవలు : ముంపు మండలాల్లో సెప్టెంబర్ 1 నుంచి దాదాపు అన్ని రకాల పౌర సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే అందనున్నాయి. సామాజిక పింఛన్‌లు, రేషన్ సరుకులు, ఇతర అన్ని వ్యవహారాలు ఏపీ ప్రభుత్వం చూడనుంది. వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా జరుగుతున్న పనులను కూడా నిలిపివేసి సెప్టెంబర్ 17న వాటికి సంబంధించిన జమా ఖర్చుల జాబితాను అందజేయాలని ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన బడ్జెట్ కేటాయింపులు కూడా ఆగస్టు నెల వరకే ఉన్నందున, సెప్టెంబర్ వేతనాలు, ఇతర ఖర్చులను ముంపులో ఏపీ ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే గత రెండు రోజుల క్రితం ఏపీ పోలీసు ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి సరిహద్దులను చూసి వెళ్లారు.

 మొత్తంగా చూస్తే ఈ నెలఖరునాటికి పంపకాల ప్రక్రియ ముగించేందుకే మన జిల్లా అధికారులు కూడా సిద్ధమయ్యారని, అందుకే ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement