‘ముంపు’ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
టీజేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
భద్రాచలం టౌన్: పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి వేరు చేయాలని జారీ చేసిన అక్రమ ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ టీజేఏసీ, ప్రజా, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ముఖ్య కూడళ్ల నుంచి తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులకు భంగం కల్గించేలా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను వేరు చేసి సంపదను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర స్థాయిలో ఆర్డినెన్స్ రద్దుకై ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, ఎస్‌కే గౌసుద్దీన్, పూసం రవికుమారి, కొండరెడ్ల సంఘ నాయకులు ముర్ల రమేష్, సీపీఎం నాయకులు జీఎస్ శంకర్‌రావు, టీఎఫ్‌ఎఫ్ నాయకులు బి రాజు, వెంకటేశ్వర్లు, వీరభద్రం, గెజిటెడ్ ఉద్యోగ సంఘ నాయకులు కె. సీతారాములు, నాయకపోడు సంఘ నాయకులు సంగం నాగేశ్వరరావు, బీఎస్‌పీ నాయకులు ఏవి రావు, మాలమహానాడు నాయకులు దాసరి శేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు కొండముక్కుల సాయిబాబా, ప్రజా సంఘాల నాయకులు జగదీష్, ఆదినారాయణ పాల్గొన్నారు.