స్తంభించిన రాకపోకలు | don't merge polavaram caved areas in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్తంభించిన రాకపోకలు

Published Sun, Jun 8 2014 1:36 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

స్తంభించిన రాకపోకలు - Sakshi

స్తంభించిన రాకపోకలు

భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: పోలవరం ముంపుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ముంపు మండలాల సరిహద్దు దిగ్బంధం విజయవంతం అయింది.  భద్రాచలంలో అఖిలపక్షం నాయకులు ప్రదర్శనగా  బ్రిడ్జి సెంటర్ వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బైఠాయించి పట్టణం నుంచి వెళ్లే వాహనాలు, వచ్చేవాహనాలను అడ్డుకున్నారు.
 
వివిధ పార్టీలు, ప్రజా, కుల, ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు  ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...  ‘ఖబడ్దార్ పాలకులారా ఇది ఆరంభం మాత్రమే’ అని నినదించారు. బ్రిడ్జి సెంటర్ వద్ద చేయి చేయి కలిపి రాస్తారోకో నిర్వహించారు.  అరుణోదయ కళాకారులు, ఆదివాసీలు పోలవరం వ్యతిరేక  పాటలను పాడుతూ లయబద్దంగా నృత్యం చేశారు.   
 
ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి  సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ...  అధికారంలోకి వచ్చిన మూడు రోజులలోనే మోడి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయటం దుర్మార్గమాన్నారు. ప్రాణాలు పోయినా మేం తెలంగాణాలోనే కొనసాగుతామని ఆదివాసీలు అరుస్తుంటే ప్రభుత్వాలు బలవంతంగా వారి హక్కులను, నోర్లను నొక్కి పరాయి రాష్ట్రాలకు తరిమేయాలని చూస్తున్నాయని విమర్శించారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపి నాయకులు వెంకయ్య నాయుడు పునరాలోచించి, ముంపు ప్రాంతాలను తెలంగాణాలోనే కొనసాగించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలలో నెలకొని ఉన్న భయాందోళలను తొలగించాలని కోరారు.   సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ...అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలపై ప్రేమ చుపూతూ  ఆదివాసీలను మోసం చేసిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తుల కోసమే ఆదివాసీల ప్రాణాలను  తాకట్టుపెట్టి ఆర్డినెన్స్‌ను జారీ చేశారని దుయ్యబట్టారు.  కొండరెడ్ల సంక్షేమ శాఖ అధ్యక్షుడు ముర్ల రమేష్ మాట్లాడుతూ.... ప్రభుత్వాలు ఒంటెత్తు పోకడలకు పోతే భంగపాటు  తప్పదని హెచ్చరించారు. ప్రజల ఆభిప్రాయం మేరకు ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
 
కాగా, తొలుత దిగ్బంధానికి అనుమతి లేదని పట్టణ సీఐ ఆంజనేయులు, ఎస్సై మురళీ అఖిల పక్షం నాయకులను అడ్డుకున్నారు. అనంతరం ఎస్పీ  రంగనాథ్‌తో మాట్లాడటంతో నిరసనకు అనుమతిని ఇచ్చారు.   ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, కల్పన, ముద్దా బిక్షం,  టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు టి. రాజేందర్, పినపాక నాయకులు డా. శంకర్ నాయక్, బీజేపి జిల్లా అధ్యక్షుడు  శ్రీధర్ రెడ్డి, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు  కూరపాటి రంగరాజు, వెంకటపతి రాజు, టీజేఏసి డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావ ు, వెక్కిరాల శ్రీనివాస్, గెజెటెడ్ ఆఫీసర్ సంఘం నాయకులు సీతారాములు,  టీడీపీ పట్టణ అధ్యక్షులు కుంచాల రాజారాం, కాంగ్రెస్ నాయకులు కుంజా ధర్మా, బొలిశెట్టి రంగారావు, సరెళ్ల నరేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యలమంచి రవికుమార్, బండారు రవికుమార్, ఎంబీ నర్సారెడ్డి, శరత్ బాబు,  తదితరులు పాల్గొన్నారు.
 
 చింతూరు మండల పరిధిలో....
 దిగ్బంధంలో భాగంగా విజయవాడ, జగ్దల్‌పూర్ జాతీయ రహదారిలోని ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గల చింతూరు మండలం చిడుమూరు వద్ద రహదారిపై చెట్లు అడ్డంగా వేసి నాయకులు బైఠాయించారు. భద్రాచలం, రాజమండ్రి రహదారిలోని తులసిపాక వద్ద , భద్రాచలం, విశాఖపట్నం రహదారిలోని చింతూరు మండలం తూలుగొండ వద్ద రహదారిని దిగ్బంధించారు. దీంతో వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టం నారాయణ, సీసీఎం జిల్లా నాయకులు ఏజే రమేష్, బ్రహ్మాచారి, ఆదివాసీసేన నాయకుడు గుండు శరత్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు బొడ్డు రాజా, సోయం భీమా తదితరులు పాల్గొన్నారు.
 
 వేలేరుపాడు, కుక్కునూరు  పరిధిలో.....
 కుక్కునూరు, అశ్వారావుపేట మండలాల నడుమగల లంకాల పల్లి గ్రామం వద్ద ఆదివాసీలు విల్లంబులు చేతపట్టి నిరసన తెలిపారు. తెలంగాణంలోనే ఉంటాం...సీమాంధ్రకు వెళ్లం అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యవర్గ సభ్యుడు గోకినేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా వేలేరుపాడు, అశ్వారావుపేటల మధ్య గల ఆంధ్రా, సరిహద్దు గ్రామం మేడేపల్లి గ్రామం వద్ద రహదారిని దిగ్బంధించారు.
 
కాగా, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు లంకాలపల్లి వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...పోలవరం ముంపుపేరుతో ఏడుమండలాలను తెలంగాణనుంచి విడదీయొద్దని చేతులు జోడించి ప్రధానమంత్రి మోడీని వేడుకున్నారు.    సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు విని అమాయకులైన ఏడమండలాల గిరిజనులు, గిరిజనేతరులు, వారి సంస్కృతీ సంప్రదాయాలను ముంచొద్దని వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement