ఖమ్మం మయూరిసెంటర్: జిల్లా నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు ముంపు మండలాల్లోని మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హమీ పథకం సిబ్బందిలో ఎక్కువమంది తెలంగాణలో పనిచేసేందుకే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో పనిచేసేందుకు 56 మంది ఆప్షన్ ఎంచుకోగా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందిని ఆప్షన్‌లు ఎంచుకోవాల్సిందిగా రెండునెలల క్రితం ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వారు ఎంచుకున్నారు. కూనవరం మండలంలో మొత్తం తొమ్మిది మంది ఉపాధి సిబ్బంది పనిచే స్తుండగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ మినహా మిగిలిన ఎనిమిది మంది ఆంధ్రాలో పనిచేసేందుకు సముఖత వ్యక్తం చేశారు.
జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న మొత్తం 64 మందిలో 56 మంది తెలంగాణలో పనిచేసేందుకు మొగ్గు చూపగా, ఎనిమిది మంది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. తెలంగాణలో పనిచేసేందుకు ఆప్షన్‌లను ఎంచుకున్న వారిలో ఆరుగురు ఏపీవోలు, ఆరుగురు ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌లు, 24 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు కూనవరం మండలంలోని ఒక ఏపీవో, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్‌లు నలుగురు ఉన్నారు.
{పస్తుతం ఉపాధి హామీ సిబ్బంది అందరూ ఆయా ముంపు మండలాల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేంత వరకు అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఆప్షన్ పెట్టుకున్న సిబ్బంది ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే వారు కలెక్టరేట్‌లో రిపోర్టు చేస్తే పోస్టింగ్ ఇస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఆప్షన్ ఎంచుకున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేందుకు ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యూవ ల్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ పని చేసేందుకు సుముఖంగా ఉన్న వారిని మళ్లీ వి ధుల్లోకి తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే వారిని ఇతర మండలాల్లో భర్తీ చేసే అవకాశం ఉంది.
ముంపు మండలాల్లో జరిగిన ఉపాధిహామీ పథకం పనుల్లో అనేక అవతవకలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు మొత్తం ఏడు విడతల్లో సోషల్ ఆడిట్ నిర్వహించారు.
సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేస్తున్నారు. ఇంకా రూ.2.50లక్షల వరకు రికవరీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రికవరీలను కూడా ఏపీకి బదిలీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో ఇక నుంచి రికవరీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టనుంది.
ఉపాధి సిబ్బంది తెలం‘గానం’
Published Mon, Sep 22 2014 1:56 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement
Advertisement