భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హారతి
సాక్షి, హైదరాబాద్: భారత మాత వేషధారణలో 1,500 మంది విద్యార్థులు.. మూడు రంగుల వస్త్రధారణతో త్రివర్ణ పతాక ఆకృతి.. గంభీరంగా భారతమాత విగ్రహం.. దేశ ఔన్నత్యాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇవన్నీ భారత మాతకు దివ్య హారతినిచ్చాయి. దేశంలోనే మొదటిసారిగా శుక్రవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న పీపుల్స్ ప్లాజాలో భారత మాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగగా... రాత్రి 9.15 నిమిషాలకు భారతమాతకు హారతి, త్రివర్ణ పతాక హారతి, గంగా హారతి, గోప్రకృతి హారతి, మహనీయుల హారతి, భారత రత్న హారతి, త్రివిధ దళాల హారతి, వేద హారతి నిర్వహించారు.
గర్వంగా చెప్పుకొందాం..
అందరం భారతీయులమని సగర్వంగా చెప్పుకొందామని.. విశ్వగురువుగా అడు గులు వేసే శక్తి ఈ దేశానికి ఉందని స్వామి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. స్త్రీజాతికి ప్రథమ స్థానం ఇచ్చిన దేశం మనదని, మానవత్వమనే సందేశాన్ని పంచి.. మంచి, మర్యాదలను పెంచిందని చెప్పారు. భారతదేశం విలువ తెలియాలంటే.. దేశం దాటి ఇతర దేశాలకు వెళ్లాలని, ఒకటి రెండు రోజుల్లోనే మన దేశం విలువ తెలుస్తుందని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద ఎన్ని దేశాలు చుట్టినా.. చివరికి భారత గడ్డ మీద విమానం దిగగానే భూమిని ముద్దాడారని గుర్తుచేశారు. కార్యక్రమం అనంతరం పలువురు ప్రముఖులను కిషన్‌రెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హారతి
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
15 వందల మంది విద్యార్థినులు ఒకే చోట భారత మాత వేషధారణతో నిర్వహించిన ‘భారతమాతకు హారతి’కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment