భద్రాచలం: ముంపు మండలాలు సహా భద్రాచలం డివిజన్‌లో మండల పరిషత్ పాలకమండలి ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. అన్నిచోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఏక గ్రీవంగా జరిగింది. డివిజన్ కేంద్రమైన భద్రాచలానికి అటువైపునగల వాజేడు, వెంకటాపురం, చర్లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను టీడీపీ దక్కించుకుంది. కో-ఆప్షన్ సభ్యులు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే ఎంపికయ్యారు. దుమ్ముగూడెం మండలంలో సీపీఎం పాగా వేసింది.
ఆ పార్టీకి చెందిన వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయా పార్టీలకు పూర్తిస్థాయిలో మెజార్టీ ఉండటంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ముంపు మండలాల్లో వైఎస్‌ఆర్ సీపీ బలం చాటుకుంది. చింతూరు మండలంలో జడ్పీటీసీ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీనే గెలిచింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో వైస్ ఎంపీపీ స్థానం కూడా దక్కించుకుంది. చింతూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు పండా నాగరాజు వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. కూనవరంలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన గుజ్జా బాబు వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
భ ద్రాచలానికి మళ్లీ ఎన్నికలు జరుగాల్సిందేనా!
తెలంగాణలోని నాలుగు మండలాల్లో ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. ఒక్క భద్రాచలం మిన హా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో కూడా బుధవారం ఎన్నిక జరిగింది. భద్రాచలం మండలం పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామం మిన హా మండలంలోని మిగతా 70 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు.
మొత్తం 25 ఎంపీటీసీ స్థానాలకుగాను పట్టణంలో 13, రూరల్‌లో 12 ఉన్నాయి. మండలం మెత్తాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. ప్రస్తుతం ఒక్క భద్రాచలం మండల ఎంపీపీ ఎన్నిక మాత్రమే నిలిచిపోయింది. జడ్పీటీసీ స్థానం కూడా రిజర్వేషన్ మారే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో భద్రాచలం పట్టణం, ఆంధ్రలో నెల్లిపాక మండల కేంద్రంగా మళ్లీ మండల పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని సర్వత్రా చర్చ జరుగుతోంది.
అటు టీడీపీ.. ఇటు సీపీఎం
Published Thu, Aug 7 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement