భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం తీసుకున్న ముంపు మండలాల బదలాయింపు నిర్ణయంతో జిల్లాలోని ఆదివాసీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా ఏడు మండలాలను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయటంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భద్రాచలం డివిజన్‌లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా)మండలాలు, పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు,బూర్గంపాడు( ఖమ్మం నుంచి భద్రాచలం వచ్చేందుకు రోడ్ కనెక్టవిటీ నిమిత్తం 12 గ్రామాలు తెలంగాణలోనే ఉంచారు) మండలాల్లో గల 87 పంచాయితీలు, 324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రలో కలుస్తున్నాయి.
ఈ గ్రామాల్లో నివసిస్తున్న 1,91,792 మంది జనాభా తెలంగాణ నుంచి వేరుచేయబడుతున్నారు. అపాయింటెండ్ డే అయిన జూన్ 2 తరువాత ఈ గ్రామాలను జిల్లా నుంచి వేరు చేస్తూ సరిహద్దులు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే ఈ పరిణామాలను ఈ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముంపు వాసులకు కష్టకాలమే...
ముంపు మండలాల్లో ముందున్నదంతా కష్టకాలమేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వచ్చేది వర్షాకాలం.. మూడు నెలల పాటు గోదావరి పరివాహక వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక అంటువ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. రాష్ట్రంలో మలేరియా వ్యాధి పీడితులు సంఖ్య ఎక్కువగా నమోదయ్యేది ముంపు మండలాల్లోనే. గోదావరి వరదల సమయంలో ఈ మండలాలకు దారీ తెన్నూ ఉండదు. ఈ సమయంలో పునరావాస చర్యలకు అధికార యంత్రాంగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంటుంది.
జూన్ 2 తరువాత తమను జిల్లా నుంచి వేరుచేస్తుండడంతో ఈ కష్టాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం కేంద్రంగా చేపట్టే పునరావాస చర్యలే అంతంత మాత్రంగా ఉంటే, ఇక కాకినాడ లేదా రంపచోడవరం, పాల్వంచ డివిజన్ వాసులకు కోటరామచంద్రాపురం నుంచి చేపట్టే సహాయక చర్యలు ఏ మేరకు ఉంటాయోనని వారు భయాందోళనలకు గురవుతున్నారు.
ఎన్నో చిక్కులు...
రామాలయాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచుతున్నారు. పట్టణంలో అంతర్భాగంగా ఉన్న రాజుపేట, శ్రీరామ్‌న గర్ కాలనీలు ఆంధ్రలో కలసిపోతున్నాయి. రాజుపేట కాలనీలో ఇంటి పన్నులు సైతం భద్రాచలం పంచాయతీ వారే వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ కాలనీ సీమాంధ్రలోకి వెళుతుంది. భద్రాచలం నుంచి తెలంగాణలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు ఆంధ్రలో ఉన్న గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పట్టణానికి అనుకొని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాల పరిధిలోనే ఎక్కువగా విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్తుండడంతో ఇక్కడి విద్యార్థులకు అడ్మిషన్‌లు ఉంటాయా లేదా అనే సందిగ్ధిత ఏర్పడింది.
రామాలయం తెలంగాణలో ఉండగా, దీనికి సంబంధించి పట్టణానికి ఆనుకొని ఉన్న దేవస్థానం భూములన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. భద్రాచలం మండల కేంధ్రం తెలంగాణలో ఉంటుండగా, మిగతా గ్రామాలన్నీ ఆంధ్రలోకి వెళ్తాయి. ఇక్కడి విద్యార్థులకు ఈ ఏడాది అడ్మిషన్‌లకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఎవరు జారీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. బూర్గంపాడు మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే అంటుండటంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తాము ఆంధ్రలో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భద్రాచలం జిల్లా కేంద్రం అవుతుందని అంతా భావించారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో కూడా భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించారు. కానీ డివిజన్‌లో నాలుగు మండలాలు వేరు కానుండటంతో ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ భవిష్యత్‌లో వేరే చోటకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువగా నివసించే చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, వేలేరుపాడు వంటి మండలాలు ఆంధ్రలోకి పోతుండటంతో ఐటీడీఏను కూడా తరలిస్తారనే చర్చ సాగుతోంది. అధికారులు సైతం ఈ విషయంలో అవుననే అంటున్నారు. ఇలా ముంపు మండలాల బదలాయింపుతో భద్రాచలం అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
ముంపు.. ముప్పు..
Published Sun, Jun 1 2014 2:41 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement