
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులు
ఖమ్మం గాంధీచౌక్: ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో ఆదివారం నిర్వహించిన శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా సాగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన మూడు వేల మందికి పైగా భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టగా.. భక్తులు లక్ష హనుమాన్ చాలీసా (108 సార్లు)ను పఠించారు.
వేదిక ఎదుట మహిళా భక్త బృందాలు కోలాటం ఆడగా.. శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి వలంటీర్లు భక్తులకు సేవలందించారు. భక్తులు, ఇతరులతో కలిపి మొత్తం నాలుగు వేల మందికి అన్నదానం చేశారు. కాగా ఈ శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులు దక్కాయి.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కార్యక్రమాన్ని నిర్వహించడంతోనే అవార్డులకు ఎంపిక చేశామని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గన్నవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.