Wonder Book of Records
-
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి జస్టిస్ అమర్నాథ్గౌడ్
సాక్షి, హైదరాబాద్: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఈ పురస్కారాన్ని న్యాయమూర్తికి అందజేశారు. 2017లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జస్టిస్ అమర్నాథ్గౌడ్ 92 వేల కేసులు పరిష్కరించారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన్ను సుప్రీంకోర్టు కొలీజియం 2017లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. అనంతరం త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. -
కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం జలాలకు ఇచ్చిన లక్ష జన హారతి.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో చోటు దక్కించుకుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలం ఈటూరు నుంచి పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల చెరువు వరకు 68 కిలో మీటర్ల పొడవున, 126 గ్రామాల పరిధిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ డీబీఎం–71 కాలువ ద్వారా ప్రవహించే గోదావరి జలాలకు లక్ష హారతి కార్యక్రమం నిర్వహించారు. చివ్వెంల మండలం కాలువ వద్ద నిర్వహించిన సంబరాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన ఐడబ్ల్యూఎస్ఆర్ చీఫ్ డాక్టర్ బి.నరేందర్‌గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ గంగాధర్. మెడల్, మెమెంటో, ప్రశంసాపత్రాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి అందజేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు చివ్వెంల వద్ద, జాజిరెడ్డిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు మెమెంటోలు అందజేశారు. లక్ష అనుకుంటే అంతకు మించి జనం మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరు మండలాలకు చెందిన 126 గ్రామాల్లో వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధుల బృందం పర్యటించింది. కాళేశ్వరం జలాలకు లక్ష మందితో జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో 1,16,142 మంది పాల్గొన్నట్లు బృందం నిర్ధారించింది. ఇందులో 65,042 మంది మహిళలు, 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు వెల్లడించింది. 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లతో చిత్రీకరణ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్‌కు చెందిన మూడు బృందాల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లను వినియోగించారు. 62 కళా బృందాలు, 126 చోట్ల డప్పు మేళాలు, 54 బతుకమ్మ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. కాలువ పొడవునా లక్ష మందికీ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సన్మానించారు. కేసీఆర్‌తోనే సాధ్యమైంది: మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు.. ఈ ప్రాంతానికి నీరు అందాలి అంటే గోదావరి జలాలే శరణ్యం అని భావించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్ కృషితోనే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు నీళ్లు పారుతున్నాయన్నారు. అందుకు సీఎంకి కృతజ్ఞత చెప్పుకునేందుకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటిపారుదల దినోత్సవం రోజున ఈ ప్రాంత రైతాంగం కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి నిర్వహించామన్నారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్సీపీకి సర్టిఫికెట్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదానం రికార్డులకెక్కింది. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికెట్ అందింది. మంగళవారం ఈ సర్టిఫికెట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లితో కలిసి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. చదవండి: (రక్తం పంచిన అభిమానం) ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ జన్మదినం సందర్భంగా చేసిన రక్తదానం రికార్డులకెక్కింది. మేము రికార్డుల కోసం పనిచేయలేదు. కోవిడ్ సమయంలో రక్తం కొరత దృష్టిలో ఉంచుకొని ఓ మంచి పనిని చేపట్టాం. పార్టీ కార్యకర్తలుగా మాకు గర్వంగా ఉంది. ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు మేము రక్తం అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని సేవా కార్యాక్రమాలు చేస్తాం' అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
హేట్సాఫ్ టు సాక్షి
సాక్షి, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన సవితాల సుబ్బలక్ష్మి పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన ఆమె ఒక ప్రై వేట్ సంస్థలో చిరుద్యోగి. తండ్రి వేణుగోపాలకృష్ణ మరణంతో తల్లితో కలసి ఉంటున్నారు. సుబ్బలక్ష్మికి మొదటినుంచీ ’సాక్షి’ దినపత్రిక అంటే ఇష్టం. అందులోనూ ఫ్యామిలీ పేజీల్లో ప్రచురితమయ్యే వెజ్, నాన్‌వెజ్ కర్రీల వివరాలు చదివి, ఆ క్లిప్పింగులను భద్రపరిచేవారు. ఈవిధంగా 2010 అక్టోబర్ నుంచి 2018 డిసెంబర్ వరకూ ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వంటకాలకు సంబంధించిన క్లిప్పింగులను పదిలపరచి, బైండింగ్ చేయించారు. ఈ సేకరణకు గానూ ఆమె పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఆమె ఆదివారం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న ’వింతలు – విచిత్రాలు’ శీర్షికకు సంబంధించిన క్లిప్పింగులను కూడా పదిలపరిచానని, త్వరలో మరో మూడు బుక్ ఆఫ్ రికార్డుల్లో తన పేరు నమోదు కానున్నదని సుబ్బలక్ష్మికి తెలిపారు. పరోక్షంగా తనకు గుర్తింపు తీసుకువచ్చిన ’సాక్షి’కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
5 నిమిషాల్లో 900 పంచ్‌లు
సాక్షి, అమ్రాబాద్ (అచ్చంపేట): పదర మండలం రాయలగండి కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని మహేశ్వరి కరాటేలో ఐదు నిమిషాల రెండు సెకన్లలో 900పంచ్‌లు కొట్టి ప్రపంచవండర్ బుక్ రికార్డు సాధించింది. విక్టరీ షోటోకాన్ ఆసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలో వండర్బుక్ ఇంటర్నేషనల్ రికార్డు పోటీలు నిర్వహించారు. మొత్తం 200మంది బాలికలు పాల్గొన్నారు. అయితే, అందరూ కలిసి 5.2 నిమిషాల్లో ఒక లక్ష 50వేల పంచ్‌లు కొట్టగా.. మహేశ్వరీ అదే సమయానికి అత్యధికంగా 900 పంచ్‌లు కొట్టి వండర్బుక్ రికార్డు సాధించింది. ఈమేరకు వండర్బుక్ ఆఫ్ చీఫ్ ఇండియా కో–ఆర్డినేటర్ బింగి నరెందర్గౌడ్ చేతులమీదుగా రికార్డు నమోదు పత్రాన్ని అందుకుంది. ఈమేరకు సోమవారం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయానికి వచ్చిన విద్యార్థిని మహేశ్వరిని ఎస్ఓ ఉమాదేవి, వెన్నెల, మాస్టర్ లవకుమార్‌తో పాటు, ఉపాధ్యాయులు, తోటివిద్యార్థులు అభినందించారు. ఒక్క కరాటేలోనే కాదు అన్నిరంగాల్లో పట్టుదలతో క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకెళ్తూ విద్య కొనసాగించాలని ఈ సందర్భంగా ఎస్ఓ ఉమాదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. -
వండర్‌బుక్‌లో మణిపూసలు
తాండూరు టౌన్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఆణిముత్యం, మణిపూసల సృష్టికర్త, కవి వడిచర్ల సత్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పరిచయం చేసిన ‘మణిపూసలు’ అనే నూతన కవితా ప్రక్రియకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో వడిచర్ల సత్యం దంపతులను వండర్బుక్ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి3 ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. సత్యం సృష్టించిన మణిపూసలు కవితా ప్రక్రియ అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ తెలుగు సాహిత్యంలోనూ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు సాహిత్య లోకంలో 30 వరకు నూతన కవితా ప్రక్రియలు వచ్చాయని, అయితే అన్నింటిలోకెల్లా మణిపూసలను అనేక మంది కవులు అనుసరించారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్టు అధికారి మోహన్, నేటినిజం పత్రికా సంపాదకులు దేవదాస్, రామదాసు, సమ్మన్న, వండర్ బుక్ భారత్ కోఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంజిలప్పకు సన్మానం... బొంరాస్‌పేట: తెలుగు సాహిత్యంలోకి నూతనంగా ప్రవేశించిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ రచనల్లో మండల పరిధిలోని రేగడిమైలారానికి చెందిన రచయిత అంజిలప్పకు సన్మానం దక్కింది. నియోజకవర్గం నుంచి మణిపూసలు రాసినందుకు గానూ పలువురు సాహితీవేత్తలు అంజిలప్ప సత్కరించారు. -
వండర్ బుక్‌లో ‘ఆదిత్య’కు చోటు
బాలల చిత్రం ‘‘ఆదిత్య’ క్రియేటివ్ జినియస్’కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం రావడంపై తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ బాలల చిత్రాన్ని రూపొందించారు. నవంబర్4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్‌ను అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది ఆదిత్య క్రియేటివ్ జీనియస్. వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, నటులు బ్రహ్మానందం, సుమన్, చిత్రయూనిట్ పాల్గొన్నారు. -
స్ఫూర్తి నింపే చిత్రాలు రావాలి
‘‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’ సినిమా చాలా బాగుంది. చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూపించారు. బాల–బాలికల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి గొప్ప చిత్రాలు తరచూ రావాలి’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. 2015 నవంబర్4న విడుదలైన ఈ చిత్రం 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం అందుకుంది. తాజాగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఆదిత్య’ చిత్రంలో నేనూ నటించాను. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే మా చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారం అందించారు’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్. నటుడు సుమన్ పాల్గొన్నారు. -
నాన్ స్టాప్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు
సాక్షి, హైదరాబాద్ : దివ్యాంగుడైన (డౌన్ సిండ్రోమ్ ) 9 ఏళ్ల బుడతడు 35 నిమిషాల నాన్ స్టాప్ డ్యాన్స్‌తో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. బోయిన్‌పల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడ చెందిన భవానీ–లోకేష్ కుమారుడు తపష్ డ్యాన్స్‌లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. హిప్ అప్, వెస్ట్రన్, బాలీవుడ్, మాస్ బీట్, ఫోక్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్‌లకు అనుగుణంగా స్టెపులు వేస్తూ 35 నిమిషాల పాటు నిర్విరామంగా నృత్యం చేసి ఆకట్టుకున్నాడు. ఈ కేటగిరీలో ఇప్పటి వరకు ఉన్న 18 నిమిషాల రికార్డును తపష్ బద్దలు కొట్టాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు బింగి నరేందర్‌గౌడ్, స్వర్ణ బాలుడికి రికార్డు పత్రాన్ని, షీల్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా తపష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ చిన్నారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ ఆ దిశగా ప్రోత్సహించామన్నారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కోలాటం
సప్తగిరికాలనీ(కరీంనగర్): జనజానపద వృత్తి కళాకారుల సమాఖ్య కోలాట బృందానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ కోలాట బృందం 1,500 మంది మహిళలతో కరీంనగర్ పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం పది నిమిషాలపాటు కోలాటం చేసింది. దీంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బృందం పేరు నమోదైంది. కోలాట బృందానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, జిల్లా ప్రతినిధి విజయభాస్కర్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన జానపద కళాకారుల ప్రతినిధులు ఇస్మాయిల్, కృపాదానంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
భారత మాతకు దివ్య హారతి
సాక్షి, హైదరాబాద్: భారత మాత వేషధారణలో 1,500 మంది విద్యార్థులు.. మూడు రంగుల వస్త్రధారణతో త్రివర్ణ పతాక ఆకృతి.. గంభీరంగా భారతమాత విగ్రహం.. దేశ ఔన్నత్యాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇవన్నీ భారత మాతకు దివ్య హారతినిచ్చాయి. దేశంలోనే మొదటిసారిగా శుక్రవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న పీపుల్స్ ప్లాజాలో భారత మాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగగా... రాత్రి 9.15 నిమిషాలకు భారతమాతకు హారతి, త్రివర్ణ పతాక హారతి, గంగా హారతి, గోప్రకృతి హారతి, మహనీయుల హారతి, భారత రత్న హారతి, త్రివిధ దళాల హారతి, వేద హారతి నిర్వహించారు. గర్వంగా చెప్పుకొందాం.. అందరం భారతీయులమని సగర్వంగా చెప్పుకొందామని.. విశ్వగురువుగా అడు గులు వేసే శక్తి ఈ దేశానికి ఉందని స్వామి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. స్త్రీజాతికి ప్రథమ స్థానం ఇచ్చిన దేశం మనదని, మానవత్వమనే సందేశాన్ని పంచి.. మంచి, మర్యాదలను పెంచిందని చెప్పారు. భారతదేశం విలువ తెలియాలంటే.. దేశం దాటి ఇతర దేశాలకు వెళ్లాలని, ఒకటి రెండు రోజుల్లోనే మన దేశం విలువ తెలుస్తుందని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద ఎన్ని దేశాలు చుట్టినా.. చివరికి భారత గడ్డ మీద విమానం దిగగానే భూమిని ముద్దాడారని గుర్తుచేశారు. కార్యక్రమం అనంతరం పలువురు ప్రముఖులను కిషన్‌రెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హారతి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం 15 వందల మంది విద్యార్థినులు ఒకే చోట భారత మాత వేషధారణతో నిర్వహించిన ‘భారతమాతకు హారతి’కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘గొర్రిపూడి’ విద్యార్థినులు
కరప ( కాకినాడ రూరల్) : కరప మండలం గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఇంటింటా అన్నమయ్య శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. కాకినాడలోని శ్రీ జ్యోతి నృత్య కళానికేత¯ŒSలో హైసూ్కల్ విద్యార్థినులు పాలాని సత్యశ్రీ, శిరీష, సంధ్య, మాలాశ్రీ, దేవి, జ్యోతి, అనూష, నందిని, వీరలక్ష్మి, రోహిత, సింధు, లక్ష్మీదుర్గ, దుర్గాదేవి, లక్ష్మీకుమారి, రాణి తదితర 105 మంది గతనెల 28వ తేదీన కాకినాడలో మూడు రకాల కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానంలో సంపాదించారు. జ్యోతి నృత్య అకాడమీ వ్యవస్థాపకురాలు మద్దనాల వీరవెంకట లక్ష్మీజ్యోతి, కోశాధికారి ఎం.ప్రసాద్‌లు మంగళవారం గొర్రిపూడి హైసూ్కల్‌కు వచ్చి సర్పంచ్ జల్దాని సుబ్బలక్ష్మి, ఏసు గంగాధర్, ఇ¯ŒSచార్జి హెచ్ఎం వెంకటరత్నంలు విద్యార్థులకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఇచ్చిన «సర్టిఫికెట్లను అందజేశారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘అంబిటస్’
సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలోని అంబిటస్ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాజ్యాంగం ప్రవేశిక, హక్కులు మొదలైన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఒకేసారి 545 మంది విద్యార్థులచే రాజ్యాంగం ఆమోదించిన సంవత్సరం 1949 ఆకారంలో నిలబెట్టి రాజ్యాంగ ప్రవేశికను మూడుసార్లు చూడకుండా చదివించి రికార్డు సాధించింది. ఈ ఘనతను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నమోదు చేసినట్లు ఆ సంస్థ భారతదేశ ప్రతిని«ధి బింగి నరేందర్‌గౌడ్ తెలిపారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అనంతరం సంస్థ ప్రతినిధులు విద్యార్థులు సృష్టిం చిన రికార్డును ప్రకటించి ప్రిన్సిపాల్ ఎడ్ల జ్యోతికి అందించారు. -
వండర్ బుక్ రికార్డ్స్‌లో ఎస్పీ బాలుకు చోటు
హిమాయత్‌నగర్ (హైదరాబాద్) : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లండన్‌కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జి స్వర్ణశ్రీ తదితరులు మంగళవారం బాలుకు ఆయన కార్యాలయంలో రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎస్పీ బాలు మాట్లాడుతూ... 18 భాషల్లో 35వేల పాటలు పాడిన తనకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. లండన్‌కు సంబంధించిన సంస్థ తనను గుర్తించిన విషయం మరిచిపోలేనని చెప్పారు. -
సూక్ష్మ చిత్రాల కళాకారుడికి ప్రపంచ గుర్తింపు
పెనమలూరు : కళాకారుడి శ్రమకు తగిన ప్రతిఫలం 'గుర్తింపు'. కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన కళాకారుడు పామర్తి శివ కృషికి మరోసారి ఈ తరహా గుర్తింపు లభించింది. ఆయన గతంలో చాక్‌పీసులు, కొవ్వొత్తులు, బియ్యపు గింజలు తదితర వస్తువులపై వేసిన సూక్ష్మ చిత్రాలను ప్రపంచ రికార్డుగా లండన్‌కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. శివకు ప్రశంసాపత్రాన్ని పోస్టు ద్వారా పంపింది. దీంతో శివ ఇప్పటివరకు 16 రికార్డులు కైవసం చేసుకున్నట్లయింది. -
అబ్బురం.. అరవ దాసు సాహస విన్యాసాలు
నెల్లూరు(బృందావనం) : ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలన్న ఆశయంతో నెల్లూరుకు చెందిన అరవ దాసు ప్రదర్శించిన సాహస విన్యాసాలు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధుల ఎదుట ప్రదర్శించిన సాహసాలు అబ్బురపరిచాయి. స్థానిక సుబేదారుపేట సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో బుధవారం జరిగిన ‘రికార్డుల నమోదు’ కార్యక్రమం విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే... స్థానిక కపాడిపాళేనికి చెందిన అరవ దాసు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలన్న సంకల్పంతో తొమ్మిది కేజీల బరువు ఉన్న సిమెంట్ దిమ్మెను బొటనవేలి గోరుకు ఇనుప తీగ కట్టి ఐదు అడుగులకుపైగా ఎత్తి 74 సెకన్ల పాటు రెండు పర్యాయాలు ప్రదర్శించారు. అనంతరం 4.800 కేజీల బరువు ఉన్న రెండు కాలుతున్న గడ్డపారల(మొత్తం 9.600 కేజీలు)ను రెండు చేతులతో పట్టుకుని కర్రసాములో కర్రలను తిప్పినట్లు నిమిషం 16 సెకన్ల పాటు ప్రదర్శించి హర్షధ్వానాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి, రికార్డు నమోదు చేసేందుకు హైదరాబాద్ నుంచి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సౌత్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేంద్రగౌడ్, వండర్బుక్ ఆఫ్ రికార్డ్సు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ కో-ఆర్డినేటర్ గుర్రం స్వర్ణశ్రీ హాజరయ్యారు. అద్భుత ప్రదర్శన నెల్లూరులో అరవ దాసు ప్రదర్శించిన విన్యాసాలు అద్భుతం. ఎంతో క్లిష్టతరమైనవి. ఆయన 57 ఏళ్ల వయస్సులో గోటితో బరువును ఎత్తడం ప్రపంచ రికార్డుగా భావిస్తున్నాం. ఈ విషయాన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేసే వారికి దృష్టికి తీసుకెళ్తాం. పేదరికంతో బాధపడుతున్న అరవ దాసును జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోత్సహించి, జీవనభృతికి కల్పించాలని కోరుతున్నాం. - -బింగినరేంద్రగౌడ్, గుర్రం స్వర్ణశ్రీ, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు ప్రోత్సాహం కావాలి మంచాలు అల్లుకుని జీవనం సాగిస్తున్నాను. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాలని ఉంది. ఇందు కోసం 1991 సంవత్సరం నుంచి పలు విన్యాసాలు చేశాను. సాహస క్రీడలు ప్రదర్శిస్తున్నాను. ప్రోత్సాహం కావాలి. కుమార్తెలు అరవ అశ్విని పీజీ, షీబారాణి డిగ్రీ చదువుతున్నారు. గతంలో గడ్డంతో ఇటుకలు, గొంతుకు ఇనుప కడ్డీతో ట్రాక్టర్‌ను నెట్టడం, జట్టుతో లాగడం తదితర విన్యాసాలు నెల్లూరులో ప్రదర్శించాను. - అరవ దాసు