రామయ్య ఇక్కడ.. ఆస్తులు అక్కడ
రామయ్య ఇక్కడ.. ఆస్తులు అక్కడ
Published Fri, Jul 11 2014 12:21 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
ఆర్డినెన్స్‌తో దేవస్థానం భూములు ఆంధ్రలోకి..
రామాలయ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం
భద్రాచలం : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రస్తుతం భద్రాచలం ప్రాంతమే చర్చనీయాంశమైంది. పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటమే ఇందుకు కారణం. ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా, నేడో రేపో దీనిపై వాడివేడిగా చర్చసాగనుంది. దీంతో పార్లమెంటు సాక్షిగా భద్రాచలం అంశమే హాట్‌టాపిక్‌గా మారింది.
భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలను, పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
రామాలయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామా న్ని తెలంగాణకు ఉండేలా ఆర్డినెన్స్‌లో పొందుపరిచా రు. దీని వల్ల రామాలయానికి సంబంధించిన భూములు ఉన్న ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోతుంది. ఇది శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాభివృద్ధిపై ప్రభావం పడనుంది.
భూములన్నీ ఆంధ్రలోనే..
భద్రాద్రి రామాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,250.67 ఎకరాల భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్ఛిమగోదావరి జిల్లాల్లో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఒక్క ఖమ్మం జిల్లాలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్న 30.25 ఎకరాలు భూమి మినహా మిగతా భూమి అంతా ఆర్డినెన్స్‌తో ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్లిపోతుంది. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనర్సింహారావు పేట లో ఉన్న 20 ఎకరాలు, అశ్వాపురం మండలం నెల్లిపాకలో 6.25, ముల్కలపల్లి మండల కేంద్రంలో 4 ఎకరాలు మాత్రమే తెలంగాణలో ఉంటాయి. భద్రాచ లం మండలం పురుషోత్తపట్నంలోనే రామాలయాని కి 889.50 ఎకరాల భూమి ఉంది.
ఇదే మండలంలోని పినపల్లి, మనుబోతుల చెరువు, చోడవరం, కాపవరం, రాచగొంపల్లి, బూర్గంపాడు మండలం సీతారామనగరంలో ఆలయ భూమలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్నారు. దీంతో ముంపు మండలాలతో కలుపుకొని ఇతర జిల్లాలో ఉన్న 1220.42 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ మొత్తం భూములకు గాను కౌలు రూపేణా రూ.20 లక్షల ఆదాయం వస్తుండగా, వీటి విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. రామయ్య భూములన్నీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో భవిష్యత్‌లో వీటి ద్వారా ఆదాయం పొందేందుకు ఆ రాష్ట్రానికి చెందిన దేవాదాయశాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుం ది. ఈ కారణంగా అనేక ఇబ్బందులు ఉంటాయని ఆలయ అధికారులు ఉంటున్నారు.
వసతి కేంద్రాలకు భూసమస్య...
ఆర్డినెన్స్‌కు ఆమోదం లభిస్తే భద్రాచలం ఆలయాభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. భక్తులకు వసతి కోసం కాటేజీలు, సత్రాలు కట్టాలన్నా పట్టణానికి ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తున్న పురుషోత్తపట్నం భూముల్లోనే నిర్మించాల్సి ఉంటుంది. సెయింట్ ఆన్స్ పాఠశాలకు అనుకొని ఉన్న భూముల్లో కాటేజీల నిర్మాణం కోసం గతంలో దేవస్థానం పాలకమండలి కూడా తీర్మానిం చింది. రామాలయం వద్ద భవనాల నిర్మాణానికి తగి నంత స్థలం లేకపోవటంతో పురుషోత్తపట్నం భూముల్లోనే వసతి కేంద్రాలు నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు ఈ భూమిలో బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆర్డినెన్స్ అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇక ఐటీడీఏకు సమీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ట్రైబల్ హట్, రామాయణం థీమ్ పార్కు నిర్మిస్తున్న ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్‌లోకే వెళ్లిపోతుంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల(సీతాకుటీరం)నకు వెళ్లే మార్గంలోని భద్రాచలం మండలంలో గల గ్రామాలను కూడా ఆర్డినెన్స్‌లో చేర్చటంతో సీతాకుటీరానికి భద్రాచలం మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించాకే తగు నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
Advertisement
Advertisement