నిరసనల హోరు... | concerns ongoing in caved areas | Sakshi
Sakshi News home page

నిరసనల హోరు...

Published Sat, Jul 5 2014 5:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

concerns ongoing  in caved areas

భద్రాచలం : ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో గిరిజన గురుకుల విద్యాలయ ఉద్యోగులు కూర్చోగా, టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూబన్న ప్రారంభించారు.

ఎమ్మెల్యే  సున్నం రాజయ్య, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కేంద్ర మాజీమంత్రి పోరిక బలరామ్‌నాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముంపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు  తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ముంపు మండలాల ప్రజల అభిప్రాయాల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్నారు.

ఈ ప్రాంత ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటకీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తోందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరామ్‌నాయక్ మాట్లాడుతూ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనేం చేయటం అన్యాయమన్నారు. అయితే ఆయన మాట్లాడుతుండగా.. ‘మీరు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, నాడు అడ్డుకోకపోవడం వల్లే ఇప్పుడు ఆదివాసీలకు అన్యాయం జరిగింది’ అని బలరాం నాయక్‌ను జేఏసీ నాయకులు నిలదీశారు.

శుక్రవారం నాటి దీక్షల్లో బాణోతు కృష్ణ, ఎం దేవదాసు, కృష్ణార్జునరావు, చంద్రయ్య, నాగముణి, మధు, శ్రీహరి, పద్మ, పార్వతి, రాంబాబు, బాలరాజు కూర్చున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్శిం హారావు, కొవ్వూరి రాంబాబు, జేఏసీ నాయకులు వెక్కిరాల, రామాచారి, సోమశేఖర్, జపాన్‌రావు, రామాచారి, బాలకృష్ణ, దాసరి శేఖర్, పూసం రవికుమారి తదితరులు మద్దతు పలికారు.

 నేటి నుంచి ఆంధ్ర బస్సులు నిలిపివేత...
  ఆర్డినెన్స్‌కు వ్యతిరేక పోరులో భాగంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు(72 గంటలు) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటామని జేఏసీ నాయకులు ప్రకటించారు. కాగా ముంపు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ శుక్రవారం కూడా మూత పడ్డాయి. ఇదిలా ఉండగా నెల్లిపాకలో ఏర్పాటు చేసిన ఆంధ్ర ఎక్సైజ్ చెక్‌పోస్టును తొలగించేందుకు టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు తదితరులు ప్రయత్నించారు.

అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఎక్సైజ్ సిబ్బంది అక్కడి నుంచి మరో చోటకు వెళ్లిపోయారు. చెక్‌పోస్టు ఏర్పాటుకు గుడిసెను ఎవరు అద్దెకు ఇచ్చారని జేఏసీ నాయకులు ఆరా తీసి, సదరు యజమానిని దీనిపై నిలదీశారు. చెక్‌పోస్టును వెంటనే తొలగించకపోతే తామే తీసేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement